– నిబంధనలకు విరుద్ధంగా వ్యర్ధాల విసర్జన
– తొలిసారి నోటీసుపై కార్మిక సంఘాల్లో చర్చ
– ‘సూర్య’ ఎఫెక్ట్
– క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సిఐటియు డిమాండ్
అమరావతి: ఉమ్మడి విశాఖజిల్లా కేంద్రంగా ఫార్మా రంగాన్ని శాసిస్తున్న రాంకీ యాజమాన్యానికి నోటీసు ఇచ్చేందుకు పీసీబీ ఎట్టకేలకు ధైర్యం చేసింది. ఇటీవల ‘సూర్య’ కథనంతో కలకలం రేపిన పరవాడ జవహర్లాల్ నెహ్రు ఫార్మాసిటీ డెవలపర్‌గా వ్యవహరిస్తున్న, విశాఖ ఫార్మాసిటీ లిమిటెడ్ నిబంధనల ఉల్లంఘనపై పొల్యూషన్ కంట్రోల్‌బోర్డు అధికారులు ఎట్టకేలకు నోటీసు ఇచ్చే ధైర్యం చేశారు. అయితే రాంకీకి నోటీసులిచ్చిన వైనం కార్మికసంఘాల్లో ఆసక్తిరేపింది.
రాంకీ సంస్ధ తనకు ఉత్తరాంధ్ర, ఉమ్మడి గోదావరి జిల్లాల నుంచి వచ్చే ఘనవ్యర్ధాలను రాంకీ సంస్థ ప్రాసెస్ చేసి, తాడికొండపై ఉన్న ల్యాండ్‌ఫిల్‌కు తరలిస్తుంది. అయితే అక్కడ ఉన్న ల్యాండ్‌ఫిల్ పూర్తిగా నిండిపోయింది. దానితో రాంకీ సంస్ధ, సమీపంలో ఉన్న కోస్టల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ (సిడబ్ల్యుఎంపి) షెడ్లకు వెనక ప్రదేశంలో, నిబంధనలకు విరుద్ధంగా వందల టన్నుల ఘన వ్యర్ధాలను నిల్వచేసింది.
దీనితో స్థానికులు, కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేయడంతో అసలు కథ బయటకు వచ్చింది. దీనివల్ల భూమి, నీరు, గాలి కలుషితమయి.. పరిసర ప్రాంతాల్లోని తాము అనారోగ్యానికి గురవుతున్నామంటూ స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనితో స్థానికులు, కార్మికుల సంఘాల ఆవేదనను ‘సూర్య’ ఫొటోలతో సహా పలు కథనాలను వెలువరించింది. పీసీబీ అధికారుల మొద్దు నిద్రను, లాలూచీని ప్రశ్నించింది.
అటు కార్మికులు-ప్రజల పక్షాన పోరాడే సిఐటియు సైతం రంగంలోకి దిగి.. రాంకీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఇన్ని దశాబ్దాల చరిత్రలో.. రాంకీ సంస్ధకు ఒక్కసారి కూడా నోటీసు ఇవ్వకపోవడం ఏమిటని నిలదీసింది. దీనితో స్పందించడం అనివార్యమైన పీసీబీ.. తనిఖీలకు వెళ్లి, రాంకీకి నోటీసులు జారీ చేసింది. ‘ఇక్కడి పరిస్థితిపై తనిఖీలు చేశాం. నిబంధనలు ఉల్లంఘించిన రాంకీకి నోటీసులు జారీ చేశామ’ని పీసీబీ ఈఈ ముకుందరావు మీడియాకు వెల్లడించారు.
అయితే రాంకీ ఇలాంటి నిబంధనలను దశాబ్దాలుగా నిర్నిరోధంగా ఉల్లంఘిస్తున్నా, పీసీబీ అధికారులు కనీసం నోటీసులు కూడా ఎందుకివ్వలేదు? సహజంగా ఇలాంటి నిబంధనలు ఉల్లఘించే కంపెనీలను పీసీబీ సీజ్ చేస్తుంది. గత జనవరిలో అనకాపల్లికి చెందిన ఓ కంపెనీ తన రసాయన వ్యర్ధాలను కృష్ణాజిల్లా గన్నవరం సరిహద్దులోని జక్కంపూడిలో, ఒక కంపెనీ ట్యాంకర్ల ద్వారా 15 ఎకరాల్లో కుమ్మరించింది.
దానితో రైతులకు తీరని నష్టం జరగడంతోపాటు, నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆ రెండు కంపెనీలను సీజ్ చేసింది. ఈ చర్యపై ముక్కుసూటిగా వ్యవహరించే పీసీబీ చైర్మన్ కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. దానితో తానే రంగంలోకి దిగి, ఆ ప్రాంతాన్ని పరిశీలించి, దానికి కారణమైన రెండు కంపెనీలను సీజ్ చేయించారు.
అయితే ప్రస్తుతం ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే మధ్యవర్తిగా రంగంలోకి దిగి, రైతులకు జరిగిన నష్టాన్ని తక్కువ చూపించి, ఆ మేరకు అక్కడ నష్టనివారణ చర్యలు చేపట్టడం ద్వారా.. తిరిగి సీజ్ చేసిన అనకాపల్లి కంపెనీని మళ్లీ ప్రారంభించేందుకు ఒక హోటల్ వేదికగా తెరవెనక రాయ‘బేరాలు’ మొదలయినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో పీసీబీకి చెందిన అధికారుల పాత్ర కూడా ఉన్నట్లు చెబుతున్నారు.
అసలు ఆ 15 ఎకరాల విస్తీర్ణంలో డంప్‌చేసిన వ్యర్థాలతో రైతుల పొలాలకు జరిగిన నష్టం ఎంత? దాన్ని పూడ్చేందుకు ఏ కంపెనీ టన్నుకు ఎంత కోట్ చేసింది? అసలు నష్టం 7 వేల టన్నులకు జరిగితే, దానిని కేవలం 500 టన్నులకు చూపించేందుకు చె ప్పబోతున్న కథ తర్వాత!
అయితే ఇంచుమించు అదే తరహాలో వేల టన్నుల్లో అలాంటి ఉల్లంఘనలకు పాల్పడుతున్న రాంకీకి కేవలం నోటీసులిచ్చి, క్రిమినల్ చర్యలు తీసుకోకపోవడం ఏమిటని సిఐటియు అనకాపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ ప్రశ్నించారు.
రాంకీకి నోటీసులు సరే.. క్రిమినల్ చర్యలేవీ?
– సి ఈటిపీలో ఫార్మా ఘన వ్యర్ధపదార్థాలను నిలవ చేయడం నిబంధనలకు విరుద్ధం
– రాంకీకి కూటమి పెద్దల భజన
– కాలుష్యం కోరల్లో పరవాడ, భరణికం, తానం గ్రామాలు
– రాంకీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి
– లేకపోతే ఆ మూడుగ్రామాల ప్రజలతో ముట్టడి
– సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గని శెట్టి
పరవాడ: రాంకీ యాజమాన్యం బరితెగించి సి ఈటిపీలో ఫార్మా ఘన వ్యర్ధపదార్థాలను నిలవ చేయడం నిబంధనలకు విరుద్ధం. దీనిపై వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గని శెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు.
ల్యాండ్ ఫిల్ నిండిపోతే అక్రమంగా సీ ఈటిపీలోనే వేలాది టన్నులు వ్యర్థ పదార్థాలను నిలవంచటం వలన సమీపంలో ఉన్న గ్రామాలు పరవాడ, తానం గ్రామాలు మరింత కాలుష్యాన్ని గురవుతాయని పరవాడ మండలం తానం గ్రామంలో రైతులతో శనివారంజరిగిన సమావేశంలో గని శెట్టి ఆవేదన వ్యక్తం చేశారు.
రాంకీ యాజమాన్యం ఇప్పటికే సమీపంలో ఉన్న చెరువులు వర చెరువు, పెద్ద చెరువు, సన్యాసి చెరువు, మొల్లోడు గడ్డల్లోకి వ్యర్థ రసానికి జలాలను విడుదల చేస్తుందని, కూటమి నేతలు కళ్ళప్పగించుకుని చూస్తున్నారని అన్నారు.
అత్యంత ప్రమాదకరమైన ఘన వ్యర్ధాలను ల్యాండ్ ఫీల్డ్ లో మాత్రమే నిలవంచవలసింది పోయి.. గతంలో ల్యాండ్ ఫీల్డ్ కోసం కేటాయించిన స్థలం ల్యాండ్ ఫీల్డ్ పనికిరాదని ప్రభుత్వం నుండి అనుమతులు నిరాకరిస్తే, అదే స్థలంలో ఈ కాలంలో రాంకీ యాజమాన్యం అక్రమంగా ఘన వ్యర్ధాలను నిల్వ ఉంచేప్రక్రియ చేపట్టడం దుర్మార్గమని గని శెట్టి అన్నారు.
రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు రాంకీ యాజమాన్యానికి నోటీసు ఇచ్చారని, కానీ పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న రాంకీ యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని గని శెట్టి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు రాంకీ యాజమాన్యానికి భజన చేస్తున్నారని, కనీసం కాలుష్యాన్ని కారణమైన రాంకీ యాజమాన్యంపై మాట్లాడడం లేదని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రాంకీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని గని శెట్టి డిమాండ్ చేశారు.
లేనిపక్షంలో భరిణికం, పరవాడ, తానం ప్రజలతో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని గని శెట్టి హెచ్చరించారు. ఈ సమావేశంలో వర్రీ సన్యాసిరావు, కన్నా నాయుడు తదితరులు పాల్గొన్నారు