జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లాకు ఘన వీడ్కోలు

అమరావతి,16 జూన్ :ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా పనిచేసి పాట్నా హైకోర్టుకు న్యాయమూర్తిగా బదిలీపై వెళుతున్న జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లా(Ahsanuddin Amanullah)కు హైకోర్టుల్లో ఘనంగా వీడ్కోలు పలికారు.సుమారు ఏడు మాసాలపాటు రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానంలో న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లాకు గురువారం నేలపాడులోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో మొదటి కోర్టు హాల్లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని పుల్ కోర్టు ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు పలికారు.

ఈవీడ్కోలు కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ గత ఏడు మాసాలుగా ఎపి హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ అమానుల్లా అందించిన సేవలను ఆయన ప్రత్యేకంగా కొనియాడారు.పాట్నా హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీసు ప్రారంభించి అక్కడ వివిధ హోదాల్లో పనిచేసిన జస్టిస్ అమానుల్లా ఏడు మాసాల క్రితం ఎపి హైకోర్టుకు న్యాయమూర్తిగా వచ్చి పలు కీలక కేసుల్లో తీర్పులు ఇచ్చారన్నారు.ఎపి లీగల్ సర్వీసెస్ అధారిటీకి ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ గా పనిచేసి మెరుగైన సేవలందించారని జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా గుర్తు చేశారు.జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లా ఒక టఫ్ పరిపాలకునిగా జస్టిస్ మిశ్రా కొనియాడారు.

పాట్నా హైకోర్టుకు న్యాయమూర్తిగా బదిలీపై వెళుతున్న జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లా మాట్లాడుతూ పాట్నా హైకోర్టు నుండి 2021 అక్టోబరు 10వతేదీన ఎపి హైకోర్టుకు న్యాయమూర్తిగా తాను బదిలీపై రావడం జరిగిందని మరలా పాట్నా హైకోర్టుకు న్యాయమూర్తిగా బదిలీపై వెళుతున్నానని పేర్కొన్నారు.సుమారు ఏడు మాసాల పాటు ఇక్కడ న్యాయమూర్తిగా సేవలందించేందుకు తోడ్పడిన ప్రధాన న్యాయమూర్తి సహా సహచర న్యాయమూర్తులు,న్యాయవాదులు ఇతర సిబ్బంది అందరికీ ఆయన పేరుపేరున ధన్యవాదాలు తెలియజేశారు.వ్యక్తులు వస్తుంటారు వెళుతుంటారని కాని సంస్థ అనేది శాశ్వతమని పేర్కొంటూ ఇక్కడ తనకు విధినిర్వహణలో తోడ్పాటును అందించిన ప్రతి ఒక్కరికీ మరొకసారి పేరుపేరున కృతజ్ణతలు తెలియజేస్తున్నట్టు జస్టిస్ అమానుల్లా చెప్పారు.

హైకోర్టు అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ మాట్లాడుతూ జస్టిస్ అమానుల్లా పలు కీలకమైన కేసుల్లో తీర్పులిచ్చారని గుర్తు చేశారు.ముఖ్యంగా ఎపి లీగల్ సర్వీరెస్ అధారిటికీ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ గా ఆయన ఎనలేని సేవలందించారని కొనియాడారు.ఎపి హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షులు జానకిరామి రెడ్డి మాట్లాడుతూ బీహార్ పాట్నా హైకోర్టు స్టాండింగ్ కౌన్సిల్ ప్రభుత్వ న్యాయవాదిగా జస్టిస్ అమానుల్లా పనిచేయడమే గాక అక్కడ వివిధ ట్రిబ్యునల్స్ కు ఆయన సేవలందించారని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ అధ్యక్షులు ఘంటా రామారావు మాట్లాడుతూ జస్టిస్ అమానుల్లా ఎపి హైకోర్టులో ఐటి సంబంధిత వివిధ అంశాలకు సంబంధించిన కేసుల్లో తీర్పులు ఇచ్చారని పేర్కొన్నారు.అదే విధంగా లీగల్ సర్వీసెస్ అధారిటి ద్వారా మంచి సేవలందించారని తెలిపారు.సహాయ సొలిసిటర్ జనరల్ ఎన్.హరనాధ్ మాట్లాడాతూ బదిలీపై వెళుతున్న జస్టిస్ అమానుల్లా ఆయురారోగ్యాలతో న్యాయవ్యవస్థకు మరిన్ని సేవలందించాలని ఆకాంక్షించారు.ఈవీడ్కోలు సభలో పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, రిజిష్ట్రార్లు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply