150 మంది అభ్యర్ధులను మార్చినా వైసీపీ గెలవదు

-జగన్ కు ఓటమి భయం పట్టుకుంది….అందుకే అభ్యర్థుల మార్పు
-జగన్ ను ఇంటికి పంపేందుకు ప్రజలు ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారు
-ఈ దుర్మార్గాలకు విరుగుడు ప్రజా చైతన్యమే
-ఓడిపోతారని చెప్పి దళిత నేతలను మార్చారు…మరి పెద్దిరెడ్డి, బాలినేని, ద్వారంపూడిలను ఎందుకు మార్చలేదు?
-తుఫాను సాయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం. ప్రభుత్వ అసమర్థతతో రైతుకు నష్టం పెరిగింది
-ప్రజల అభిప్రాయాల ప్రకారమే టీడీపీ లో టిక్కెట్లు…టిక్కెట్ల కేటాయింపులో కొత్త విధానం
-మీడియా సమావేశంలో నారా చంద్రబాబు నాయుడు

అమరావతి:- 2024లో జరిగే ఎన్నికలు 5 కోట్ల మంది ప్రజలకు నియంత జగన్ రెడ్డికి మధ్య జరుగుతున్న యుద్దం అని….వీటిపైనే రాష్ట్ర భవిష్యత్ ఆధారపడి ఉందని నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీలు వ్యక్తులు కాదు….రాష్ట్రం గెలవాలి అని అన్నారు. జగన్ కు ఓటమి భయం పట్టుకుంది….అందుకే అభ్యర్థుల మార్పు చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. వైసీపీ 150 మంది అభ్యర్ధులను మార్చినా వైసీపీ గెలవదు అని అన్నారు. జగన్ ను ఇంటికి పంపేందుకు ప్రజలు ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో ఇంత విఫలం అయిన ముఖ్యమంత్రి ఎవరూ లేరు అని అన్నారు. జగన్ ను ఇంటికిపంపేందుకు ప్రజలు ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారు అని చంద్రబాబు అన్నారు.

మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో చంద్రబాబు నాయడు మాట్లాడుతూ…. మిచౌంగ్ తుఫాన్ రాష్ట్రాన్ని రైతాంగాన్ని కనీవినీ ఎరుగని విధంగా నష్ట పరిచింది. 15 జిల్లాల్లో దాదాపు 22 లక్షలఎకరాల్లో పంటనష్టం జరిగింది. తుఫాన్ వస్తుందని తెలిసీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ముందే స్పందించి తగిన శ్రద్ధ తీసుకొని ఉంటే చాలావరకు నష్టాన్ని నివారించే అవకాశముండేది. తుఫాన్లు, ఇతర ప్రకృతి విపత్తుల్ని నిలువరించలేంగానీ, నష్టాన్ని నివారించడానికి ముందు జాగ్రత్తలు తీసుకోవచ్చు. కానీ ఈ ప్రభుత్వం ఆ విధంగా పనిచేయడంలో విఫలమైంది.

గోదావరిలో వరద ముందే ప్రారంభమై, పోలవరం ప్రాజెక్ట్ కు ముందుగానే నీళ్లు వస్తాయి. పైన ఉండే ప్రాజెక్టులన్నీ నిండాక, కృష్ణా నదికి చివరిగా నీళ్లు వస్తాయి. నవంబర్, డిసెంబర్ నెలల్లో రాష్ట్రంపై తుఫాన్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ గమనించే పట్టిసీమ పూర్తి చేశాం. దానివల్ల ముందే నీళ్లిస్తే నవంబర్ కంటే ముందే ధాన్యం రైతులు నష్టపోకుండా బయటపడేవారు. అలాంటి పట్టిసీమను ఈ ముఖ్యమంత్రి నాలుగేళ్లపాటు నిరుపయోగంగా మార్చాడు. నేను పూర్తిచేశాననే ఉద్దేశంతోనే నాలుగేళ్లు దాన్ని ఆపరేట్ చేయలేదు. విధిలేని పరిస్థితుల్లో, ప్రజలు తంతారనే ఈ సంవత్సరం పట్టిసీమను ఆపరేట్ చేశారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది.

ఈ ప్రభుత్వం ఇరిగేషన్ రంగంపై శీతకన్ను వేసింది. ప్రాజెక్టులు అయినా, ప్రభుత్వ ఆస్తులైనా నిర్మించడం ఎంత ముఖ్యమో, వాటిని నిర్వహించడం కూడా అంతే ముఖ్యం. ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ లోని కడియం ప్రాజెక్ట్ వరదలతో దెబ్బతిని గేట్లు మూసుకపోయి ప్రాజెక్ట్ పై నుంచి నీళ్లు పారాయి. అప్పటినుంచీ ప్రాజెక్టుల నిర్వహణకుకూడా నిధులు కేటాయించాం. ఈ ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్వహణను పూర్తిగా వదిలేసింది. అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయినా పట్టించుకోలేదు. తర్వాత పులిచింతల ప్రాజెక్ట్ గేట్లు కొట్టుకపోయాయి. గుండ్లకమ్మ ప్రాజెక్ట్ గేట్లు తొలుత కొట్టుకు పోయినప్పుడు స్వయంగా వెళ్లి పరిశీలించాను.

ఆనాడు గేట్లు పెట్టడానికి ఈ ప్రభుత్వాన్ని నమ్మి ఏ కాంట్రాక్టర్ ముందుకు రాలేదు. రూ. 8 కోట్ల పనులు చేయడానికి కూడా కాంట్రాక్టర్ రాలేదంటే ఈ ప్రభుత్వంపై విశ్వాసం లేనందునే. మొన్న మళ్లీ గుండ్లకమ్మ ప్రాజెక్ట్ గేట్లు కొట్టుకుపోయాయి. దాంతో కరువు ప్రాంతంలో నీళ్లు లేకుండాపోయాయి. ఈ సంవత్సరం రైతులు పరిస్థితి దారుణంగా తయారైంది. కరువు ఒకపక్క, తుఫాన్లు ఒకపక్క. మొదట కరువు వల్ల 26 లక్షల ఎకరాల్లో పంటలు వేయలేదు. ఏవో ఇబ్బందులు పడి, అప్పులుచేసి పంటలు వేస్తే సకాలంలో వర్షాలు లేక దిగుబడి తగ్గిపోయింది.

ఇప్పుడు ఈ తుఫాన్ వల్ల 15 జిల్లాల్లో దాదాపు 22 లక్షల ఎకరాల్లో పంట లు మునిగిపోయాయి. వర్షపు నీరు సక్రమంగా పోయేలా ఈ ప్రభుత్వం కాలువలు, డ్రెయిన్లను సరిగా నిర్వహించలేకపోయింది. వచ్చిన నీరు వచ్చినట్టు… కాలువల ద్వారా వెళ్లిపోయి ఉంటే, ఇంత నష్టం జరిగేది కాదు. చివరకు సముద్రానికి, నీటమునిగిన పంట పొలాలకు వ్యత్యాసం లేనంత దారుణంగా పనిచేశారు. డ్రెయినేజ్ వ్యవస్థను, ఇరిగేషన్ రంగాన్ని పట్టించుకోకుండా ఈ ముఖ్య మంత్రి రాష్ట్ర రైతాంగాన్ని ముంచేశాడు. కొన్ని లక్షల కుటుంబాలు అప్పుల పాలై మొత్తం మునిగిపోయారు. కౌలు రైతులైతే దారుణంగా నష్ట పోయారు. భూమిని బట్టి ఎకరాకు రూ.20వేల నుంచి రూ.50వేలవరకు కౌలు చెల్లించి వేసిన పంటలు మొత్తం వరదతో నాశనమయ్యాయి.

రాష్ట్రంలో ఈ స్థాయిలో పంట నష్టం జరిగితే ప్రభుత్వం ప్రాథమిక అంచనా వేసి ప్రజలకు తెలియ చేయాలి కదా! కేంద్రబృందానికి చెప్పాలి కదా! కానీ ఈ ప్రభుత్వం అవేవీ చేయలేదు. ఏ పంటకు ఎంత నష్టపరిహారం ఇస్తున్నారో ఇప్పటికీ చెప్పలేని దుస్థితిలో ఉన్నారు. వరి, పొగాకు, పత్తి, మిర్చి, ఉద్యానవన పంటలకు ఎంత చెల్లిస్తు న్నారో, అపరాలకు ఎంత పరిహారమిస్తున్నారో చెప్పరు. విపత్తు వచ్చినప్పుడు ప్రజలకు నమ్మకం, భరోసా కల్పించాలి. ముఖ్యమంత్రి అంటే ఒక బాధ్యత. కానీ ఆ భరోసా కల్పించడంలో ఘోరంగా విఫలమయ్యారు.

శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు రైతాంగం నష్టపోతే, ఎంత నష్టంజరిగింది .. ఎంత పరిహారం ఇస్తున్నామని చెప్పలేని స్థితిలో ఉన్నారు. రాష్ట్రానికి, రైతంగానికి జరిగిన నష్టాన్ని కళ్లారా చూసిన నేను జాతీయ విపత్తుగా పరిగణించి ఆదుకోవాలని కేంద్రానికి లేఖ రాశాను. ఎక్కడలేని నష్టం జరిగింది కాబట్టి సహకరించాలని కేంద్రాన్ని కోరాను. కానీ ఈ ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ బాధ్యతారాహిత్యంగానే వ్యవహరిస్తోంది. మొత్తం రూ.3,711 కోట్ల నష్టం జరిగిందని నివేదికలు ఇస్తున్నారు. దాంట్లో రూ.2,641కోట్లు ఆర్ అండ్ బీ రోడ్లకు, రూ.703కోట్ల పంటనష్టం జరిగిందని చెబుతున్నారు. 703 కోట్ల పంటనష్టం జరిగిందంటే కేంద్రం రూ.50 కోట్లో, రూ.100కోట్లో ఇస్తుంది.

రాష్ట్ర విపత్తు సహాయ నిధిలోని సొమ్ముని ఖర్చు పెట్టాక, జాతీయ విపత్తు నిధికి దరఖాస్తు చేయాలి. కానీ వీళ్లు అసలు అడక్కుండా కేంద్రానికి ఎలాంటి నివేదికలు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ ముఖ్యమంత్రికి కరువు, తుఫాన్లు వస్తే ఏంచేయాలో తెలియదు. నేను ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హరికేన్ తుఫాన్ వల్ల ఉభయ గోదావరి జిల్లాలు నష్టపోతే, నాడు ప్రధానిగా ఉన్న దేవేగౌడ వచ్చారు. హుద్ హుద్ తుఫాన్ వచ్చినప్పుడు చూడటానికి ప్రదాని మోదీ వచ్చారు. ముందుచూపుతో వ్యవహరించాం కాబట్టే నాడు కేంద్రం వెంటనే స్పందించింది. రైతులకు పంటల బీమా అనేది చాలా ముఖ్యం.

కానీ ఈ ప్రభుత్వం నాలుగేళ్లుగా పంటలబీమా సొమ్ము కట్టలేదు. దాంతో ఇప్పుడు నష్టపోయింది ఎవరు, రైతులు. కేంద్రంతో, రైతులతో పనిలేకుండా తానే ప్రత్యేకంగా ఇన్సూరెన్స్ కంపెనీ పెడతాను అని కొండనాలుక్కి మందేస్తానని ఉన్న నాలుక లేకుండా చేశాడు. ఏ విపత్తు వచ్చిన మెరుగైన ఆర్థిక సహాయం చేస్తానని ఊరూరా తిరిగి చెప్పాడు. దాని గురించి మాట్లాడితే ఇప్పుడు మాట్లాడడు. మేం అడుగుతున్నది రైతులకోసం. మాకు సమాధానం చెప్పరు సరే..రైతులకు అయినా చెప్పాలిగా! వీళ్ల నిర్వాకంతో రాష్ట్ర రైతాంగం తిరిగి కోలుకోలేని విధంగా దెబ్బతిన్నది. దేశంలో ఎక్కువ అప్పులు ఉన్నది మన రాష్ట్ర రైతులపైనే.

