మోడీ మా గ్రామాలకు పంపించే నిధులు మాకు చేరడం లేదు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సైంధవుడిలా అడ్డుపడి దిగమింగి వేస్తున్నారు
మోడీ గారు మరియు అమిత్ షా గారు జోక్యం చేసుకొని మా నిధులు మాకు ఇప్పించాలి.
….. ప్రధాని మోడీ గారికి రాజేంద్రప్రసాద్ లక్ష్మీ ల విజ్ఞప్తి.
ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి రాజేంద్ర ప్రసాద్ గారు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షులు వానపల్లి లక్ష్మీ ముత్యాల రావు , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాపరెడ్డిల నాయకత్వంలో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన సర్పంచులు న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఈరోజు ఉదయం 10 గంటల నుండి ధర్నా నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా వై.వి.బి. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పంపినటువంటి నిధులు రాష్ట్ర ప్రభుత్వం , ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మా గ్రామ ప్రజలకు, సర్పంచులకు నిధులు అందకుండా సైంధవుడిలా అడ్డుపడి దిగమింగి వేస్తున్నాడు.
కావున ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 12,918 గ్రామ సర్పంచుల తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరియు కేంద్ర హోంశాఖ మాత్యులు అమిత్ షా గారు వెంటనే జోక్యం చేసుకొని మా గ్రామ ప్రజల మనోభావాలను గౌరవించి మా గ్రామాల అభివృద్ధి కోసం మా గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం మా సర్పంచుల యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే విధంగా మా నిధులను అధికారాలను మాకు వెంటనే తిరిగి సర్పంచుల ఖాతాలో జమ చేపిచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వంపై మేము ఇచ్చినటువంటి ఫిర్యాదులను పరిష్కరించాలని ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేయడమైనది.
ఈ సర్పంచుల ధర్నా కార్యక్రమానికి లోక్సభ సభ్యులు రఘురామ కృష్ణంరాజు గారు, రాజ్యసభ సభ్యులు కనకమెడల రవీంద్ర కుమార్ గారు పాల్గొని వారు ప్రసంగిస్తూ సర్పంచుల సమస్యలు వారి వ్యక్తిగతమైనవి కావనీ వారు ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న మూడు కోట్ల 50 లక్షల మంది గ్రామీణ ప్రజల తరఫున పోరాడుతున్నారని సర్పంచులకు వారి ఉద్యమాలకు అండదండలుగా ఉంటామని, గ్రామాల, గ్రామీణ ప్రజల సర్పంచుల సమస్యల గురించి రాజ్యసభలోను లోక్సభలో ప్రస్తావించి ప్రధానమంత్రి మోడీ గారి దృష్టికి హోంమినిస్టర్ అమిత్ షా గారి దృష్టికి అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లి పార్లమెంట్ లో ప్రస్తావించి సర్పంచులకు ,ఆంధ్రాలో ఉన్న గ్రామీణ ప్రజలకు న్యాయం జరిగే విధంగా కృషి చేస్తామని కనకమెడల రవీంద్ర కుమార్ గారు మరియు రఘురామ కృష్ణంరాజుగారు హామీ ఇవ్వడం జరిగింది.
వానపల్లి లక్ష్మి ముత్యాల రావు మాట్లాడుతూ మా ఆంధ్రప్రదేశ్ లోని 12,918 గ్రామపంచాయతీల్లో దొంగలు పడ్డారని గౌరవ శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దీనిపై విచారణ జరిపి మా పంచాయతీ నిధులు మాకు ఇప్పించాలని, అదేవిధంగా రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన మా సర్పంచ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ, మా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వాలంటీర్లను , సచివాలయ కన్వీనర్లను నియమించిందని, అలాగే మా సర్పంచుల న్యాయబద్ధమైన 16 డిమాండ్లు తమరు పరిష్కరించాలని అన్నారు.
