– తప్పుచేసిన వారిని వదిలి పెట్టం
– చంద్రబాబు పేరు చెప్పగానే దిగ్గజ కంపెనీల రెడ్ కార్పెట్ వెల్కమ్
– సీబీఎన్ బ్రాండ్ తోనే ఫార్చూన్ 500 కంపెనీలతో చర్చలు జరిపా…
– తెలుగువాడి ఆత్మగౌరవం ఎన్టీఆర్… ఆయన ఆశయాలతో ముందుకెళ్తాం
– ఏపీలో పెట్టుబడులు పెట్టండి… మీకు అండగా నిలచే బాధ్యత నాది
– అట్లాంటాలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సభలో మంత్రి నారా లోకేష్ పిలుపు
అట్లాంటా(యుఎస్ఎ): నేడు ప్రపంచమంతా ఏపీ వైపు చూస్తున్నారంటే అందుకు కారణం సీబీఎన్. ఐటి మంత్రిగా టాటా చైర్మన్ చంద్రశేఖరన్ తో కేవలం 90 నిమిషాలు చర్చించి టీసీఎస్ తేగలిగానంటే దానికి కారణం సీబీఎన్. ఒక్క మెయిల్ తో సత్యనాదెళ్ల అపాయింట్ మెంట్ ఇచ్చారని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అట్లాంటా సమీపంలోని కుమ్మింగ్ లో ఏర్పాటుచేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని లోకేష్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా హెలికాప్టర్ పైనుంచి పూలవర్షం కురిపించి ఎన్ఆర్ఐ తెలుగుదేశం పార్టీ(టీడీపీ)కార్యకర్తలు అభిమానం చాటుకున్నారు. జోహార్ అన్న ఎన్ టి ఆర్ అంటూ నినాదాలు చేశారు. తర్వాత జరిగిన సభలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ… వారం రోజుల అమెరికా పర్యటనలో నేను ఏ దిగ్గజ కంపెనీ వద్దకు వెళ్లినా సీబీఎన్ పేరు చెప్పగానే రెడ్ కార్పెట్ తో వెల్కమ్ చెప్పారు. అదీ ఈరోజు మనకున్న సీబీఎన్ బ్రాండ్ ఇమేజ్. ఆ బ్రాండ్ తోనే నేను ఫార్చూన్ 500 కంపెనీలకు వెళ్లి పెట్టుబడులు పెట్టాలని కోరాను. ఏపీలో ఎటువంటి సంస్కరణలు తెస్తామోనని ఈరోజు దేశమంతా ఆసక్తిగా మనవైపు చూస్తున్నారు.
ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం
ఈరోజు తెలుగు వారు తలెత్తుకొని తిరుగుతున్నారు అంటే దానికి కారణం అన్న ఎన్టీఆర్. పార్టీని స్థాపించిన 9నెలల్లో అధికారంలోకి తెచ్చిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్. క్రమశిక్షణ, పట్టుదలకు మారుపేరు ఎన్టీఆర్. తెలుగువారి ఆత్మగౌరవం పేరు చెబితే గుర్తుకువచ్చేది విశ్వ విఖ్యాత దివంగత నందమూరి తారకరామారావు. దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసిన వ్యక్తి ఎన్టీఆర్. ఏ ఆశయం కోసం పార్టీని స్థాపించారో ఆ ఆశయాలతోనే పార్టీని ముందుకు తీసుకెళ్తాం.
దేశంలో ఏ పార్టీకి లేని కార్యకర్తలు టీడీపీకే సొంతం. గత ప్రభుత్వంలో చేయనితప్పుకు బాబుని జైలులో బంధించారు. ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువారంతా… ఎన్ఆర్ఐలతో సహా రోడ్డెక్కి ఆందోళనలు చేశారు. ఆ సమయంలో మీరు ఇచ్చిన మద్దతు మాకు కొండంత బలాన్నిచ్చింది.
ఇటువంటి రాజకీయాలు మనకు అవసరమా అని బ్రాహ్మణి ప్రశ్నించింది. హైదరాబాద్ లో గ్రాటిట్యూడ్ సభ కు 45వేల మంది హాజరు కావడం చూశాక, బ్రాహ్మణి మళ్లీ ఆ విషయం గురించి మాట్లాడలేదు. ప్రజలు ఇచ్చిన మద్ధతుతో సైకోతో పోరాడేందుకు మాకు కొండంత బలాన్నిచ్చింది.