అలానే ఎక్కువ ఆత్మహత్యలు జరుగుతున్న రాష్ట్రంగా కూడా ఏపీనే దేశంలో ముందుంది. రైతు ఆత్మహత్యల్లో దేశంలో మనది 3వ స్థానమైతే, కౌలురైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానం. ఇప్పుడు జరిగిన నష్టంతో కౌలురైతులు మరో పదేళ్లపాటు కోలుకోలేనంత దారుణంగా దెబ్బతిన్నారు. టీడీపీనేతలు, కార్యకర్తలు మొత్తం క్షేత్రస్థాయిలో పరిశీలించి, రైతులతో మాట్లాడి కేంద్రానికి తమ వైపు నుంచి ఇవ్వాల్సిన నివేదికలు ఇచ్చాం. ఒక హెక్టారు వరికి రూ.30వేల పరిహారం ఇవ్వమన్నాం. గతంలో మేం రూ.20వేలు అందించాం. చనిపోయిన వారి కుటుంబాలకు ఆనాడు రూ.5 లక్షలు, గాయపడిన వారికి లక్ష అందించాం. నేడు రూ.10 లక్షలు.. రూ.2 లక్షలు అందించాలని కోరాం.

ఇళ్లు కూలిపోయిన వారికి ఇళ్లు కట్టించాలని కోరాం. మా డిమాండ్లకు సమాధానం చెప్పకపోతే పోయారు.. ఓట్లేసిన ప్రజలకు కూడా సమాధానం చెప్పరా. అదికూడా చేయకపోతే ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాలి. తుఫాన్ నష్టంపై తక్షణమే శ్వేతపత్రం విడుదలచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలానే ఇన్ పుట్ సబ్సిడీ, పంటలబీమా కింద నాలుగున్నరేళ్లలో రైతులకు ఎంతచెల్లించారో చెప్పాలని డిమాండ్ చేస్తు న్నాం. ఆఖరికి ఏపీలో జరిగిన నష్టాన్ని గుర్తించి జాతీయ విపత్తుగా పరిగణించి ఆదుకోవాలని పార్లమెంట్ లో మా పార్టీ ఎంపీలు కోరారు. 22 మంది వైసీపీ ఎంపీలు ఏం పైరవీలు చేసుకుంటున్నారో వాళ్లకే తెలియదు. వాళ్ల ప్రాధాన్యతలు ఏమిటో వాళ్లకే తెలియని పరిస్థితి. మెడలు వంచుతామన్న వారు నేడు మెడలు దించేశారు.

రైతులు ఇవన్నీ గుర్తించాలి. ముఖ్యమంత్రి అయితే కార్పెట్ వేసుకొని వెళ్లి మరీ రైతుల్ని పరామర్శించేస్థాయికి వచ్చాడు. ఆయన పుట్టంగానే కార్పెట్ పై పుట్టాడు. ఆయన కిందకు దిగడు. ఇలాంటి ముఖ్యమంత్రి దొరకడం మన దౌర్భాగ్యం. ఆలుగడ్డకు, ఉల్లిగడ్డకు తేడాతెలియని మనిషి. వ్యవసాయాన్నిఇంత చిన్నచూపు చూడటం నిజంగా బాధాకరం. ఈ ముఖ్యమంత్రి అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేశాడు. రోడ్లు, డ్రైనేజ్ లు, వ్యవసాయం, సాగునీటి రంగం, తాగునీరు, ఆఖరికి వసతి గృహాల్లోని పిల్లలకు, అంగన్ వాడీ కేంద్రాల్లోని పిల్లలకు సరైన ఆహారం అందించలేని దుస్థితికి వచ్చాడు.

