* ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్ వాదన
* ఫిబ్రవరి 3కి వాయిదా వేసిన హైకోర్టు
పుంగనూరు: ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి పై హైకోర్టులో దాఖలైన అనర్హత పిటిషన్ కీలక దశకు చేరుకుంది.. దీనిలో ప్రభుత్వ వైఖరి ఏమిటనేది తేలిపోనుంది. దాదాపు 140 కి పైగా భూములను ఆస్తులుగా అఫిడవిట్ లో చూపించని విషయాన్ని, ఆధారాలతో సహా కోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే.. బీసీవై పార్టీ అధినేత, పుంగనూరు బీసీవై అభ్యర్థి బోడె రామచంద్ర యాదవ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇప్పటికే 14 వాయిదాలు ముగిసాయి. కోర్టు నుండి నోటీసులు వెళ్ళినప్పటికీ , ఈ నియోజకవర్గంలో పోటీ చేసిన టీడీపీ సహా ఇతర అభ్యర్థులు ఎవరూ దీనిలో ఇంప్లీడ్ అవ్వలేదు
రెవెన్యూ శాఖకు నోటీసులు!?
ఈ కేసులో పెద్దిరెడ్డి భూములు వ్యవహారమే కీలకం. ఈ భూములపై పిటిషనర్ అన్ని రకాల ఆధారాలు కోర్టుకి అందించినప్పటికీ, వాటిని రెవెన్యూ శాఖ ధ్రువీకరించాల్సి ఉంది. అందుకే ఈ కేసులో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిని ప్రతివాదిగా చేర్చి నోటీసులు ఇవ్వాలని, పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకి విన్నవించారు. దీనిపై పరిశీలించి ఆదేశాలు ఇస్తామన్న కోర్టు, తదుపరి విచారణను ఫిబ్రవరి 3కి వాయిదా వేశారు.
ఈ ఆస్తులపై ప్రభుత్వం త్వరితగతిన స్పందించి ధ్రువీకరణ ఇస్తే కేసు దాదాపు ముగిసిపోయే అవకాశం ఉంది. పెద్దిరెడ్డి కూడా తప్పించుకునే అవకాశం ఉండదు. ఆ పిటిషన్ లో పేర్కొన్న భూములు అఫిడవిట్ దాఖలు చేసే సమయానికి పెద్దిరెడ్డి, అతని కుటుంబ సభ్యుల పేర్లుపైనే ఉన్నాయనే అంశంపై, ప్రభుత్వం తక్షణమే స్పందించాల్సి ఉంది.