– రాష్ట్రంలోని 87.42 లక్షల మంది విద్యార్ధులకు అన్యాయం
– రూ.13.112 కోట్లు నష్టపోయిన విద్యార్ధులు
– అన్నదాత సుఖీభవకు తిలోదకాలు
– 54 లక్షల మంది రైతులకు సున్నం పెట్టిన కూటమి సర్కార్
– 1.80 కోట్ల మంది మహిళల ఆడబిడ్డ నిధి జాడ ఏదీ?
– రూ.260 కోట్లు మత్స్యకార భరోసాకూ ఎగనామం
– ఉద్యోగులకు పీఆర్సీ, ఐఆర్ ల ఊసేలేదు
– నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు.. భృతి అంతకంటే లేదు
– రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి, వైయస్ఆర్ సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ
రాజమహేంద్రవరం: దేశ రాజకీయాల్లోనే చంద్రబాబు వంటి పచ్చి మోసగాడు మరొకరు కనిపించరు అని మాజీ మంత్రి, వైయస్ఆర్ సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ విమర్శించారు. రాజమహేంద్రవరంలోని ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ నమ్మక ద్రోహం, మోసాలతోనే రాజకీయాల్లోకి వచ్చిన చంద్రబాబు తుది వరకు అదే పంథాను కొనసాగిస్తున్నాడని మండిపడ్డారు.
తాజాగా జరిగిన కేబినెట్ లో అయినా సూపర్ సిక్స్ అమలుపై కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆశించినా, మళ్లీ ప్రజలకు మొండిచేయి చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు 12 కేబినెట్ సమావేశాలు జరిగాయి. ప్రభుత్వపరంగా అనేక నిర్ణయాలు తీసుకున్నారు. వాటిల్లో సూపర్ సిక్స్ కు సంబంధించినవి లేవు. తాజాగా గురువారం కూడా కేబినెట్ సమావేశం జరిగింది. ఇందులో అయినా కూటమి పార్టీలు ఇచ్చిన హామీలపై ఏదో ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని ప్రజలు ఎదురుచూశారు. మళ్ళీ, మళ్ళీ మోసం చేయడమే అలవాటుగా చేసుకున్న చంద్రబాబు ఇప్పుడు కూడా ప్రజలను నిరాశలోనే ముంచేశాడు.
అధికారంలోకి వచ్చిన తరువాత సూపర్ సిక్స్ అమలుపై అసెంబ్లీ సాక్షిగా వాటిని అమలు చేయాలంటే నాకు భయం వేస్తోందంటూ చంద్రబాబు చెప్పారు. ఎన్నికల సమయంలో ఈ రాష్ట్రానికి ఉన్న ఆదాయం ఎంత, బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా ఇచ్చే హామీలు సాధ్యమవుతాయా లేదా అనే విషయం ఇంత అనుభవం ఉన్నా చంద్రబాబుకు తెలియదా?
జగన్ సంక్షేమం వల్ల ఈ రాష్ట్రం అప్పుల పాలైందని, శ్రీలంకగా మారిందంటూ విమర్శించారు. జగన్ అప్పులు చేస్తే తప్పు అని అన్న చంద్రబాబు ఈ ఆరు నెలల్లోనే 1.19 లక్షల కోట్ల అప్పులు చేశారు. కానీ ప్రజలకు ఒక్క రూపాయి కూడా తన హామీల మేరకు ఖర్చు చేయలేదు. ఇది ఒప్పు అని ఎలా సమర్థించుకుంటారో చంద్రబాబు చెప్పాలి.
జగన్ ప్రభుత్వంలో ఏటా ఏప్రిల్ నెలలో విద్యార్ధులకు వసతిదీవెన, పొదుపుసంఘాలకు వడ్డీ లేని రుణాలు, మే నెలలో విద్యాదీవెన, వైయస్ఆర్ ఉచిత పంటల బీమా, రైతుభరోసా, మత్స్యకారభరోసా, జూన్ నెలలో అమ్మ ఒడి, జులై నెలలో విద్యా దీవెన, నేతన్న నేస్తం, సెప్టెంబర్ నెలలో చేయూత, అక్టోబర్ నెలలో రైతు భరోసా, నవంబర్ లో విద్యాదీవెన, రైతులకు సున్నావడ్డీ రుణాలు, డిసెంబర్లో ఈబీసీ నేస్తం, లా నేస్తం, మిగిలిపోయిన అర్హులకు సైతం పిలిచి మరీ పథకాలు అందించే కార్యక్రమాలను క్రమం తప్పకుండా అమలు చేశారు.
