Suryaa.co.in

Editorial

కొడుకు లోకేష్ బాటలో తండ్రి చంద్రబాబు

– లోకేష్ ‘విజువల్ వార్’ను ఫాలో అవుతున్న బాబు
– టిడ్కో ఇళ్ల వద్ద సెల్ఫీ దిగి సర్కారుకు సవాల్ విసిరిన చంద్రబాబు
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఎవరైనా తండ్రులు కొడుకులకు ఆదర్శంగా నిలుస్తారు. కొడుకులు తండ్రులను ఫాలో అవుతుంటారు. వారి అనుభవాలు చూసి నేర్చుకుంటారు. కానీ ఇక్కడ పూర్తి రివర్సు వ్యవహారం. తండ్రి తన కొడుకును ఫాలో అవుతున్నారు. కొడుకు టెక్నాలజీని తండ్రి ఫాలో అవుతున్నారు. అదే ఇప్పుడు వార్త.

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు తన నెల్లూరు పర్యటనలో భాగంగా కొద్దిసేపు అందరినీ కంగారు పెట్టారు. అక్కడ ఉన్న టిడ్కో ఇళ్ల నిర్మాణాల ఆయన తన కాన్వాయ్‌ను హటాత్తుగా ఆపివేయించారు. కారణం తెలియక అటు భద్రతా సిబ్బంది, ఇటు పార్టీ నేతలు అయోమయంలో పడ్డారు.

ఈలోగా కారు లోపల ఉన్న చంద్రబాబు నాయుడు కిందకు దిగి, నింపాదిగా నడుచుకుంటూ వెళ్లి, అక్కడున్న టిడ్కో ఇళ్ళతో సెల్ఫీ దిగారు. అంతే.. ఆశర్యపోవడం అక్కడివారి వంతయిది. ఆ తర్వాత చంద్రబాబు వాటిని ట్వీట్ చేశారు. అసలు ఇంత సెల్‌ఫోన్ టెక్నాలజీ చంద్రబాబు ఎప్పుడు నేర్చుకున్నారన్నది పార్టీ సీనియర్ల సందేహం. మామూలుగా అయితే సెల్ఫీ తీసుకోవడం పెద్ద విద్యేమీ కాదు. అయితే చంద్రబాబు నాయుడుకు సెల్‌ఫోన్ ఆన్-ఆఫ్ తప్ప, మిగిలిన విషయాలేమీ తెలియన్నది పార్టీ నేతలందికీ తెలుసు. అలాంటిది ఆయన సొంతంగా సెల్ఫీ తీసుకోవడమే వారిని ఆశ్చర్యపరిచింది.

ఇంతకూ విషయమేమిటంటే.. ఆయన కొడుకు- పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్, తన యువగళం పాదయాత్రలో.. టీడీపీ ప్రభుత్వం నిర్మించిన, ఏర్పాటుచేసిన భవనాలు-పథకాలకు సంబంధించిన ప్రాంతాల్లో నిలబడి సెల్ఫీలు తీసుకుంటున్నారు. అదే సమయంలో జగన్ సర్కారు వైఫల్యాలను ఎండగట్టేందుకు ఆ సెల్ఫీలను రుజువుగా వాడుతున్నారు.

ఇటీవల తమ హయాంలో వచ్చిన కియా పరిశ్రమ ఫొటోతో పాటు-గతంలో అదే కియా పరిశ్రమను, తాము అధికారంలోకి వస్తే వెనక్కి పంపించేస్తామన్న జగన్ వీడియోను కలిపి ట్వీట్ చేసి, అందరినీ ఆకట్టుకున్నారు. లేటెస్ట్‌గా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి భూకబ్జా, ఆయన ఫాంహౌస్‌ను కూడా సెల్ఫీ తీసి, వాటి మ్యాపులు కూడా విడుదల చేసి సంచలనం సృష్టించారు.

ఈవిధంగా లోకేష్ సెల్ఫీలతో జగన్ సర్కారును దూదేకినట్లు ఏకుతున్నారు. బహుశా తన కొడుకు జగన్ సర్కారుపై చేస్తున్న ‘విజువల్ వార్’.. తండ్రి చంద్రబాబుకు ఆదర్శంగా మారిందేమో?!

LEAVE A RESPONSE