– ఉద్దేశపూర్వకంగా ఉచిత పంటల బీమాకు మంగళం
– రెండేళ్ల నుంచి ప్రీమియమ్ కట్టని ప్రభుత్వం
– కాకినాడ లోని క్యాంప్ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడిన వైయస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు
కాకినాడ: మొంథా తుపాన్‌తో రాష్ట్రంలో రైతులు తీవ్రంగా నష్టపోతే ప్రభుత్వం మాత్రం తూతూమంత్రంగా నష్టం అంచనాలు తయారు చేస్తోందని వైయస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి కురుసాల కన్నబాబు ఆక్షేపించారు. సీఎం చంద్రబాబుకు ప్రచారంపై ఉన్న శ్రద్ధ రైతుల పంట నష్టంపై లేదని ఆయన ఆగ్రహించారు. రైతుల నడ్డి విరిచిన సీఎం చంద్రబాబు, ఉచిత పంటల బీమా రద్దు చేసి, వారి గొంతు కోశారని కాకినాడలోని క్యాంప్ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఫైర్ అయ్యారు.
మొంథా తుపాన్‌తో తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి కనీసం రూపాయి సాయం కూడా ప్రకటించని ప్రభుత్వం, తన డిజిటల్ మీడియా ప్రచారానికి మాత్రం రూ.200 కోట్లు విడుదల చేయడం అత్యంత హేయమని మాజీ మంత్రి కురసాల కన్నబాబు దుయ్యబట్టారు. రైతుల కష్టాలను వదిలి ఊహల్లో తేలుతున్న ప్రభుత్వం, రియల్ టైమ్ గవర్నెర్స్ (ఆర్టీజీఎస్) పేరుతో హంగామా చేస్తోందని ఆయన గుర్తు చేశారు.
వైయస్సార్సీపీ ప్రభుత్వంలో రైతులకు భరోసా ఉండేది. కానీ ఇప్పుడు ఆ భరోసాకు ఎక్కడా చోటు లేదు. ఉద్దేశపూర్వకంగా ఉచిత పంటల బీమాకు మంగళం పాడిన ప్రభుత్వం, రెండేళ్ల నుంచి ఏ సీజన్లోనూ, ఏ పంటకూ ప్రీమియమ్ కట్టడం లేదు. ఇప్పుడు మొంథా తుపాన్‌తో పంటలకు ఎంతో నష్టం వాటిల్లింది. కానీ, కేవలం 19 లక్షల ఎకరాలకు మాత్రమే పంటల బీమా సదుపాయం ఉంది. బ్యాంక్ రుణాలు తీసుకున్న 19 లక్షల మంది రైతులకు మాత్రమే ఆయా బ్యాంక్‌లు పంటల బీమా చేశాయి. మరి మిగిలిన రైతుల పరిస్థితి ఏమిటి?
నాడు ఉచిత పంటల బీమా పరిధిలో 84 లక్షల రైతులు ఉండగా, ఇప్పుడు కేవలం 19 లక్షల రైతులకు మాత్రమే ఆ సదుపాయం ఉంది. మరి మిగిలిన రైతులు, పంటలకు ఎలా న్యాయం చేస్తారు? ఆ రైతులను ఎలా ఆదుకుంటారు? ఉద్దేశపూర్వకంగానే ఉచిత పంటల బీమాకు మంగళం పాడిన సీఎం చంద్రబాబు రైతుల నడ్డి విరిచి, వారి గొంతు కోశారు.
మొంథా తుపాన్ నష్టం అంచనాలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం చూస్తుంటే అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నష్టాన్ని తక్కువగా చూపే ప్రయత్నం చేస్తోందన్న అనుమానాలు వస్తున్నాయి. దాదాపు రూ.5,265.51 కోట్ల నష్టం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు చెబుతూ, అందులో ప్రధానంగా రహదారులు–భవనాల శాఖ పరిధిలో రూ.2079 కోట్ల నష్టం చూపుతున్నారు.
పంట నష్టం రూ.829 కోట్లు, ఆక్వా నష్టం రూ.1270 కోట్లు అయితే పంచాయితీరాజ్ శాఖలో కేవలం రూ.8 కోట్ల నష్టం జరిగిందంటున్నారు. అంటే గ్రామీణ రోడ్లు, గ్రామాల్లో వ్యవస్థలు పాడవలేదా? డ్రైన్లు పాడవలేదా? నీటి పారుదల శాఖలో అసలు నష్టమే జరగలేదా? అంటే పరిహారం ఎగ్గొట్టడం కోసం ప్రభుత్వం కావాలనే ఆ నష్టాన్ని తక్కువగా చూపే ప్రయత్నం చేస్తోందన్న అనుమానం వస్తోంది. ఇవేవీ లేనప్పుడు మీ ఆర్టీజీఎస్ వల్ల ఎవరికి ప్రయోజనం? ఈ తుపాన్లో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు ఇంత చెల్లిస్తామని ఈరోజుకీ చెప్పలేకపోయారు.
2024 కంటే ముందు వైయస్.జగన్ ప్రభుత్వ హయాంలో పంట నష్టం జరిగితే వరికి ఎకరాకు రూ.25వేలు పరిహారం ఇవ్వాలని కూటమిలో ఉన్న నేతలే డిమాండ్ చేశారు. ఇప్పుడు ఎంత ఇవ్వాలని కోరుకుంటున్నారు? ఎకరాకు ఎంత పరిహారం ఇవ్వాలనుకుంటున్నారు? ప్రభుత్వం ఎంత ఇస్తుంది? గతంలో విజయవాడ వరదల వల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో పంట నష్టపోతే వారికి పరిహారం ఇవ్వలేదు.