– కస్టమ్స్, సెంట్రల్ ట్యాక్స్ కమిషనర్ సాధు నరసింహారెడ్డి
యడ్లపాడు : అక్రమ రవాణాలో వేర్వేరు కేసుల్లో పట్టుబడి, పన్ను చెల్లించని విదేశీ, స్వదేశీ నకిలీ సిగరెట్లు, గంజాయి, చైనీస్ గార్లిక్ లను కస్టమ్స్ మరియు సెంట్రల్ జి.ఎస్.టి అధికారులు అన్నీ అనుమతులతో ధ్వంసం చేశారు. శుక్రవారం పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం లో గల జిందాల్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ లోని ఇన్సినరేటర్ లో వీటిని కాల్చి బూడిద చేసారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఔషద నిర్మూలన పక్షోత్సవంలో భాగంగా వీటిని దగ్ధం చేయడం జరిగింది.
కస్టమ్స్, సెంట్రల్ ట్యాక్స్ కమిషనర్ సాధు నరసింహారెడ్డి అందించిన వివరాల ప్రకారం..దగ్ధం చేసిన వాటిలో ప్యారిస్ బ్రాండ్ పేరుతో విదేశీ గుర్తులు గల సిగరెట్లు 65 లక్షల స్టిక్ లు వున్నాయని, వాటి విలువ 6 కోట్ల 50 లక్షలు వుంటుందన్నారు. అలాగే పన్ను చెల్లించని స్వదేశీ సిగరెట్లు 57 లక్షల స్టిక్ లు వున్నాయని, వీటి విలువ 2 కోట్ల 73 లక్షలు వుంటుందన్నారు. నిషేధిత 2420 కేజీల గంజాయి కూడా పూర్తిగా కాల్చి వేయడం జరిగిందని, దీని విలువ 2 కోట్ల 96 లక్షలు వుంటుందన్నారు. వీటితో పాటు 20 లక్షల విలువ గల ఫంగస్ తో కూడిన 10 టన్నుల చైనీస్ గార్లిక్ ను కూడా నాశనం చేశామన్నారు.
దగ్ధం చేసిన సిగరెట్లు, గంజాయి, గార్లిక్ లు పూర్తిగా నాసిరకం తో కూడుకున్న నకిలీ ఉత్పత్తులని, ఇవి ప్రజారోగ్యానికి ఎంతో హానికరమని కమిషనర్ నరసింహారెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు. వీటిని నిల్వ చేయడం, అమ్మడం చట్టరీత్యా నేరమన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై శిక్షలు, జరిమానాలు ఉంటాయన్నారు. పొగాకు ఉత్పత్తుల చట్టం కింద నమోదైన చట్టబద్ధమైన చిత్రాలు, హెచ్చరికలు, గడువు తేదీ, తయారీదారు వివరాలు, బ్యాచ్ నెంబర్లను ప్రజలు గమనించాలన్నారు.
నకిలీ సిగరెట్ ఉత్పత్తులను వ్యాపారులు, ప్రజలు ప్రోత్సహించవద్దని కమిషనర్ కోరారు. స్మగ్లింగ్ వ్వతిరేక కార్యకలాపాలు, ప్రజారోగ్యాన్ని కాపాడటంలో మరియు అక్రమ వ్యాపారాన్ని అరికట్టడంలో తమ అధికారులు అప్రమత్తత, అంకితభావంతో పనిచేస్తున్నారని కమిషనర్ తెలిపారు.