– పచ్చదనం, పరిశుభ్రంతో మంచి ఆరోగ్యం
– పలు డ్రైన్లు, రోడ్లు పరిశీలించిన కూటమి నాయకులు, అధికారులు
రామచంద్రపురం: రామచంద్రపురం పట్టణంలోని పలు వార్డులను మున్సిపల్ అధికారులు, కూటమి నాయకులతో కలిసి సోమవారం పరిశీలించారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యo మున్సిపల్ అధికారులు, కూటమి నాయకులతో కలిసి పలు వార్డులు, హిందూ స్మశాన వాటికలు పరిశీలించి తగు సూచనలు చేశారు.
తొలుత లలిత నగర్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, గుబ్బలవారి పేట, అంకం వారి వీధి, సూర్య నగర్ తదితర వార్డుల్లో శానిటేషన్, డ్రైన్లు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ గ్రామాల్లో, పట్టణాల్లో పరిశుభ్రంగా, పచ్చదనం కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ ఆంధ్ర -స్వచ్ఛభారత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. ప్రతి నెల మూడవ శనివారం ఈ కార్యక్రమం చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతో పాటు, ఆయా వీధుల్లో డ్రైన్లు, రోడ్లు, ప్రభుత్వ కార్యాలయాలు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. అలాగే కైలాస భూమి ప్రాంతాల్లో పారిశుధ్యం మెరుగుగా ఉంచాలని మున్సిపల్ అధికారులను కోరారు. పరిసరాల పరిశుభ్రతతో మంచి ఆరోగ్యం పొందచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిఇ, ఏఇ, వర్క్ ఇన్స్పెక్టర్, అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.