అంగన్ వాడీ సిబ్బంది చేస్తున్న న్యాయమైన పోరాటానికి తాము అండగా ఉంటాం. ఆందోళనల్ని ఎంత అణచివేయాలంటే ఆ పోరాటం మరింత ఉధృ తమవుతుంది తప్ప తగ్గదు. ఈరోజు కేసులు పెట్టి భయపెట్టవచ్చుగానీ, వాళ్లకంటూ ఒక్కరోజు వచ్చినప్పుడు ఏంచేయాలో అదిచేస్తారు. రాబోయేది రైతు ప్రభుత్వం, రాగానే వారికి చేయాల్సిన న్యాయం చేస్తాం అని చంద్రబాబు అన్నారు.

ఒక్క ఛాన్స్ అడిగాడు.. ఇచ్చాం.. ఆ పాపం మాకు శాపంగా మారిందని ప్రజలకు అర్థమైంది. అందుకే వారిలో మార్పు వచ్చింది. నా రాజకీయ జీవితంలో ఇంత ప్రజావ్యతిరేకత ఉన్న ప్రభుత్వాన్ని చూడలేదు. ప్రజలు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా.. ఎప్పుడు నెత్తిన పెట్టుకున్న కుంపటిని వదిలించుకుందామా అని చూస్తున్నారు. ఎక్కడా చూసినా ఈ ప్రభుత్వాన్ని తిట్టడమే ప్రజలు పనిగా పెట్టుకున్నారు.

ఏ ప్రభుత్వమైనా.. ముఖ్యమంత్రి అయినా ప్రజల జీవన ప్రమాణాలు పెరిగా యా లేదా అని ఆలోచించాలి. ఆదాయం పెరిగిందా.. ఖర్చులు పెరిగాయా అని చూడాలి. కానీ ఈ ప్రభుత్వంలో సామాన్యప్రజలతో పాటు, కాస్తో కూస్తో సంపాదించుకునేవారు.. ఉపాధ్యాయులు.. ఉద్యోగులు ఎవరూ సంతోషంగా లేరు. 24శాతం నిరుద్యోగ రేటుతో దేశంలో ఏపీ నంబర్-1. అదీ వీళ్లు సాధించింది. చదువుకుంటున్న యువత తీవ్రమైన నిరాశానిస్పృహల్లో ఉన్నారని చంద్రబాబు అన్నారు.

రైతుల్ని పరామర్శించడానికి తెనాలి.. బాపట్ల వెళ్తే అక్కడ చిన్నిచిన్న పిల్లలు రాత్రిళ్లు కూడా రోడ్లపైకి వచ్చి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినా దాలు చేశారు. చెన్నై వెళ్తే అక్కడ చదివే తెలుగు విద్యార్థులు నాతో మాట్లా డటానికి రోడ్డుపైకి వచ్చారు. ఇంత వ్యతిరేకత ఎక్కడా ఎన్నడూ చూడలే దు. ఈ ముఖ్యమంత్రికి ఓటమిభయం పట్టుకుంది. మొన్నటివరకు 175కు 175 స్థానాలు గెలుస్తానన్నాడు. ఇప్పుడు ఏకంగా ఒకేసారి 11 మందిని మార్చాడు. రాజకీయనాయకుల్ని ట్రాన్స్ ఫర్ చేయడం ఇక్కడే చూస్తు న్నాం. నాలుగున్నరేళ్లుగా వైసీపీ ఎమ్మెల్యేలు ఆంబోతుల్లా వ్యవహరించారు. ఏం అనుకుంటే అదిచేశారు.

