Suryaa.co.in

Andhra Pradesh

సోషల్ మీడియాలో సైకోల తప్పుడు పోస్టులు

-మదమెక్కిన ఆంబోతుల మాదిరి చెప్పకూడని బాషలో పోస్టులు
– సీఎం చంద్రబాబు నాయుడు

అమరావతి :‘సోషల్ మీడియాలోనూ కొందరు సైకోలు ఇష్టానుసారం పోస్టులు పెడుతున్నారు. అడ్డూఅదుపు లేకుండా ఆడబిడ్డలపై పోస్టులు పెట్టి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. వెధవలకు కుటుంబాలు లేవేమో… కానీ మనం గౌరవంగా బతుకుతున్నాం. నా సతీమణి గురించి అసెంబ్లీలో అసభ్యకరంగా మాట్లాడినప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నా. అలాంటి మాటలు విన్నప్పుడు ఎంతటి సహనం గల మనిషికైనా బాధ, రోషం కలుగుతుంద.‘ ని, సీఎం చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.

మదమెక్కిన ఆంబోతుల మాదిరి సోషల్ మీడియాలో చెప్పకూడని బాషలో పోస్టులు పెడుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆయన పిల్లలపై, హోంమంత్రి వంగలపూడి అనితపైనా ఇష్టానుసారంగా నోటికొచ్చిన విధంగా పోస్టులు పెడుతున్నారు. వీళ్లపై చర్యలు తీసుకోకూడదా? వదిలి పెట్టాలా? మదం, కొవ్వు ఎక్కువై నేరస్తులుగా మారారు. వివేకానందరెడ్డి హత్యను సాక్షిలో మొదట గుండెపోటు అని ప్రసారం చేశారు.

మరుసటి రోజు నారాసుర రక్త చరిత్ర అని నాపై వార్తలు రాశారు. రాజకీయాల్లో మోసం చేసి ఆడుకోవాలంటే వదిలిపెట్టను. శాంతిభద్రతలు ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి. మత విద్వేషాలు రెచ్చగొట్టేవారిపై పోరాడి మతసామరస్యాన్ని కాపాడాం. సీమలో ఫ్యాక్షన్ ముఠాలను అణగదొక్కాం. తల్లిదండ్రులను పోగొట్టుకున్న వాళ్లను ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా చదివించాం. హత్యకు హత్య సమాధానం కాదని చెప్పాం.

జీవితాలు కోల్పోతారని చెప్పి చట్టపరంగా శిక్షిస్తామని నాడు చెప్పా. ఏ పార్టీ అయినా సమానంగా చూశాను… మా పార్టీ వాళ్లను కూడా అరెస్టు చేయించాను. కొందరు నేరస్తులు రాజకీయ ముసుగులో ఉన్నారు… ఘోరాలు చేస్తున్నారు. మనుషులను చంపుతున్నారు…ఆస్తులను కొట్టేస్తున్నారు.’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అశ్లీల పోస్టులు పెట్టడం భావవ్యక్తీకరణ స్వేచ్ఛా?

‘ప్రజాస్వామ్యం అంటూ ఆడబిడ్డలను తిడతారా? యజ్ఞంలా అభివృద్ధి చేస్తుంటే మానసికంగా ఇబ్బందులు పెడుతున్నారు. అన్ని చట్టాలు పరిశీలిస్తాం. మహిళల వ్యక్తిత్వాన్ని హననం చేస్తే ఖబడ్దార్. హద్దులు మీరి ప్రవర్తిస్తే ఊరుకునేది లేదు. గత ప్రభుత్వం చేసిన దరిద్ర పనులతో ఎక్కడిక్కడ గంజాయి వచ్చింది. నాలుగేళ్ల ఆడబిడ్డలపై అత్యాచారాలు చేస్తున్నారు… వాళ్లు మనుషులేనా.? కొవ్వెక్కి ప్రవర్తిస్తే తాట తీస్తా. పోలీసులు కూడా ఆలోచించుకుని పని చేసి నేరస్తులపై పైచేయి సాధించాలి.

పోస్టులు పెట్టడం భావవ్యక్తీకరణ అని మాట్లాడుతున్నారు. ఆడబిడ్డల వ్యక్తిత్వాన్ని హననం చేయడం భావవ్యక్తీకరణా.? అసభ్యకరమైన, అశ్లీల పోస్టులు పెట్టడమా.? ఏ చట్టం మీకు అధికారం ఇచ్చింది? జడ్జి కుటుంబ సభ్యులపైనా పోస్టులు పెడితే చెప్పుకోలేని పరిస్థితి. ప్రజాచైతన్యం లేకుంటే దుర్మార్గులు చెప్పే మాటలు కొంతమంది కూడా నమ్ముతారు. నేరస్తులకు ఆడబిడ్డలంటే గౌరవం లేదు…ఆ పార్టీలో ఉండే అర్హత ఆడబిడ్డలకు ఉందా.? ఏ ఆడబిడ్డపైనా అసభ్యకరమైన పోస్టు పెట్టొద్దని కూటమి పార్టీల కేడర్ కు కూడా చెప్తున్నా.

వైసీపీ వాళ్లకు ఎక్కడ వాత పెట్టాలో అక్కడ పెట్టి బుద్ధి చెప్తా. రాజకీయంగా మాట్లాడితే తప్పులేదు…వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడితే ఊరుకునేది లేదు. పద్ధతి ప్రకారం మేం చేసే రాజకీయాన్ని ఎదుర్కోలేక రౌడీలతో బెదిరిస్తే పరిణామాలు వేరేలా ఉంటాయి. దుర్మార్గుల నుండి రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత మాపై ఉంది.’ అని సీఎం చంద్రబాబు అన్నారు.

LEAVE A RESPONSE