“ఈ 16 డిమాండ్లు – సర్పంచ్ ల సమస్యలు కావు – ఇవి గ్రామాల ప్రజల సమస్యలు”
1) రాష్ట్రంలోని 12,918 గ్రామపంచాయతీలలోని 3.50 కోట్ల గ్రామీణ ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం పంపిన 14వ ఆర్థిక సంఘం నిధులు 2018 – 19 సంవత్సరానికి రూ,, 1729.23 కోట్లు, 2019 – 20 సంవత్సరానికి రూ,, 2336.56 కోట్లు, మరియు 15వ ఆర్థిక సంఘం నిధులు 2020 – 21 సంవత్సరానికి రూ,, 2625 కోట్లు, 2021-22 సంవత్సరానికి రూ,, 1939 కోట్లు మొత్తం కలిపి రూ,, 8629.79 కోట్ల రూపాయలను గ్రామపంచాయతీలు ఇవ్వకుండా, చెక్కుల మీద సర్పంచులు సంతకాలు లేకుండా,సర్పంచులకు చెప్పకుండా గ్రామపంచాయతీల సి.ఎఫ్.ఎం.ఎస్ అకౌంట్లో నుంచి మా నిధులను రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించి తన సొంత అవసరాలకు, పథకాలకు దారి మళ్లించి వాడి వేసుకున్నది. ఇది అన్యాయం, అక్రమం, రాజ్యాంగ వ్యతిరేకం, ఇది రాష్ట్ర ప్రభుత్వం సర్పంచులకు వెన్నుపోటు పొడిచినట్లే కనుక ఆ రూ,, 8629.79 కోట్ల రూపాయలను తక్షణమే తిరిగి మా గ్రామపంచాయతీలకు జమ చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయుచున్నాము.
2) అలాగే 2022-23 సంవత్సరానికి రూ,, 2010 కోట్లు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023 – 24 కు రావలసిన రూ,, 2031 కోట్ల రూపాయల కేంద్ర ఆర్థిక సంఘం నిధులు మొత్తం రూ,, 4041 కోట్ల రూపాయల నిధులు కూడా ఇంతవరకు మా పంచాయతీలకు ఇవ్వకపోవడం సిగ్గుచేటు, తక్షణమే ఆ రూ,, 4041 కోట్ల నిధులను కూడా విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయుచున్నాము.
3) గ్రామ వాలంటీర్లను,గ్రామ సచివాలయాలను 73,74 వ రాజ్యాంగ సవరణ చట్టంలోని ఆర్టికల్ 243 జి, 11వ షెడ్యూల్లో పేర్కొన్న ప్రకారం గ్రామపంచాయతీలలో విలీనం చేసి, సర్పంచుల ఆధ్వర్యంలోనే అన్ని రకాల అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయుచున్నాము. అలాగే చట్ట వ్యతిరేకంగా, రాజ్యాంగేతర శక్తులుగా ఏర్పాటు చేసిన వైయస్సార్సీపి పార్టీ నాయకులైన గృహసారథులను, సచివాలయ కన్వీనర్ల వ్యవస్థను తక్షణమే రద్దు చేయవలసినదిగా డిమాండ్ చేయుచున్నాము.
4) కేవలం రూ,, 3 వేలుగా ఉన్న మా సర్పంచుల, ఎంపీటీసీల గౌరవ వేతనాలను రూ,, 15 వేలకు, ఎంపీపీ, జడ్పిటిసి లకు రూ,, 30 వేల రూపాయలకు పెంచి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము.
5) జాతీయ ఉపాధి హామీ చట్టం 2006 ప్రకారం కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం గతంలో మాదిరే నరేగా నిధులను మా గ్రామపంచాయతీలకే ఇచ్చి, పంచాయతీల గ్రామసభల తీర్మానం ప్రకారమే సర్పంచ్ల ఆధ్వర్యంలోనే పనులను కూడా చేయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయుచున్నాము. 2019 వరకు ఈ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో మా పంచాయతీలే అభివృద్ధి కార్యక్రమాలు చేసేవి. కానీ 2019 నుంచి 2023 వ సంవత్సరం వరకు ఈ నాలుగు సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సుమారు రూ,, 35 వేల కోట్లను దారి మళ్లించి తన సొంత పథకాలకు అవసరాలకు రాష్ట్ర ప్రభుత్వం వాడి వేసుకున్నది. మా పంచాయతీలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.ఇది అత్యంత దారుణం.
6) కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన “ఇంటింటికి త్రాగునీటి కొళాయి పథకం” అయిన “జల్ జీవన్ మిషన్” కు రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు కేటాయించి వెంటనే ఆ పథకం పనులు అన్ని గ్రామాల్లో ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయుచున్నాము.
7) రాష్ట్రంలోని మైనర్ గ్రామపంచాయతీలకు గతంలో ముఖ్యమంత్రి శ్రీ ఎన్టీఆర్ గారు, శ్రీ వైయస్సార్ గారు, శ్రీ చంద్రబాబు గారు ఇచ్చిన విధంగానే ఉచిత విద్యుత్తును శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. విద్యుత్ బిల్లుల పేరుతో అడ్డగోలుగా మా గ్రామపంచాయతీల్ని దోచి వేయకూడదని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయుచున్నాము.