మీరు మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్
వారం రోజుల అమెరికా పర్యటనలో రాష్ట్రాన్ని ప్రమోట్ చేయడానికి అవిశ్రాంతంగా ఇన్వెస్టర్స్ ని కలిసాను. కానీ ఈ రోజు మిమ్మల్ని చూసిన తరువాత నాకు కిక్ వచ్చింది. అందరూ మిమ్మల్ని ఎన్.ఆర్.ఐ లు అంటారు, కానీ నేను మాత్రం ఎప్పుడూ మిమ్మల్ని ఎం.ఆర్.ఐ లు అనే అనుకుంటా. ఎం.ఆర్.ఐ అంటే మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్. మీ జోష్, ఎనర్జీ చూస్తుంటే నేను అట్లాంటాలో ఉన్నానా, అమలాపురంలో ఉన్నానా అనే డౌట్ వస్తోంది. మీరు దేశాన్ని, రాష్ట్రాన్న ప్రేమిస్తారు.
అమెరికా లో ఉన్నా… మీ మనసంతా రాష్ట్రం వైపే ఉంటుంది. రాష్ట్రం బాగుండాలి, అభివృద్ధి చెందాలి అని కోరుకుంటారు. అందుకే మీరు మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్. సంపాదించిన రూపాయిలో 10పైసలు సొంతగడ్డకు ఖర్చుపెడుతున్నారు. ఇటీవల ఎన్నికల సమయంలో 2 లక్షలు ఖర్చుపెట్టి టిక్కెట్ కొనుక్కొని వచ్చి మరీ ఓటేశారు. కొందరు ఏడాదిపాటు ఏపీలోనే ఉండి సేవలందించారు.
చరిత్రలో ఎప్పుడూ రానివిధంగా ఈసారి కూటమి అభ్యర్థులకు మెజారిటీలు వచ్చాయి. 92శాతం సీట్లు ఇచ్చారు. మంగళగిరి ప్రజలు నన్ను 91వేల పైచిలుకు మెజారిటీతో గెలిపించారు. రాష్ట్ర ప్రజలంతా సైకోని తరిమికొట్టాలని కంకణం కట్టుకోవడం ఇంతటి ఘనవిజయం సాధ్యమైంది. ఎన్నికల్లో 175కి 175 అన్నవారి ముఖాలు మాడిమసైపోయాయి. ప్రపంచంలో ఉన్న తెలువారందరిదీ ఈ గెలుపు.
ఎన్ఆర్ఐలు కూడా సైకో బాధితులే
అయిదేళ్లలో రాష్ట్రం నాశనమైనంది. ఎన్ఆర్ఐలు సైకో బాధితులే. కాలిఫోర్నియాలో ఒక వ్యక్తి 500 కోట్లు అమరావతిలో పెట్టుబడి పెట్టారు. వైసీపీ వచ్చాక విజిలెన్స్ వాళ్లను పంపి ఇబ్బందులు పెట్టారు. అడుగడుగునా అవమానించారు, అయినా ఆయన ధైర్యంగా నిలబడ్డారు. నేనుకూడా గత ప్రభుత్వంలో బాధితుడ్నే. నేను యువగళం పాదయాత్ర చేస్తుంటే జిఓ1 తెచ్చి అడ్డుకోవాలని చూశారు. ఆ జిఓను మడతపెట్టి జేబులో పెట్టుకోమని చెప్పాను. పాదయాత్రలో మాట్లాడుతుంటే నా స్టూల్, మైక్ లాగేశారు. అడుగడుగునా ఇబ్బంది పెట్టారు. ఆ సమయంలో నాకు అండగా నిలచింది టీడీపీ కార్యకర్తలు. ఆరోజే ఎర్ర బుక్కు గురించి చెప్పా. ఇప్పుడు జగన్ గుడ్ బుక్ తెరుస్తాడంట, నోట్ బుక్ చదవడమే రాదు, గుడ్ బుక్ లో ఏం రాస్తారు? గత అయిదేళ్ల అరాచక పాలనలో పెట్టుబడులు పొరుగురాష్ట్రాలకు వెల్లిపోయాయి. ఇప్పుడు పెట్టుబడులు తెచ్చే బాధ్యత కూడా నాపైఉంది.
