అమరావతి,3 జనవరి:ఈనెల 8వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోడి విశాఖపట్నం పర్యటన విజయవంతానికి విస్తృతమైన ఏర్పాట్లు చేయడం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ పేర్కొన్నారు.ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుండి ఆయన వీడియో సమావేశం ద్వారా సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ .. ప్రధాని పర్యటనను విజయవంతం చేసేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఏర్పాట్లకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే సాధారణ పరిపాలన శాఖ ద్వారా ఉత్తర్వులు జారీ చేశామని అందుకనుగుణంగా ఆయా శాఖల అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లలో ఏచిన్న పొరపాటుకు ఆస్కారం లేని రీతిలో కట్టుదుట్టమైన పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని విశాఖపట్నం జిల్లా కలక్టర్,పోలీస్ కమీషనర్ సహా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
ప్రధాని పర్యటనకు సంబంధించి ఇంకా మినిట్ టు మినిట్ కార్యక్రమం ఖరారై రావాల్సి ఉందని ఈలోగా వివిధ శాఖల పరంగా చేయాల్సిన ఏర్పాట్లను యుద్దప్రాతిపదికన చేపట్టాలని స్పష్టం చేశారు.
ఈనెల 8వ తేదీ సాయంత్రం ప్రధాన మంత్రి విశాఖపట్నం చేరుకుని సంపత్ వినాయక గుడి నుండి ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసే సభా వేదిక వరకూ రోడ్డు షో నిర్వహించనున్నారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ పేర్కొన్నారు.
ప్రధాని పర్యటనలో భాగంగా రోడ్డు షోలో పాల్గొనేందుకు పెద్దఎత్తున వచ్చే ప్రజలు,ప్రజా ప్రతినిధులు రానున్నందున వారి వాహనాల పార్కింగ్ కు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.సాయంత్రం వేళలో ప్రధాని పర్యటన ఉండనున్న నేపధ్యంలో రోడ్డు షో,సభా వేదిక,వివిధ పార్కింగ్ స్థలాల్లో తగిన విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయాలని విద్యుత్, మున్సిపల్ శాఖల అధికారులను సిఎస్ ఆదేశించారు.
అదే విధంగా సభా వేదిక,పార్కింగ్ ప్రాంతాల్లో తాగునీరు,తాత్కాలిక మరుగుదొడ్లు,ఇతర సౌకర్యాలను కల్పించాలని అన్నారు. ప్రధాని పర్యటనకు విశాఖపట్నం సహా పరిసర అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం తదితర జిల్లాల నుండి ప్రజలను బస్సులు,ఇతర వాహనాల్లో తరలించనున్నందున వారిని సురక్షితంగా తీసుకువచ్చి తిరిగి వారి గమ్య స్థానాలకు సురక్షితంగా చేర్చేందుకు వీలుగా తగిన ఏర్పాట్లు చేయాలని ఆయా జిల్లాల కలక్టర్లను ఆదేశించారు.
సమావేశానికి వచ్చే వారికి తాగునీరు, అల్పాహారం,భోజన వసతి వంటి ఏర్పాట్లలో ఎటువంటి విమర్శలకు తావీయకుండా తగిన ఏర్పాట్లు చేయాలని విశాఖ జిల్లా కలక్టర్ సహా పరిసర జిల్లాల కలక్టర్లను ఆదేశించారు. వాహనాల ట్రాఫిక్,పార్కింగ్ వంటి అంశాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ శాఖ తగు చర్యలు తీసుకోవాలని డిజిపి,విశాఖ పోలీస్ కమీషనర్లను సిఎస్ విజయానంద్ ఆదేశించారు.
అంతకు ముందు ఈసమావేశంలో జిఏడి ముఖ్య కార్యదర్శి ఎస్.సురేశ్ కుమార్ ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించి విశాఖపట్నం జిల్లా కలక్టర్,పోలీస్ కమీషనర్ సహా వివిధ శాఖల అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివిరించారు.సాధారణ పరిపాలన శాఖ ద్వారా ఇందుకు సంబంధించి ఆదేశాలు జారీ చేశామని తెలిపారు.
విశాఖపట్నం జిల్లా కలక్టర్ హరీంద్ర ప్రసాద్ వర్చువల్ గా పాల్గొని మట్లాడుతూ.. ప్రధాని పర్యటనకు విశాఖనగరంలో లక్షా 20వేల మందిని,విశాఖ గ్రామీణ ప్రాంత మండలాల నుండి 10వేల మందిని,అనకాపల్లి జిల్లా నుండి 40 వేల మందిని తీసుకువచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు. విశాఖ పోలీస్ కమీషనర్ ఎస్.బాగ్చి వర్చువల్ గా పాల్గొని మాట్లాడుతూ నగరంలో 22 ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు.
ఈ సమావేశానికి డిజిపి ద్వారకా తిరుమల రావు,సీఎం కార్యదర్శి ప్రద్యుమ్న, ఆర్అండ్బి ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే,అనకాపల్లి,విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల కలక్టర్లు విజయకృష్ణణ్,డా.బిఆర్ అంబేద్కర్,స్వప్నిల్ దినకర్,ఎస్పిలు,ఇతర అధికాకరులు పాల్గొన్నారు.పిహెచ్డి రామకృష్ణ,హరి నారాయణ తదితరులు పాల్గొన్నారు.
8వతేదీన విశాఖలో ప్రధాని చే పలు ప్రాజెక్టులకు శంఖుస్థాపన, ప్రారంభోత్సవాలు
విశాఖపట్నంలో రైల్వే జోన్ ఏర్పాటుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడి శంకుస్థాపన చేయనున్నారు.అదే విధంగా అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం పూడిమడకలో ఎన్.టి.పి.సి.ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ కు వర్చువల్ గా శంకుస్థాపన చేస్తారు.ఈ ప్రాజక్టు కింద ఆకంపెనీ రూ.65,370 కోట్ల పెట్టుబడులను మూడు దశల్లో పెట్టనుంది.కృష్ణపట్నం ఇండస్ట్రీయల్ హబ్ ను కూడా ప్రధాన మంత్రి వర్చువల్ గా ప్రారంభించనున్నారు.
రూ.1518 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టును తొలి దశలో 2,500 ఎకరాల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 50 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కలుగనున్నాయి.అదే విధంగా నక్కపల్లిలో 2001.8 ఎకరాల విస్తీర్ణంలో రూ.1876.66 కోట్లతో ఏర్పాటు చేసే బల్కు డ్రగ్ పార్కును వర్చువల్ గా శంఖుస్థాపన చేయనున్నారు.ఈ పార్కులో రూ.11,542 కోట్ల మేర పెట్టుబడులు రావడం ద్వారా 54 వేల మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి.