మానవ జీవన ప్రవాహం
ఆదిలో మనిషి ఒక్కడే! అతను సమాజంగా మారాడు. రాజ్యాలను సరిహద్దులుగా మార్చుకున్నాడు. తన ఉనికి కోసం సాటిమనిషితో పోరాడాడు. అధికారం కోసం మరొకరి జీవితాన్ని ఆక్రమించాడు. ఇది ఒక ప్రవాహం. మనిషి తత్త్వం. దీన్ని ఓ కథలా చెప్పాలంటే ఎంత కష్టం! దాన్ని ఓ జానపద కథలా మార్చిన ఘనత రాహుల్ సాంకృత్యాయన్‌ది. అదే ‘ఓల్గా నుంచి గంగకు’ (ఓల్గా సే గంగా తక్).
రష్యాలోని ఓల్గా నదీతీరంలో ఈ కథ మొదలవుతుంది. అప్పటి మాతృస్వామ్యానికి ప్రతీకగా ‘నిశ’ అందులో నాయకురాలు. క్రమంగా వారి జీవనం పితృస్వామ్యానికి మారుతుంది. ఆయుధాలకు, సంపదకు ప్రాధాన్యం పెరుగుతుంది. మెరుగైన జీవనం కోసం వలస మొదలవుతుంది. ఒకవైపు మనిషి తనకు కావాల్సినవి అమర్చుకున్నట్టు అనిపిస్తాడు. కానీ స్వేచ్ఛ నుంచి బానిసత్వంలోకి, ఐక్యత నుంచి అణచివేతలోకి జారిపోతుంటాడు. క్రీస్తు పూర్వం ఆరువేల సంవత్సరంలో మొదలయ్యే పుస్తకం, చివరికి వచ్చేసరికి మన దేశంలోని గంగానదీ తీరంలో ముగుస్తుంది. 20 కథలుగా విభజించిన ఈ పుస్తకంలో ప్రతి కథా ఆయా కాలాలకు, అప్పటి జీవనానికీ ప్రతీక. మన దేశ చరిత్రలో ఒక్కో మజిలీకి సూచన. అది ఆర్యులు, అనార్యుల మధ్య పోరు కావచ్చు, వివిధ మతాల స్థాపన కావచ్చు, స్వాతంత్య్ర ఉద్యమం కావచ్చు.
ఈ కథల్లో మనకు విప్లవకారులు కనిపిస్తారు, సాహితీవేత్తలు పలకరిస్తారు, కుతంత్రాలు భయపెడతాయి, సంస్కరణలు ఆశ కలిగిస్తాయి. ఇది మొత్తంగా మానవ సమాజపు.. ముఖ్యంగా భారతీయుల అనాది జీవనానికి ప్రతీక. రాహుల్ తప్ప మరొకరు ఈ పుస్తకాన్ని రాయలేరేమో! ధార్మిక కుటుంబంలో పుట్టి, ఆర్య సమాజ భావనల్లో పెరిగి, బౌద్ధం వైపు ఆకర్షితుడై మార్క్సిస్ట్‌గా కన్నుమూసిన రాహుల్.. కేవలం ఆయా సిద్ధాంతాలను మాత్రమే అధ్యయనం చేయలేదు. విస్తృతంగా పర్యటించిన లోకసంచారి తను. అందుకే ఎన్నో భాషలు, వాటి యాసలతో సహా ఆయనకు కరతలామలకం. స్వాతంత్య్ర సంగ్రామంలో భాగంగా హజారీబాగ్ జైల్లో ఉన్నప్పుడు ఈ ఓల్గా నుంచి గంగకు పుస్తకాన్ని రాశారు. అచిరకాలంలోనే తెలుగులోకి అనువాదమైంది. ప్రముఖ స్వాతంత్య్రయోధుడు అల్లూరి సత్యనారాయణరాజు దీన్ని జైల్లో ఉండగానే తెలుగులోకి అనువదించారు. ఆధునిక హిందీ సాహిత్యంలోనే అత్యుత్తమ రచనగా చాలామంది ఈ పుస్తకాన్ని గుర్తిస్తారు.
కేసీఆర్‌కు నచ్చిన పద్యం
అటజని కాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరజ్ఝరీ
పటల ముహుర్ముహుర్ లుఠ దభంగ తరంగ మృదంగ నిస్వన
స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్
గటక చరత్కరేణు కర కంపిత సాలము శీతశైలమున్