వారికి సినిమా చూపించే బాధ్యత నాది
రెడ్ బుక్ లో ఒక చాప్టర్ అయిపోయింది, రెండోది ఓపెన్ అయింది, మూడో చాప్టర్ గురించి రాము, వెంకట్రావుని అడగండి. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు త్వరలో మూడో చాప్టర్ తెరవబోతున్నా. ఎన్నికల్లో ప్రజలే వారి కుర్చీలు మడతపెట్టారు. బాబు తలుచుకుంటే వాళ్లను లోపల వేయడం రెండు నిమిషాల పని. చేయని తప్పుకు 53రోజులు జైలుశిక్ష అనుభవించిన ఆయనకు బాధ ఉండదా? ప్రజలు మనకు అఖండ విజయాన్ని ఇచ్చినందుకు హుందాతనంగా, గౌరవంగా ఉండి ప్రజల కోసం పనిచేయాలి.
గాడితప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాల్సిన గురుతర బాధ్యత మాపై ఉంది. పద్ధతి ప్రకారం రెడ్ బుక్ అమలుచేస్తాం. నేను తగ్గేదే లేదు, పార్టీ కేడర్ ను ఇబ్బంది పెట్టిన వారికి సినిమా చూపే బాధ్యత లోకేష్ ది. మేం కూడా మనుషులమే. విశాలమైన వ్యవస్థలో కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి, అంతమాత్రాన అలిగి పడుకోవద్దు. మా దృష్టికి తెస్తే సరిచేసుకుంటాం. మీకు ఉన్న సమస్యలు కొన్ని నా దృష్టికి తీసుకొచ్చారు. వాటిని వీలైనంత త్వరగా పరిష్కరిస్తా.
ప్రతి తెలుగువాడు పారిశ్రామికవేత్త కావాలి
తెలుగువారు ప్రపంచాన్ని శాసించేస్థాయికి ఎదగాలన్నది బాబు ఆశయం. ఏపీఎన్‌ఆర్‌టీ ద్వారా ఆదాయాన్ని పెంచేందుకు స్కిల్ శిక్షణ ఇస్తాం. ప్రతి తెలుగువాడు ఎంటర్ ప్రెన్యూర్ కావాలి.. అమెరికా ఎక్కువ తలసరి ఆదాయం తెలుగువారిదే. ఎన్ఆర్ఐలు ఏపీలో పెట్టుబడి పెట్టండి, మీకు అండగా నిలచే బాధ్యత నాది. రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపేందుకు సంస్కరణలు తేవాల్సి ఉంది. అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెడ్ల బండిలా ముందుకు తీసుకెళ్తాం. ఇచ్చిన మాట ప్రకారం యువతకు ఉద్యోగాలిస్తేనే మనం మళ్లీ ప్రజాక్షేత్రంలో నిలబడతాం. ఇందుకు ఎన్ఆర్ఐలు తమ వంతు సహకారం అందించాలి.
వెయ్యి రూపాయల పెన్షన్ పెంచడానికి సైకోకి ఐదేళ్లు పట్టింది. చంద్రబాబు మూడు వేల పెన్షన్ ను ఒకే ఒక్క సంతకంతో నాలుగు వేలు చేశారు. వైసీపీ హయాంలో ఒక్క డిఎస్సీ వెయ్యలేదు. కూటమి సర్కారు వచ్చాక 16,500 పోస్టులతో మెగా డిఎస్సీ నిర్వహిస్తున్నాం. సంక్షేమానికి పుట్టినిల్లు తెలుగుదేశం పార్టీ. దీపావళి సందర్భంగా తెలుగింటి ఆడపడుచులకు గ్యాస్ సీలిండర్ ఉచితంగా ఇస్తున్నాం. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని మనం నిలబెట్టుకునేందుకు కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి లోకేష్ చెప్పారు.