– మంత్రి పేర్ని నాని చేతుల మీదుగా జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు పోటీలు ప్రారంభం
– వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్ పిలుపు
గుడివాడ, జనవరి 10: కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం లింగవరం రోడ్ లోని కే. కన్వెన్షన్ లో ఐదు రోజుల పాటు జరిగే జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు పోటీలను ఈ నెల 11వ తేదీ ఉదయం 11 గంటలకు రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ప్రారంభిస్తారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్ చెప్పారు. సోమవారం మంత్రి కొడాలి నాని క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ టూ వైయస్సార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగ దారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), ఆయన సోదరుడు కొడాలి నాగేశ్వరరావు (చిన్ని) గత ఐదేళ్లుగా ఈ పోటీలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పోటీల ప్రారంభోత్సవానికి ముందుగా గోపూజ జరుగుతుందని చెప్పారు. జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే ఎడ్ల జతలకు, వాటి యజమానులకు కే. కన్వెన్షన్ లో భోజన, వసతి సౌకర్యాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ పోటీలను చూసేందుకు పశుపోషకులు, రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తారని, వీరి కోసం గ్యాలరీలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు పోటీల విజయవంతానికి ప్రతి ఒక్కరు సహకరించాలని దుక్కిపాటి శశిభూషణ్ విజ్ఞప్తి చేశారు.