సూపర్ సిక్స్ హామీలకు కూటమి సర్కార్ ఎగనామం పెడుతోంది. నిన్న కేబినెట్ లో మీరు తీసుకున్న నిర్ణయాలు చూస్తే ఇదే నిజం అని అర్థమవుతోంది. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఆడబిడ్డకు నిధి, ఉద్యోగులకు పీఆర్సీ, నిరుద్యోగభృతి ఇలా కూటమి పార్టీలు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా ఈ ఏడాది అమలు చేయడం లేదనే అంశాన్ని మీ కేబినెట్ సమావేశం వల్ల తేటతెల్లమయ్యింది.
సీఎం చంద్రబాబు ఈ ఏడాది తల్లికి వందనం పథకాన్ని అమలు చేయకపోవడం వల్ల 87.42 లక్షల మంది విద్యార్ధులు ఒక్క ఏడాదికే రూ. 13,112 కోట్ల మేర నష్టపోయారు. 54 లక్షల మంది రైతన్నలకు ఏటా రూ.20 వేల చొప్పున పెట్టబడి సాయం అందకపోవడంతో రూ.10,000 కోట్ల మేర నష్టపోయారు. గత ఏడాది కేంద్రప్రభుత్వం ఇచ్చిన రూ.10,000 సాయంను కూడా రైతులకు అందించలేదు. ఈ బడ్జెట్ లో అన్నదాత సుఖీభవ కోసం కూటమి ప్రభుత్వం కేటాయించింది కేవలం రూ. వెయ్యి కోట్లు మాత్రమే. కోటి మందికి పైగా నిరుద్యోగులకు భృతి ఇస్తామని అన్నారు. 1.80 కోట్ల మంది ఆడబిడ్డలకు ఇస్తామన్న ఆడబిడ్డ నిధి ఇవ్వలేదు. ఇవ్వన్నీ మోసం కాదా?
ఎంతమంది స్కూలుకు వెళ్ళే పిల్లలు ఉంటే, ప్రతి ఒక్కరికీ తల్లికి వందనం కింద రూ.15 వేలు ఇస్తామన్న చంద్రబాబు హామీ ఏమయ్యింది. రైతులు అప్పుల పాలు కాకూడదని పెట్టుబడి సాయంను అందించి జగన్ గారు దేశానికే ఆదర్శమయ్యారు. రైతుభరోసాను అమలు చేశారు. కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ ప్రకటించింది. కానీ అమలు మాత్రం పట్టించుకోవడం లేదు. రైతుకు విత్తనం నుంచి విక్రయం వరకు ఆర్బీకేల ద్వారా జగన్ గారి ప్రభుత్వం అండగా నిలిచింది.
రాష్ట్రంలో 19-59 సంవత్సరాల లోపు మహిళలకు ఏడాదికి రూ.18వేలు ఇస్తామనని హామీ ఇచ్చి, దారుణంగా మోసం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.80 కోట్ల మంది మహిళలు ఆడబిడ్డ నిధి కోసం ఎదురుచూస్తున్నారు. కనీసం ఈ కేబినెట్ లో అయినా దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడం దారుణం. ఉచిత గ్యాస్ కింద ఏడాదికి మూడు సిలెండర్లు ఇస్తామని చెప్పి కేవలం ఒక సిలెండర్ తోనే మాయ చేస్తున్నారు. రాష్ట్రంలో 1.54 కోట్ల కుటుంబాలకు ఏటా మూడు గ్యాస్ సిలెండర్లు ఇవ్వాలంటే రూ.4వేల కోట్లు అవసరం. కానీ ఈఏడాది బడ్జెట్ లో కేవలం రూ.895 కోట్లు మాత్రమే ప్రభుత్వం కేటదాయించింది.
గత ఏడాది వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇవ్వాల్సిన ఆర్థికసాయానికి చంద్రబాబు సర్కారు ఎగనామం పెట్టింది. దీంతో 1.30 లక్షల మత్స్యకారులు ఇప్పటికే రూ.260 కోట్లు నష్టపోయారు. ఇప్పుడు ఏప్రిల్ నెలలో సాయం అందించడంపై మంత్రివర్గ సమావేశంలో చర్చించినట్లు చెబుతున్నారు. అయితే పథకం అమలు పై ఖచ్చితమైన ప్రతిపాదనలు, నిర్ణయాలు మాత్రం జరగలేదు. విధివిధానాలను ఖరారు చేయలేదు.