మా వైసీపీ గెలిచేది ముచ్చటగా మూడు ఎంపీ సీట్లే

– 175కు 175 ఎమ్మెల్యే స్థానాలు, 25 కు 24 ఎంపీ స్థానాల్లో గెలుస్తామంటూ తప్పుడు సర్వే నివేదికలతో ప్రచారం
– ట్రంప్ అవినాష్ సతీమణి సర్వే సంస్థ నివేదికను సాక్షిలో ప్రముఖంగా ప్రచురించి…దాన్ని టైమ్స్ నౌ సర్వేగా ప్రచారం
– దేవుడి డబ్బులతో తిరుపతి కార్పొరేషన్ పరిధి లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్న నిర్ణయాన్ని తప్పు పట్టిన హైకోర్టు
– దేవుడికి భక్తుడిని దూరం చేసే ప్రయత్నాలు ఇకనైనా మానండి
– చెన్నైలో నివసించే అనిల్ రెడ్డి, మాలినీ రెడ్డికి పులివెందులలో ఓటు హక్కు… అలాగే హర్షిని రెడ్డికి రెండు ఓట్లు
– నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు

రాష్ట్రంలో వైకాపా మూడు ఎంపీ స్థానాలను మాత్రమే గెలిచే ఛాన్స్ ఉందని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘురామకృష్ణం రాజు తెలిపారు. కడప, రాజంపేట, అరకు స్థానాలలో మాత్రమే ప్రస్తుతానికి ఆ పార్టీ నెగ్గే అవకాశాలు ఉన్నాయి . శ్రీకాకుళం నుంచి మొదలుకొని నెల్లూరు జిల్లా వరకు అరకు మినహాయించి, మిగిలిన లోక్ సభ సెగ్మెంట్లలో వార్ వన్ సైడే నని తేల్చి చెప్పారు.

గురువారం రఘురామ కృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ…. 175 అసెంబ్లీ స్థానాలకు 175 గెలుస్తామని, 25 ఎంపీ స్థానాలకు 24 ఎంపీ స్థానాలలో గెలుస్తామని చెబుతూనే, అయినా అభ్యర్థుల ఎంపికలో మార్పులు చేర్పులు చేస్తున్నామని చెప్పడం పరిశీలిస్తే నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్టు ఉందన్నారు. అభ్యర్థులను మారిస్తే 175 అసెంబ్లీ స్థానాలకు 200 స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు 30 స్థానాలు వస్తాయా అంటూ ఎద్దేవా చేశారు. ట్రంప్ అవినాష్ సతీమణికి ఒక సర్వే సంస్థ ఉన్నదని, ఆ సర్వే సంస్థ తప్పుడు నివేదిక ఇవ్వగా సాక్షి దినపత్రికలో ప్రముఖంగా ప్రచురించింది .

ప్రశాంత్ కిషోర్ టీం, రిషి రాజు టీం వైకాపా తరపున పనిచేస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ సర్వే అని, రిషి రాజు టీం రిపోర్ట్, ట్రంప్ అవినాష్ సర్వే అని చెప్పవచ్చు కదా అలా కాకుండా, టైమ్స్ నౌ పేరును ఉపయోగించి వారిని బదనాం చేయడం తప్ప ఇంకేమీ లేదు. కేవలం పారిపోతున్న జనాలను ఆపడానికి చేస్తున్న ఈ చిరు ప్రయత్నాన్ని చూసి ఎమ్మెల్యేలు వెనక్కి వచ్చే పరిస్థితి ఉండదు. తమ పరిస్థితి ఏమిటో ఎమ్మెల్యేలకు తెలుసు. ట్రంపు అవినాష్ కు ఏమీ తెలుసు. ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు.

ఎంపీలేమో మాకొద్దు పార్టీ టికెట్లు బాబోయ్ అంటున్నారు. 175కు 175 అసెంబ్లీ స్థానాలలో గెలుస్తామని కానీ 80 మంది అభ్యర్థులను అటు నుంచి ఇటుగా మార్చి, మరో 50 మంది అభ్యర్థులను తీసివేస్తామని, మరో 30 మంది అభ్యర్థులను మార్పులు ఉంటాయంటున్నారు. గత మూడు నెలల క్రితం ఎమ్మెల్యే టికెట్ల కోసం డిపాజిట్లు కట్టవద్దని రచ్చబండ కార్యక్రమంలో చెప్పాను. ఓడిపోతున్నామని స్పష్టంగా తెలియజేశాను.150 మందిలో ఒకరిద్దరు మినహా ఎవరు డిపాజిట్లు కట్టమంటే కట్టమని తేల్చి చెప్పేశారు .

ఎమ్మెల్యేలు డిపాజిట్లు కట్టకపోవడంతో పార్టీ నాయకత్వమే దారికి వచ్చింది. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేల నియోజకవర్గాలను మార్చాలని నిర్ణయించారు. అయితే అక్కడ నుంచి పోటీ చేసేందుకు వారు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో, వారిని మభ్య పెట్టడానికి ఆఫీసులో సిద్ధంగా ఉన్న ట్రంప్ అవినాష్ చేత తప్పుడు సర్వే నివేదికను విడుదల చేయించారు. ప్రతి ఏటా టైమ్స్ నౌ కు రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిదిన్నర కోట్ల రూపాయలను చెల్లిస్తుంది. అందుకే ఈ తప్పుడు సర్వే నివేదికలన్నీ టైమ్స్ నౌ పేరిట విడుదల చేస్తున్నారు. డిపాజిట్లు వద్దు రా బాబు అన్న, రానున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎమ్మెల్యేలు ఒప్పుకునే పరిస్థితి లేదన్నారు.

గతంలో నేనొక్కడినే ప్రశ్నించే వాడిని… ఇప్పుడు అంతా గట్టిగా ప్రశ్నిస్తున్నారు
గతంలో వైకాపా నాయకత్వాన్ని నేనొక్కడినే ప్రశ్నించే వాడినని, కానీ ఇప్పుడు ఎమ్మెల్యేలంతా గట్టిగానే ప్రశ్నిస్తున్నారని రఘురామకృష్ణంరాజు తెలిపారు. కన్నాలు వేసేది మీరు నిందలేమో మాకా అంటూ కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ నాయకత్వాన్ని ప్రశ్నించినట్లు తెలిసింది. ఇసుకను దోచుకున్నది ఎవరు, మద్రాస్ నుంచి ఒక వ్యక్తిని తీసుకొనివచ్చి అతన్ని ముందు పెట్టి ఇసుకను తవ్వుకున్నారు. డబ్బులు మీకు నిందలు మాకా? అంటూ నిలదీయడమే కాకుండా, మట్టి తవ్వకాలలో తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక రెడ్డి కి అప్పగించారు.

హోల్ సేల్ గా టాక్స్లు వసూలు చేసేది మీ పాలెగాళ్లు, చెడ్డ పేరు మాత్రం మాకా అంటూ ఎమ్మెల్యేలు నిలదీసినట్లు తెలిసింది. మధ్య నిషేధం హామీ ఇచ్చింది ఎవరు, సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పింది ఎవరు… వాటితో మాకు ఏమైనా సంబంధం ఉందా?, ఈరోజు అనవసరంగా మమ్మల్ని బాద్నామ్ చేస్తున్నారంటూ మండిపడినట్లు తెలిసిందని రఘురామ కృష్ణంరాజు వివరించారు.

దేవుడి సొమ్ముతో మునిసిపాలిటీ పనులెంట్రా అని ప్రశ్నించిన హైకోర్టు
దేవుడి సొమ్ముతో మునిసిపాలిటీ పనులెంట్రా అని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ప్రశ్నించినట్టు రఘురామ కృష్ణంరాజు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీ టీ డీ ) నిధులను తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ్య పనులకు ఖర్చు చేయాలన్న నిర్ణయాన్ని బిజెపి నాయకుడు, భాను ప్రకాష్ రెడ్డి హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. గతంలోనూ తిరుపతి పట్టణ వీధుల సుందరీకరణ పనుల కోసం 40 నుంచి 50 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని నిర్ణయించగా ప్రజలు ఉద్యమించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన విశాల హృదయంతో ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పారు.

ఇప్పుడు ఆ మొత్తానికి రెట్టింపు సొమ్ముతో తిరుపతి పట్టణంలో పారిశుద్ధ్య పనులు చేపట్టడానికి టెండర్ పిలిచారు. ప్రస్తుతం తిరుపతి కార్పొరేషన్ ఆధ్వర్యంలోనే పారిశుద్ధ్య పనులను చేపడుతున్నారు. దేవుడి సొమ్మును ఖర్చు చేయడానికి వీలు లేదని, దేవుడి సొమ్ముతో మున్సిపాలిటీ పనులెంట్రా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్ మందలించగా, సాక్షి దినపత్రికలో మాత్రం టెండర్ ను కొనసాగించవచ్చునని పేర్కొన్నట్లు రాశారు. సున్నితంగా కాదు మందంగానే మందలించారు. ప్రస్తుతం పారిశుద్ధ్య పనుల నిర్వహణ ఎంత ఖర్చు అవుతుందని న్యాయవాదిని న్యాయమూర్తి ప్రశ్నించగా, 50 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు.

తిరుపతి కార్పొరేషన్ నిర్వహించే పారిశుద్ధ్య పనులకు 50 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుండగా, 100 కోట్ల రూపాయలతో టెండర్ పిలువాల్సిన అవసరం ఏమొచ్చింది. దేవుడు సొమ్ము కాబట్టి 100 కోట్ల రూపాయలకు టెండర్ పిలిచారని స్పష్టమవుతుంది. తిరుమలకు వచ్చే భక్తులు తిరుపతిలో విడిది చేస్తారు కాబట్టి, దేవుడి సొమ్ముని పారిశుద్ధ్య పనులకు ఖర్చు చేస్తున్నట్లు పేర్కొనడం విడ్డూరంగా ఉంది. భక్తులు తిరుపతిలో విడిది చేస్తే, వారి నుంచి ఎంతో ఆదాయం లభిస్తుంది. భోజనాలు చేయడంతో పాటు ఇతరాత్ర షాపింగ్ చేస్తుంటారని, ప్రతిదానిపై పన్నుల రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం లభిస్తుందన్నారు. గతంలో టీటీడీ నిధులను తిరుపతి పట్టణంలో ఖర్చు చేశారని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉంది.

గతంలో తప్పు చేస్తే ఇప్పుడు కూడా తప్పు చేయాలా?!. గత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వైయస్ రాజశేఖర్ రెడ్డి లు సాధారణ మనుషులు. జగన్మోహన్ రెడ్డి దైవాంశ సంభూతుడు, దేవుడి ప్రత్యేక అనుమతితో పుట్టిన వ్యక్తి తప్పు చేస్తే ఎలా అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి మనుషులను కలవరు, ఎదుటి వ్యక్తులు సార్ అని మాత్రమే ఆయన్ని పిలవాలి. ఆయన మాత్రం వారిని నువ్వు అంటూ సంభోదిస్తారు. రేపొద్దున రాష్ట్రాన్ని దివాలా తీయించి మున్సిపాలిటీలన్నింటికీ దేవుడి సొమ్మును వాడేస్తారేమోనని రఘురామ కృష్ణంరాజు అన్నారు.

