కామారెడ్డి: జిల్లాలో రైతులను పోలీసు స్టేషన్ కు తరలించిన ఘటనపై మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమి కోసం పోరాడిన లగచర్ల దళిత, గిరిజన, బలహీనవర్గాల రైతులపై అక్రమ కేసులు బనాయించి సంకెళ్లు వేశారని ప్రభుత్వంపై మండిపడ్డారు. నేడు బస్తా యూరియా కోసం పోలాలు వదిలి పోలీసు స్టేషన్లకు వెళ్లి పడిగాపులు కాసే దుస్థితిని రైతన్నకు తెచ్చావు. దేశానికి అన్నం పెట్టే రైతులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి నేరస్తులా?
రేవంత్ రెడ్డి.. నీ చేతగాని పాలనతో రైతులను అరిగోస పెడుతున్నవు. అన్నదాతలను నడిరోడ్డుకు ఈడ్చి వికృతానందం పొందుతున్నవు అని దుమ్మెత్తిపోశారు. రైతులను పోలీసు స్టేషన్లలో పెట్టి ఎరువులు పంపిణీ చేసే పరిస్థితులు తెచ్చిన నువ్వు చరిత్ర హీనుడిగా మిగిలిపోక తప్పదు. రైతులను నేరస్తులుగా పోలీసు స్టేషన్లలో కూర్చోబెట్టిన నీ దుర్మార్గ వైఖరిని యావత్ తెలంగాణ సమాజం గమనిస్తున్నది. తగిన సమయంలో బుద్ధి చెబుతుందని ఆయన సీఎంకు హెచ్చరించారు.