Suryaa.co.in

Andhra Pradesh

తెలుగుజాతి ఉన్నంత కాలం చరిత్ర పుటల్లో ఎన్టీఆర్ పేరు

– ఎన్టీఆర్ ఆస్తిలో వాటా ఇస్తే… జగన్ తల్లి, చెల్లిని రోడ్డుకీడ్చారు
– రాష్ట్రాభివృద్ది కోసం బాబు, లోకేష్ లకు అండగా నిలవాలి
– అట్లాంటా ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సభలో టీడీపీ ఎమ్మెల్యేలు

అట్లాంటా (యుఎస్ఎ): తెలుగుజాతిలో ఎన్టీఆర్ అంతటి పేరుప్రఖ్యాతులు గడించిన నేత మరొకరు లేరు. తెలుగుజాతి ఉన్నంతకాలం ఆయనపేరు చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలుస్తుందని గుడివాడ శాసన సభ్యుడు వెనిగండ్ల రాము అన్నారు. అట్లాంటా సమీపంలోని కుమ్మింగ్స్ లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సభలో రాము మాట్లాడుతూ… రాష్ట్రం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్ అవిశ్రాంతంగా కష్టపడుతున్నారు, ఎన్ఆర్ఐ లంతా వారి ప్రయత్నాలకు అండగా నిలవాలి. మంత్రి లోకేష్ పెట్టుబడుల కోసం ఒకేరోజు పదుల సంఖ్యలో ఇన్వెస్టర్లతో మాట్లాడుతున్నారు.

తెలుగుదేశం పార్టీ(టీడీపీ) భవిష్యత్ ఆశాకిరణం లోకేష్. ఆయన పార్టీని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తారు. అయిదేళ్లు పడిన కష్టం మర్చిపోయేలా ఈరోజు అన్న విగ్రహావిష్కరణ జరిగింది. లోకేష్ చేతులమీదుగా విగ్రహాన్ని ఆవిష్కరించడం ఆనందంగా ఉందని రాము అన్నారు. ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ… భారతదేశ రాజకీయవేత్తల్లో స్టాన్ ఫోర్డ్ వంటి ప్రఖ్యాత విద్యాసంస్థలో చదివి రాజకీయాల్లోకి వచ్చిన ఏకైక నేత నారా లోకేష్. నేను ఎమ్మెల్యేగా ఎన్నికల కావడంలో లోకేష్ పాత్ర ఉంది. అయిదేళ్ల పాలనలో జగన్ ఖజానా ఖాళీ చేశారు. ఎన్ఆర్ఐ లు వారి నియోజకవర్గాలకు వెళ్లినపుడు ఎమ్మెల్యేలతో కలిసి నియోజకవర్గాల్లో తిరగండి, సమస్యల పరిష్కారానికి మీవంతు సహకారం అందించాలని కోరారు.

గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ… 60ఏళ్ల వయసులో ప్రాంతీయ పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లో అధికారంలో తెచ్చిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్. ఆయన ప్రవేశపెట్టిన విప్లవాత్మక సంస్కరణలు ఈనాటి పాలకులకు ఆదర్శంగా ఉన్నాయి. అన్న ఎన్టీఆర్ ప్రవేశపెట్టి రెండు రూపాయల కిలో బియ్యం తీసే సాహసం ఏ ప్రభుత్వం చేయలేదు. భారత్, ఏపీ ఆర్థిక వ్యవస్థలో ఎన్ఆర్ఐలది కీలకపాత్ర. ఏపీ రాజధాని అమరావతిలో పెట్టుబడిలో పెట్టండి. మహిళలకు ఆస్తిలో సమానహక్కు చట్టాన్ని తెచ్చిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్. దురదృష్టవశాత్తు మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆ చట్టాన్ని గౌరవించడం లేదు.

తల్లి, చెల్లికి అన్యాయంచేసి రోడ్డుకీడ్చారు. అయిదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యం కోసం పనిచేస్తున్న చంద్రబాబు, లోకేష్ లకు అండగా నిలవాలని కోరారు. నగరి ఎమ్మెల్యే గాలి ప్రకాష్ మాట్లాడుతూ.. ఇక్కడ ఎన్ఆర్ఐల ఉత్సాహం చూస్తే ఏపీలో ఉన్నట్లుగా ఉంది. 164 సీట్లతో ఘన విజయం వెనుక లోకేష్ కీలకపాత్ర ఉంది. రాష్ట్ర భవిష్యత్తును, టీడీపీని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఎండనకా, వాననకా పాదయాత్ర చేశారు. పంచాయితీరాజ్ మంత్రిగా ఏ మంత్రిచేయని విధంగా 25 వేల కి.మీ.ల సీసీ రోడ్లు, ఎల్ఈడి లైట్లు వేశారు. లోకేష్ నేతృత్వంలో పార్టీ భవిష్యత్తు బాగుంటుంది.

ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అన్న టీడీపీ పెట్టిన తర్వాతే తెలుగువారికి ప్రపంచస్థాయిలో గుర్తింపు వచ్చింది. రానున్న రోజుల్లో రాష్ట్రాభివృద్ధిలో ఎన్ఆర్ఐలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. యుఎస్ఎ ఎన్ఆర్ఐ టీడీపీ అధ్యక్షుడు కోమటి జయరాం మాట్లాడుతూ అన్నగారి శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాం. తెలుగుజాతి ఉన్నంత వరకు అన్న ఎన్టీఆర్ పేరు చిరస్థాయిగా నిలుస్తుంది. ప్రభుత్వానికి ఎన్ఆర్ఐ లంతా అండగా ఉంటాం. నిస్వార్థంగా పార్టీ కోసం పనిచేసిన ఎన్ఆర్ఐలను గుర్తించండి. రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడుపుతారని విశ్వసించి వారంతా టీడీపీ విజయానికి కృషిచేశారు. భవిష్యత్తులో కూడా పార్టీకి అండగా ఉంటామని జయరాం పేర్కొన్నారు.

LEAVE A RESPONSE