స్వామివారి దర్శనానికి భక్తులు బస్సుల్లో, వాహనాల్లో వస్తారు కాబట్టి రోడ్లపై గోతులు లేకుండా దేవుడి సొమ్ములు వాడితే తప్పా? అని ప్రశ్నిస్తారేమో. మున్సిపాలిటీలకు, రోడ్లకు దేవుడి డబ్బులు వాడేస్తారేమో నన్న ఆయన, రాష్ట్రాన్ని దివాలా తీయించి స్వామివారికి భక్తులు కైంకర్యం చేసిన డిపాజిట్లను కరిగించాలని చూస్తున్నట్లుగా కనిపిస్తుందన్నారు . గతంలో ఐదు వేల కోట్ల రూపాయలను ఖర్చు చేయాలని చూస్తే భక్తులు నానా గొడవ చేశారు. టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి, ఇన్చార్జ్ ఈవో ధర్మారెడ్డికి ఇటువంటి ఆలోచన వచ్చి ఉంటుందని నేను భావించడం లేదు. ఈ ఆలోచన ఎవరిదో ప్రజలందరికీ తెలుసు.

ధనికుడైన మా స్వామిని పేదవారిని చేయాలని చూస్తున్నారు. ఇప్పటికైనా ఎటువంటి దుశ్చర్యలను మానుకోవాలి . భగవంతుడికి భక్తులు సమర్పించే డబ్బులను కేవలం హిందూ ధర్మ వ్యాప్తికి, నూతన దేవాలయాల నిర్మాణానికి, జీర్ణోదశకు చేరుకున్న దేవాలయాలను పునరుద్ధరించడానికి, దేవాలయాలలో ధూప దీప నైవేద్య కార్యక్రమానికి వినియోగించాలని టిటిడి నిబంధనలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అయినా, టీటీడీ నిధులను మునిసిపాలిటీలకు ఖర్చు చేయాలని నిర్ణయించడం విడ్డూరంగా ఉంది. టీటీడీలో జరుగుతున్న అక్రమాలపై ఎప్పటికప్పుడు న్యాయస్థానాల దృష్టికి తీసుకు వెళ్తున్న నవీన్ కుమార్ రెడ్డి, భాను ప్రకాష్ రెడ్డి ని అభినందిస్తున్నాను.

ముందుగా తెలిసి ఉంటే నేను కూడా న్యాయపోరాటం చేసి ఉండే వారిని. భగవంతుడికి భక్తుని దూరం చేసే కార్యక్రమం రాష్ట్రంలోని దేవాలయాలలో యదేచ్ఛగా కొనసాగుతోంది. తిరుమలలో దైవదర్శనానికి టికెట్ల రేట్లు ఇబ్బడి ముబ్బడిగా పెంచేశారు. అద్దె గదుల కిరాయిలను అమాంతం పెంచారు. ఇదేమిటని ప్రశ్నిస్తే, సౌకర్యాలు కల్పిస్తున్నామని చెబుతున్నారు. భక్తుల సౌకర్యాల కోసం ఖర్చు చేసే సొమ్ము వెనక్కి తిరిగి రావాలా? అంటూ రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు.

హజ్ కు వెళ్లి యాత్రికులకు రాయితీలను ప్రకటించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖను మా ప్రాంతీయ పార్టీ జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డి మంత్రి స్మృతి ఇరానీకి అందజేయగా, ఆమె సానుకూలంగా స్పందించినట్లు సాక్షి దినపత్రికలో రాశారు. హజ్ తో పాటు జెరూసలాం వెళ్లే వారికి కూడా రాయితీలను ఇవ్వడంలో తప్పేమీ లేదు. కానీ, దేవాలయాలలో మాత్రం భగవంతునికి, భక్తులకు మధ్య దూరాన్ని పెంచుతున్నారు. కొబ్బరికాయ కొట్టాలన్న టికెట్ ధర నిర్ణయించడం సరికాదు. ఈ విషయాన్ని హిందూ ధార్మిక సంఘాలు, ఘణాపాఠి లైన హిందూ పెద్దలు, పీఠాధిపతులు ప్రభుత్వ పెద్దలతో చర్చించాలన్నారు. మసీదు తో పాటు చర్చికి వెళ్తే అక్కడ డబ్బుల ప్రస్తావన అన్నది ఉండదు. భక్తులకు ఇష్టమైన వారు తమకు తోచినంత హుండీలో వేస్తారని చెప్పారు.

ఓటు ఎక్కడో ఒక చోటే ఉండాలి
ఓటు అనేది ఎక్కడో ఒక్కచోట మాత్రమే ఉండాలని, రెండు ప్రాంతాలలో ఉండడం కరెక్టు కాదని రఘురామకృష్ణం రాజు తెలిపారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన అఫిడవిట్ లో అనిల్ కుమార్ రెడ్డి, మాలినీ రెడ్డికి పులివెందులలోనే ఓటు హక్కు ఉన్నట్లు స్పష్టమైనది. అనిల్ కుమార్ రెడ్డి, మాలినీ రెడ్డిలు చెన్నైలో నివసిస్తారని విషయం అందరికీ తెలుసు. వైయస్ జగన్మోహన్ రెడ్డి కుమార్తె వైఎస్ హర్షిని రెడ్డికి రెండు ఓట్లు ఉన్నాయని , ఓటరు జాబితాలో ఆమె ఫోటోతో కూడిన రెండు ఓట్లను మీడియా ప్రతినిధుల ముందు రఘురామకృష్ణం రాజు ప్రదర్శించారు.

తెలంగాణ కోడలిని అంటూ అక్కడ సొంత పార్టీని ఏర్పాటు చేసుకున్న వైయస్ షర్మిల రెడ్డి కి, బ్రదర్ అనిల్ కు కూడా పులివెందులలోనే ఓటు హక్కు ఉందన్నారు. తమకు కావలసిన వారికి మాత్రం ఓటు హక్కు రాష్ట్రంలో ఉండాలని, ఐటీ నిపుణులకు మాత్రం రాష్ట్రంలో ఓటు హక్కు ఉండవద్దని అనడం ఎంతవరకు సమంజసమని రఘు రామ కృష్ణంరాజు ప్రశ్నించారు. దొంగ ఓట్ల నమోదు ప్రక్రియకు పేటెంట్ హక్కులన్నీ నా ప్రస్తుత పార్టీకే దక్కుతాయి. దొంగే దొంగ అన్నట్లుగా తామే దొంగ ఓట్లను నమోదు చేసి, ఇతరులపై నిందలు వేసే ప్రయత్నాన్ని చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

20 మందికి నోటీసులు సర్వ్ చేసే బాధ్యత మా న్యాయవాదులకు
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన అస్మదీయులకు ఎలా లబ్ధి చేకూరుస్తూ, తనకు తాను ఎలా లబ్ధి చేకూర్చుకుంటున్నారో వివరిస్తూ హైకోర్టులో నేను పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందేనని రఘురామ కృష్ణంరాజు గుర్తు చేశారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి వ్యక్తిగత ప్రయోజనాలకు అగ్ర తాంబూలం వేయడం నియమ నిబంధనలకు విరుద్ధమని పిటిషన్ లో వెల్లడించాను. గత మాసంలోనే ప్రతి వాదులకు నోటీసులు జారీ చేయడం జరిగింది. 41 మందిని ప్రతివాదులుగా పేర్కొనగా, అందులో 21 మంది నోటీసులను స్వీకరించి, మరో 20 మంది డెలబరెటుగా నోటీసులను స్వీకరించలేదు.

నోటీసులు స్వీకరించని వారికి నోటీసులను అందజేసే బాధ్యతను మా న్యాయవాదులకు న్యాయస్థానం అప్పగించింది . ఈ కేసును జనవరి రెండవ తేదీకి వాయిదా వేశారు. తాను దాఖలు చేసిన పిల్ లో ముఖ్యమంత్రి మొదటి ప్రతివాదిగా పేర్కొనగా, రెండవ ప్రతివాదిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని పేర్కొనడం జరిగింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి 20 పేజీల అఫిడవిట్ దాఖలు చేశారు. వ్యక్తిగత కక్షతోనే నేను ఆరోపణలు చేసినట్లుగా ఆయన తన అఫిడవిట్లో వెల్లడించారు. తనపై సిబిఐ కేసులు ఉన్నట్లుగా పేర్కొన్నారు. నాపై కేసులు ఉన్నప్పటికీ, ఆ కేసులతో నేను దాఖలు చేసిన పిల్ కు ఏమైనా సంబంధం ఉందా అంటూ రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు.

ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా ఇటువంటి చౌకబారు వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఒక బ్యాంకర్ ను మేనేజ్ చేసి నాపై తప్పుడు కేసును పెట్టించారు. జగన్మోహన్ రెడ్డి తన వ్యక్తిగత లాభం కోసం సాక్షి దినపత్రికను, భారతి సిమెంటును అమ్ముకోవడానికి , ఈ కేసుకు సంబంధం ఏమిటని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. ఈ కేసును వాదించడానికి మాజీ అడ్వకేట్ జనరల్స్ ను ఎంతోమందిని జగన్ మోహన్ రెడ్డి రంగంలోకి దించారు. జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం కుదురుగా లేరు, బెదురు స్టార్ట్ అయింది. 2020 జూన్ మూడవ తేదీన పార్లమెంట్ సభ్యుడిగా నన్ను అనర్హుడి ప్రకటించాలని మా పార్టీ ఎంపీల చేత పిటిషన్ ఫైల్ చేయించారు. ఆయన పిటిషన్ దాఖలు చేయవచ్చు కానీ నేను పిటిషన్ వేస్తే తప్పా? అంటూ నిలదీశారు.

నువ్వేమో నన్ను అనర్హుడిని చేయాలి.. నేను మాత్రం నువ్వు పేపరు సిమెంటు అమ్ముకుంటున్నావని చెప్పకూడదా? అంటూ ప్రశ్నించారు. మార్గదర్శి కంపెనీ ఆస్తుల జప్తు అంశంలో న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలినప్పటికీ, సింగల్ బెంచ్ జడ్జి ని రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రయించింది. అర్జంటుగా ఈ కేసు టేకప్ చేయాలని కోరారు . కానీ సింగల్ బెంచ్ జడ్జ్ కసిరెడ్డి సురేష్ రెడ్డి వెంటనే కేసు టేకప్ చేయలేదు. అభ్యంతరాలు ఫైల్ చేసిన తర్వాత ఈ కేసు విచారణ అర్హమో కాదో పరిశీలిస్తానన్నారు.

మార్గదర్శి నుంచి తమకు డబ్బులు అందలేదని ఒక్క చందాదారుల నుంచి ఫిర్యాదు అందలేదు. ఈ పిటిషన్ కు విచారణ అర్హత ఉండకపోవచ్చు . నేను ముందే చెప్పాను. రాష్ట్ర ప్రభుత్వ డబ్బులు కాబట్టి, హైకోర్టుకు వెళ్తారని. లాయర్ కు ఇచ్చే ఫీజుల్లోనూ కమిషన్లు కొట్టేస్తారేమో. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పై నమోదు చేసిన కేసులు సిఐడి చేత కాకుండా సిబిఐ చేత విచారణ జరిపించాలని ఉండవల్లి అరుణ్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు.

అసలు ఈ కేసును విచారించడానికి సిఐడి కి అర్హత ఉందా. విచారించడానికి గవర్నర్ అనుమతించకపోతే, ఈ కేసును సిబిఐ కి బదిలీ చేయడానికి సాధ్యపడుతుందా? అని ప్రశ్నించిన రఘురామకృష్ణరాజు, అవగాహన రాహిత్యంతో కూడిన పిటిషన్ ను ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేశారన్నారు. ఈ కేసు నోటీసులు అందలేదని వాయిదా పడింది. సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టు క్వాష్ పిటిషన్ పై తీర్పు వెలువడిన తర్వాత, ఈ కేసు నిలిచే అవకాశమే లేదన్నారు.

Leave a Reply