Suryaa.co.in

Andhra Pradesh

ఎన్నికల సమయంలో నీటి కోసం దొంగ యుద్ధమా?

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుంటే నీటి కోసం దొంగ యుద్ధాన్ని చేస్తావా? నీతి లేని నాయకుడా?? అని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘురామకృష్ణంరాజు మండిపడ్డారు.

అమ్మా… ఎంతకు తెగించారు…ఇన్నాళ్లు చెట్టా పట్టాలు వేసుకొని తిరిగి, ఇప్పుడు దొంగ నీటి యుద్ధం చేస్తావా? నీతి లేని నాయకుడా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఛీ… తలుచుకుంటేనే అసహ్యం వేస్తోంది. నీటి కోసం దొంగ యుద్ధం చేసే నీతి లేని నాయకులకు త్వరలోనే సమాధానం చెబుదామని ఆయన అన్నారు. గురువారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామ కృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నప్పటికీ, ఆంధ్రులకు కూడా ఈ ఫలితాల పై ఉత్కంఠ ఉంటుందన్నారు.

ఈ రోజైనా భూములెలా కబ్జా చేయాలని ఆలోచించకండి
లబ్ద ప్రతిష్టలైన ఇద్దరు రచయితల వర్ధంతి ఒకే రోజు కావడం యాదృచ్ఛికమని రఘురామ కృష్ణంరాజు అన్నారు . కన్యాశుల్కం వంటి ప్రసిద్ధ నవలను రాసిన గురజాడ వెంకట అప్పారావు వర్ధంతి నేడని ఆయన తెలిపారు . దేశమంటే మట్టికాదోయ్… దేశమంటే మనుషులోయ్, వట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు తలపెట్టవోయ్ అన్న గురజాడ , విజయనగరం మహారాజా కాలేజీలో అధ్యాపకునిగా సేవలందించారు. విజయనగరంలో కళలు విరజిల్లేవని పేర్కొన్న ఆయన, అశోక గజపతిరాజు తాత గారి హయాంలో గురజాడ అప్పారావు ఎన్నో గొప్ప రచనలు చేశారన్నారు. దేశమంటే మట్టికాదోయ్ అని గురజాడ అంటే, ప్రస్తుత పాలకులకు తమకు మట్టే కావాలి కానీ మనుషులు వద్దంటున్నారు.

ఆంధ్రను పరిపాలిస్తున్న ఈ సోకాల్డ్ ప్రభువులు. మట్టి కోసం మనుషుల్ని అదే మట్టిలో కలిపేస్తున్నారు.. రాష్ట్రంలో నియంతృత్వ పాలన కొనసాగుతున్న ఈ సందర్భంగా మనుషులని, మనుషులుగా చూడమని కోరుతున్నాను. దేశమంటే మట్టి కాదోయ్ అన్న గురజాడ మాటలను గుర్తు తెచ్చుకోవాలని ఆయన వంశీకుడైన జీవిడి కృష్ణమోహన్ కు సూచించారు. కనీసం ఈ ఒక్క రోజైనా రెగ్యులర్ గా స్పీచ్ లు రాసినట్టుగా గురజాడ అంటే గొప్ప వ్యక్తి అని మాత్రమే సరి పెట్టవద్దన్నారు.

భూమిని ఎలా కబ్జా చేయాలి… ఎలాగా సమూపార్జించాలనే ఆలోచనలను మానివేయాలని పాలకులకు చెబితే బాగుంటుందని రఘురామ కృష్ణంరాజు హితవు పలికారు .. స్వాతంత్రం కోసం పోరాడే రోజుల్లో ఎంతోమందిని దేశభక్తి వైపు పురిగొల్పే రచనలను గురజాడ అప్పారావు చేశారన్నారు . గురజాడ అప్పారావు ఆ రోజుల్లో విశాఖపట్నం జిల్లా వాస్తవ్యులే.. రాయవరంలో జన్మించి, విజయనగరం లో ప్రముఖ రచయితగా ప్రసిద్ధి కెక్కారని పేర్కొన్నారు

అర్థ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా? అని ప్రశ్నించిన కవి, రచయిత సిరివెన్నెల
బలపం పట్టి భామ ఒళ్ళో… అనే యుగళ గీతాలతో పాటు, అర్థ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా అనే అర్థవంతమైన పాటలను సిరివెన్నెల సీతారామశాస్త్రి రాశారని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. సమకాలీన వ్యవస్థలో, స్వాతంత్రం సముపార్జించుకున్న తరవాత కూడా, కనీసం నోరు విప్పి మాట్లాడలేని దుస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఒక పార్లమెంటు సభ్యుడు తన నియోజకవర్గంలో అడుగుపెట్టలేని దరిద్రపు స్థితిలోకి నెట్టిన ఈ దుర్మార్గపు పనికిమాలిన ప్రభుత్వాన్ని చూసిన తరువాత రవి గాంచని చోటు కవిగాంచును అనే వ్యాఖ్యలు అక్షర సత్యమనిపిస్తాయి. ఇటువంటి వ్యక్తులను చూడకముందే కవి ఎంతో చక్కగా ఈ పాటను రాశారన్నారు. విశాఖపట్నం వాస్తవ్యులైన సిరివెన్నెల సీతారామశాస్త్రి వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు.

LEAVE A RESPONSE