– రైతుభరోసా కోసం మరో 1313.53 కోట్లు విడుదల
– మరో వారంలోగా పూర్తిగా రైతుభరోసా నిధుల జమ
– బిఆర్ఎస్ నాయకులకు మా ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు లేదు
– సాగు సమయానికి రైతుబంధు నిధులు ఎప్పుడూ పడలేదు
– ఒక సందర్భంలో మినహ ప్రతిసారి ఆలస్యంగానే వానాకాలం రైతుబంధు నిధులు
– ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉన్న రైతులకు ఏ పథకాలను ఆపడం లేదు
– రైతుల సంక్షేమం విషయంలో దేశానికే ఆదర్శంగా తెలంగాణ
– మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
హైదరాబాద్: ఈ రోజు 4 ఎకరాలకు వరకు రైతుభరోసా నిధులు జమ చేసినట్టు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం మరో 1313.53 కోట్లు విడుదల చేసినట్టు తెలిపారు. దీంతో మరో 21.89 లక్షల ఎకరాలకు సంబంధించిన 6.33 లక్షల మంది రైతులు లబ్ధిపొందనున్నారని, ఇప్పటి వరకు మొత్తం 5215.26 కోట్లు రైతుభరోసా కోసం విడుదల చేసి, 58.04 మంది రైతులకు సహాయం అందించినట్టు తెలిపారు.
9 రోజుల్లో 9 వేల కోట్లను రైతుల ఖాతాలలో జమ చేస్తానని గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు వరుసగా మూడో రోజు రైతు భరోసా నిధులు విడుదల చేసినట్టు తెలిపారు. ఎకరాలతో సంబంధం లేకుండా సాగు యోగ్యమైన అన్ని భూములకు రైతు భరోసా సహాయాన్ని అందిస్తామని చెప్పారు.
రైతు భరోసా విషయంలో బిఆర్ఎస్ నాయకులకు ప్రశ్నించే హక్కు లేదుః
రైతుభరోసా విషయంలో బిఆర్ఎస్ నాయకులకు తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు లేదని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. బిఆర్ఎస్ నాయకులు రైతుభరోసా విషయంలో చేస్తున్న మోసపూరిత ప్రకటనలకు మంత్రి తుమ్మల ఈ విధంగా సమాధానం ఇచ్చారు.
గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఒక సందర్భంలో మినహా, వానాకాలం రైతుబంధు సహాయం ఎప్పుడు సాగు కాలానికి ముందుగా ఇవ్వలేకపోయిందని, ప్రతిసారి ఆలస్యంగానే రైతుబంధు నిధులు రైతుల ఖాతాలలోకి జమ చేసారని, అదికూడా 10వ నెల వరకు కొనసాగేదని అన్నారు. అంతేకాకుండా ఏ ఒక్క సందర్భంలో కూడా 3 రోజుల్లోనే 5 వేల కోట్లకు పైగా రైతుబంధు కోసం ఖర్చు పెట్టిన దాఖలాలు లేవని మంత్రి పేర్కొన్నారు.
బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అనాలోచిత పాలనతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నా, మా ప్రజా ప్రభుత్వం వచ్చిన తరువాత తెలంగాణ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం దేశానికే ఆదర్శంగా 2 లక్షల లోపు రైతు రుణమాఫి పథకాన్ని పూర్తిచేసి చూపించామన్నారు. అంతేకాకుండా రైతుభరోసా పథకం కింద ఎకరాకు 5 వేల నుండి 6 వేలకు పెట్టుబడి సహాయాన్ని పెంచి, రైతులకు అందచేస్తున్నామన్నారు. ఎన్నికలకు ముందే ఇవ్వాల్సిన యాసంగికి సంబంధించిన రైతుబంధు నిధులను ఇవ్వకుండా గత ప్రభుత్వం వదిలేస్తే, మేము అధికారంలోకి రాగానే వాటిని కూడా చెల్లించామని అన్నారు.
రైతుల సంక్షేమం కోసం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే దాదాపు 77000 కోట్లు రైతు సంక్షేమం కోసం ఖర్చు పెట్టిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, అలాంటి ప్రభుత్వాన్ని విమర్శించడం మానుకోవాలని హితవు పలికారు. గౌరవ సీఎం ఇచ్చిన హామీ మేరకు వానాకాలం రైతుభరోసా నిధులు జమ చేస్తున్నామని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకున్న కూడా 9 రోజులలో రైతుభరోసా సహాయాన్ని పూర్తి చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని, రైతుల సంక్షేమం కోసం మా ప్రభుత్వం కట్టుబడి ఉందనేందుకు ఇదొక ఉదాహరణ అని ఆయన అన్నారు.