ఇప్పుడు ప్రజలు తిరగబడతారని వారిని ట్రాన్స్ ఫర్ చేస్తున్నాడు. బీసీలు, దళితుల్నే ఎక్కువగా ట్రాన్స్ ఫర్ చేశాడు. 11 మందిలో 5గురు దళితులు.. ముగ్గురు బీసీలే. 5 గురు దళితుల్లో ముగ్గు రు మంత్రులే. వాళ్లను మారుస్తున్నాడు కానీ తాను పులివెందుల నుంచి మాత్రం మారడు. పెద్ద మహానాయకుడు కదా.. పులివెందులలో బీసీనో, దళిత అభ్యర్థినో నిలబెట్టి, వాళ్లను గెలిపించి తాను ఇంకోచోట నుంచి ఎందుకు పోటీచేయడు? పులివెందుల నుంచి పోటీచేసే టీడీపీ అభ్యర్థిని కూడా రెండుసార్లు జైలుకు పంపాడు. ఈ విన్యాసాలు అన్నీ చూశాం కదా? బాలినేనికి ఎక్కడ టిక్కెట్ ఇస్తున్నాడో చెప్పాడా? కాకినాడ ఎమ్మెల్యే జగన్ బినామీనే కదా! అతను తన మనిషే కదా… దోపిడీదారులు తనవాళ్లైతే వాళ్లను మార్చడు.

దళిత, బీసీ అభ్యర్థుల్ని మారుస్తాడు. పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి సాగించిన ఇసుక దోపిడీపై ఎన్జీటీ జరిమా నా వేస్తే, ప్రభుత్వ ఖజానా నుంచి కట్టారు. ఆయన్నెందుకు మార్చరు? 150 మందిని మార్చినా ఈయన గెలవడు. ప్రజలు ఇప్పుడిప్పుడే బయట పడుతున్నారు. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చాక వీళ్ల అడ్రస్ గల్లంతు కాడం ఖాయం.ప్రభుత్వం అనేది పవిత్రంగా ఉండాలి. ప్రజలకు ట్రస్టీగా ఉండాలి. ఇతను వచ్చాక చేసిన పాపాలు అన్ని వర్గాలకు శాపాలుగా మారాయి. జరగబో యే ఎన్నికలు చరిత్రాత్మకమైనవి. 5కోట్ల ప్రజలు వర్సెస్ జగన్ రెడ్డి. ప్రతి ఒక్కరి భవిష్యత్ ఈ ఎన్నికలపైనే ఆధారపడి ఉంది.

నాలుగున్నరేళ్లపాటు విన్యాసాలు చేశాం..చివర్లో మార్పులు చేస్తే బయట పడిపోతాం అనుకుంటే కుదరదు. ప్రజలు అన్నీ గమనించాలని కోరుతున్నా. నేనో…. మీరో గెలవడం కాదు. రేపు జరిగేఎన్నికల్లో రాష్ట్రం గెలవాలి. అమాయకులపై.. టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసు పెట్టడం..లోపలేయడం.. బెయిల్ రాకుండా చేయడం. బీటెక్ రవిని ఏం చేశారో చూశాం కదా! లోకేశ్ ను కలవడానికి వెళ్తుంటే అడ్డుకున్నారు… అప్పుడు వదిలేసి తరువాత ఎస్సైని కొట్టాడని తప్పుడు కేసు పెట్టారు. డ్యూటీలో లేని డాక్టర్ దాన్ని ధృవీకరిస్తూ సర్టిఫికెట్ ఇచ్చాడు. అదీ వీళ్లు చేస్తున్నది.

అందుకే మీ అందరి అభిప్రాయాలు తీసుకుంటాను. సరైన అభ్యర్థుల్ని ఎంపిక చేస్తాను. ఆఖరికి కుప్పంలో కూడా ప్రజాభిప్రాయసేకరణ చేస్తాను. వాళ్ల ఎంపిక అంతా తాడేపల్లిలో జరుగుతుంది. మా ఎంపిక అంతా ప్రజామోదంతో జరుగుతుంది. నూతనవిధానంతో నాకు తప్ప, ఎవరికీ తెలియకుండా అభ్యర్థుల చరిత్రను తెలుసుకొని ఎంపికచేస్తాను. ఈ సారి వేరే ప్రభుత్వం రాకపోతే తాము రాష్ట్రాన్ని వదిలే స్తామని చాలామంది బహిరంగంగానే చెబుతున్నారు. ప్రజాబలాన్ని సమకూర్చాల్సిన బాధ్యత ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఒక్కరిపై ఉంది. రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం ప్రజలు కూడా తమతో కలిసి రావాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.

విలేకరుల ప్రశ్నలకు సమాధానంగా చంద్రబాబు స్పందన….
నేను ఏ పద్ధతి అనుసరించి అభ్యర్థుల్ని ఎంపిక చేస్తాననేది ముందే చెప్పను. సరైన సమయంలో సరైన వారినే ఎంపిక చేస్తాను. మునిగిపోయే పడవ నుంచి దూకాలని అందరూ అనుకుంటారు. ఆ పార్టీకి ఒక చరిత్ర లేదు. ఆ పడవకు చిల్లు పడిందని అందరికీ అర్థమైంది. ఇన్ని అరాచకాలుచేసిన పార్టీని, ప్రభుత్వాన్ని ప్రజలు ఆమోదించరు.

సూపర్ సిక్స్ పై ప్రజల్లో బాగా ప్రచారం చేశారు. 36, 37 లక్షల ఇళ్లు మా వాళ్లు తిరిగారు. బాబు ష్యూరిటీ- భవిష్యత్ కు గ్యారెంటీ పై ప్రజలు బాగా ఆసక్తి చూపు తున్నారు.

వైసీపీ వాళ్లు కూడా ఆ పథకాలపై ఆసక్తి చూపుతున్నారు. ఈ ముఖ్యమంత్రి చెప్పినవి ఏవీ నెరవేర్చలేదు. మద్య పాన నిషేధం చేశాకే మరలా ఓట్లు అడుగుతాను అన్నాడు. ఇప్పుడు ఓట్లు అడిగే హక్కు ఆయనకు ఎక్కడుంది? ఆయనకు విశ్వసనీ యత ఎక్కుడుంది. ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్ ప్రభుత్వం. ముఖ్యమంత్రి ఫెయి ల్యూర్ ముఖ్యమంత్రి. ఇష్టమొచ్చినట్టు దొంగ ఓట్లు వేయించాలని చూస్తున్నారు. ఇంతకు ముందు చేసిందే మరలా చేయాలని చూస్తున్నారు.

రిమోట్ గా ఓట్లు చేర్చడం… తొలగించడం చేస్తున్నారు. మేం సమర్థవంతంగా వీళ్లను తిప్పి కొడతాం. 46 వేల బూత్ లలో మావాళ్లు పనిచేస్తున్నారు. అన్నీ వీళ్లు చేస్తూ.. దొంగే దొంగ అన్నట్టు మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ వారు తెలంగాణలో ఉంటే ఇక్కడ ఓట్లేయకూడదా? చదువులు.. ఉపాధి… వ్యాపారాల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లినవారు ఇక్కడున్న తమ ఓటు హక్కు వినియోగించుకోకూడదంటే ఎలా? దాన్ని మేం ఒప్పుకోం. కానీ దొంగఓట్లు పడితే మాత్రం ఎవరినీ వదిలిపెట్టం.

తప్పుడు రిజిస్ట్రేషన్ చేసే వారిని ఎవరినీ అంతతేలిగ్గా వదిలిపెట్టం. ఆయన విశాఖపట్నానికి పోవాలంటే పోవచ్చు. కానీ టూరిజం పేరుతో రుషికొండపై రూ.500కోట్లతో భవ నం కడతాడా? అంతసొమ్ముతో కట్టిన భవనంలో ఉండాలంటే టూరిస్టులు ఎంత కట్టాలి? ఇంత అడ్డగోలుగా కోర్టులు చెప్పినా.. పర్యావరణ వేత్తలు చెప్పినా వినకుండా ఇష్టానుసారం కొండలు తవ్వేస్తారా? చట్టం ముఖ్యమంత్రికి వర్తించదా? ప్రజలు నిస్సహాయులుగా ఉంటే ఇలాంటి దుర్మార్గులు కొండలు తవ్వుతారు..ఏమైనా తవ్వుతారు. ఈ దుర్మార్గాలకు విరుగుడు ప్రజా చైతన్యమే.” అని చంద్రబాబు తేల్చిచెప్పారు.

Leave a Reply