8) మైనింగ్ సెస్, ఇసుకలో వాటా నిధులు, రిజిస్ట్రేషన్ ఫీజు, ప్రొఫెషనల్ టాక్స్, ఎంటర్టైన్మెంట్ టాక్స్, నీటి తీరువా నిధులు, తలసరి గ్రాంట్, గ్రామీణ రోడ్ల నిర్వహణకు ఇచ్చే నిధులు 2019 వరకు మా గ్రామ పంచాయతీలకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చాయి. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఇవ్వడం లేదు. కనుక 2019 నుంచి 2023 వరకు నాలుగు సంవత్సరములు ఎగ్గొట్టిన ఆ నిధులు సుమారు రూ,, 4 వేల కోట్ల రూపాయలను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేయుచున్నాము.
9) మా గ్రామ పంచాయతీల సొంత నిధులు నుంచి మరియు ఆర్థిక సంఘం నిధుల నుంచి విద్యుత్ బకాయిలు వసూలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మెమో నెం. పి ఆర్ ఆర్ 02 – 21023 తేదీ 28 – 5 – 2022 ను వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయుచున్నాము.
10) గ్రామాల అభివృద్ధి కోసం నిధులు వినియోగించకుండా మా గ్రామ పంచాయతీల సొంత నిధులపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన “ఫ్రీజింగ్” ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్ చేయుచున్నాము.
11) 5 వ రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని వెంటనే ఏర్పాటు చేసి దాన్ని సిఫార్సుల మేరకు మా గ్రామ పంచాయతీలకు తక్షణమే నిధులు విడుదల చేయాలని మరియు 2019 నుంచి 2023 వరకు నాలుగు సంవత్సరముల పాటు రాష్ట్ర ప్రభుత్వం మా గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సిన రాష్ట్ర ఆర్థిక సంఘం బకాయి నిధులు సుమారు నాలుగువేల కోట్లను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయుచున్నాము.
12) ఎమ్మెల్యేలకు ఒక్కో సచివాలయాల ప్రాంత అభివృద్ధికి కేటాయిస్తున్న 20 లక్షల నిధులను మా పంచాయతీలకే ఇచ్చి పంచాయతీల తీర్మానం మేరకే పనులు చేయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయుచున్నాము.
13) క్లాత్ మిత్రులకు గతంలో మాదిరే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేయుచున్నాము.
14) కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కేంద్ర ఆర్థిక సంఘం నిధులను, మరియు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన అన్ని రకాల నిధులను బకాయిలతో సహా మా సర్పంచులు ఇప్పటికే కేంద్ర జాతీయ బ్యాంకులలో తెరిచిన పి.ఎఫ్.ఎం.ఎస్ ఖాతాలలో వెంటనే జమ చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము.
15) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహించే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు మొదలగు అన్ని కార్యక్రమాలలోనూ గ్రామ ప్రథమ పౌరులైన సర్పంచులనే సభాధ్యక్షులుగా ఉంచాలని, పాత జీవోల ప్రకారం, ఆహ్వాన పత్రికలలోనూ, శిలాఫలకం మీద, బ్యానర్ మీద కూడా సర్పంచుల పేర్లు, ఫోటోలు కూడా వేసి ఖచ్చితంగా “ప్రోటోకాల్” పాటించే విధంగా స్పష్టమైన ఆదేశాలను మరొకసారి అన్ని ప్రభుత్వ శాఖల అధికారులకు ఇస్తూ కొత్త జీవోలను విడుదల చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము.
16) మహాత్మా గాంధీ కలలుగన్న “గ్రామ స్వరాజ్య” సాధన కోసం 73,,74 వ రాజ్యాంగ సవరణ చట్టాలలో పేర్కొన్న ఆర్టికల్ 243 జి, 11వ షెడ్యూల్లో పేర్కొన్న 29 ప్రభుత్వ శాఖలకు చెందిన సిబ్బందిని, నిధులను, అభివృద్ధి – సంక్షేమ కార్యక్రమాల నిర్వహణను ఆయా స్థాయిలలో మా గ్రామ పంచాయతీలకు, మండల పరిషత్తులకు, జిల్లా పరిషత్తులకు తక్షణమే బదిలీ చేయాలని, ఈ విషయంలో పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కేరళ రాష్ట్రాలను ఆదర్శంగా తీసుకొని పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మా ఆంధ్రప్రదేశ్ సర్పంచ్ల సంఘం, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్లు డిమాండ్ చేయుచున్నవి.
పైన పేర్కొన్న మా ఈ 16 డిమాండ్లు – సమస్యలు మా సర్పంచ్లవి కాదు. రాష్ట్రంలోని 12,918 గ్రామపంచాయతీలలో నివసిస్తున్న 3 కోట్ల 50 లక్షల మంది గ్రామీణ ప్రజలవి ఈ రిమాండ్లు మావి కాదు మా గ్రామాల ప్రజలవని స్పష్టం చేస్తున్నామని రాజేంద్రప్రసాద్ అన్నారు