Suryaa.co.in

Andhra Pradesh

ఆరోగ్యానికి వ్యాయామం ఎంతో అవసరం

-గన్నవరం జడ్పీ హై స్కూల్ ప్లే గ్రౌండ్ నందు ఓపెన్ జిమ్ ప్రారంభోత్సవం
-ప్రారంభించిన మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు

గన్నవరం: శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికి వ్యాయామం ఎంతో అవసరమని మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి , గన్నవరం నియోజకవర్గం యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. మంగళవారం గన్నవరం జడ్పీ హైస్కూల్ ప్లే గ్రౌండ్ నందు రూ.7 లక్షల ఎంపీ నిధులతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను ఎంపీ బాల శౌరి , గన్నవరం ఎమ్మెల్యే ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కలసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిమ్ లో ఏర్పాటు చేసిన పరికరాలను పరిశీలించిన వారు.. కాసేపు వ్యాయామం చేస్తూ ఉల్లాసంగా గడిపారు.ఈ సందర్భంగా ఎంపీ బాల శౌరి మాట్లాడుతూ ప్రతిఒక్కరూ ఆరోగ్యంగా ఉండేందుకు నిత్యజీవితంలో వ్యాయామాన్ని ఓ భాగం చేసుకోవాలని సూచించారు.ప్రజా ఆరోగ్యం కోసమే నేడు ఈ ఓపెన్ జిమ్ ను ప్రారంభించటం జరిగిందని అన్నారు .

ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ..మచిలీపట్నం ఎంపీ బాల శౌరి ఓపెన్ జిమ్ కు నిధులు కేటాయించటం పట్ల ధన్యవాదాలు వ్యక్తం చేశారు. ఎంపీ తన పరిధిలోని 7 నియోజక వర్గాల్లో గన్నవరం నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం కల్పించాలని కోరాననీ దానికి ఎంపీ సానుకూలం గా స్పందించారని చెప్పారు .ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మంగళగిరి టిడిపి కార్యాలయంలో గ్రీవెన్స్ డే లో తాను పాల్గొంటే ప్రజల నుండి 250 కి పైగా అర్జీలు వచ్చాయని, వాటిలో 80 శాతం కు పైగా భూ సమస్యల మీదనే ఫిర్యాదులు అందాయని అన్నారు.

తన గన్నవరం నియోజకవర్గం కు సంబంధించి కూడా భూ కబ్జా ల పై 10 కి పైగా ఫిర్యాదులు అందాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఎమ్మార్వోలు , ఆర్డీవోలు తమ స్థాయికి మించి తప్పులు చేసి రెవిన్యూ వ్యవస్థ ను నాశనం చేశారని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో అన్ని వ్యవస్థలను ప్రక్షాళన చేస్తామని, గన్నవరం రూపు రేఖలను మార్చుతానని పునరుద్ఘాటించారు.

ఈకార్యక్రమంలో జనసేన నియోజకవర్గ కన్వీనర్ చలమలశెట్టి రమేష్ బాబు, టీడీపీ మండల అధ్యక్షులు జాస్తి వెంకటేశ్వరరావు, నాయకులు దొంతు చిన్న, మండవ లక్ష్మి, పొట్లూరి బసవరావు, కాట్రగడ్డ అరుణకుమారి, జెడ్పిటీసి ఏలిజాబేత్ రాణి, గ్రామ సర్పంచ్ నిడమర్తి సౌజన్య, వాకర్స్ సభ్యులు, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE