-పరాకాష్టకు చేరిన సిఐడి పోలీసుల శాడిజం
-అరబిందో గ్యాంగ్, పోర్ట్, ఎస్ ఈ జెడ్ లలో పెట్టుబడులపై విచారణ జరిపించాలి
ఎంపీ రఘురామకృష్ణంరాజు
ఇప్పుడే ఆట మొదలైందని… ఇక నుంచి మీ పప్పులు ఉడకవు అంటూ ప్రభుత్వ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్దలను నర్సాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు హెచ్చరించారు. గత 15 రోజుల క్రితం ప్రధానమంత్రి కి తాను ఒక లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో సిఐడి పోలీసులు చేస్తోన్న అరాచకాలను ప్రధానమంత్రి దృష్టికి తాను తీసుకు వెళ్లినట్లు వివరించారు. 12 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులను కాదని రాజేంద్రనాథ్ రెడ్డికి డిజిపి పదవి కట్టబెట్టారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయి. సిఐడి పోలీసులు ముఖ్యమంత్రి తొత్తులుగా మారారు. న్యాయస్థానాలు తప్పని చెబుతున్నా కూడా సిఐడి పోలీసులు పట్టించుకోవడం లేదు. అక్రమ కేసులను బనాయిస్తున్నారని తాను ప్రధానమంత్రికి రాసిన లేఖలో వివరించినట్లు వెల్లడించారు.
ప్రధానమంత్రి కార్యాలయం స్పందించిందని, త్వరలోనే వారి పాపం పండనుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. గురువారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామ కృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… ప్రధాని రాష్ట్ర పర్యటనకు 48 గంటల ముందే పినాక శరత్ చంద్రారెడ్డిని అరెస్టు చేయడం ద్వారా అది అదే… ఇది ఇదేనని చెప్పకనే చెప్పినట్లు అయిందన్నారు.
శిశుపాలుడు తల్లికి ఇచ్చిన వరం మేరకు శ్రీకృష్ణ భగవానుడు ఆయన చేసిన వంద తప్పులను క్షమించారన్నారు. రాష్ట్రంలో ఎవరికో వరం ఇచ్చారని అనను కానీ పోలీసుల దుందుడుకు చర్యలు అర్థం కావడం లేదన్నారు. ఉండవల్లి అనూషను అనంతపురం లో సిఐడి పోలీసుల ముందు హాజరుకావాలని ఆదేశించినట్లు తెలిసిందన్నారు. కాట సుబ్బారావును కూడా అలాగే అనంతపురం సిఐడి పోలీసుల ముందు హాజరుకావాలని ఆదేశించడం జరిగిందన్నారు. అనంతపురం కాన్సెప్ట్ ఏమిటో అర్థం కావడం లేదన్న ఆయన, అనంతపురం వాసులని శ్రీకాకుళం సిఐడి పోలీసుల ముందు హాజరు కావాలంటూ ఆదేశిస్తున్నారని తెలిపారు. సిఐడి పోలీసుల శాడిజం పరాకాష్టకు చేరుకుందని రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు.
రాష్ట్రంలో అరబిందో గ్యాంగ్ పెట్టుబడులపై విచారణ జరిపించాలి
కాకినాడ పోర్ట్, ఎస్ ఈ జడ్ లలో అరబిందో గ్యాంగ్ పెట్టుబడులపై విచారణ జరిపించాలని రఘురామకృష్ణం రాజు కోరారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో 60 నుంచి 70 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను పినాక సోదరులు పెట్టుబడుల రూపంలో పెట్టారన్నారు. వారి కుటుంబానిది అన్ని జాయింట్ వ్యాపారాలేనని గుర్తు చేశారు. విశాఖపట్నం లో పెద్ద మొత్తంలో భూములు కొనుగోలు చేశారని తెలిపారు. ఈ పెట్టుబడులను పరిశీలించి, పరిశోధించాలని ప్రధానమంత్రి కి ఒక లేఖ రాయనున్నట్లు రఘురామకృష్ణంరాజు తెలిపారు. శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ కాకుండా, విజయసాయిరెడ్డి ఎంతో ప్రయత్నించారన్నారని కానీ కుదరలేదన్నారు. అయినా, ప్రధాని రాష్ట్ర పర్యటన సందర్భంగా నిర్వహించనున్న సభా ఏర్పాట్లన్నీ తానై పర్యవేక్షిస్తున్నట్లుగా హడావుడి చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
వేల కోట్ల మద్యం వ్యాపారం నిర్వహిస్తోన్న అడాన్
రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల మద్యం వ్యాపారాన్ని అడాన్ డిస్టలరీ కంపెనీ నిర్వహిస్తోందని రఘురామకృష్ణంరాజు తెలిపారు. అడాన్ డిస్టలరీ కంపెనీ కార్యాలయం, అరబిందో ఫార్మా కార్యాలయం బిల్డింగులోనే ఉందని పేర్కొన్నారు. లక్ష రూపాయల స్వల్ప పెట్టుబడి తో ప్రారంభించిన అడాన్ డిస్టలరీ, అప్పటికే రాష్ట్రంలో ఉన్న అన్ని డిస్టలరీలను లీజు కు తీసుకుని, ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎం డీ వాసుదేవ రెడ్డి సహకారంతో గత రెండున్నర ఏళ్లలో వేల కోట్ల రూపాయల మద్యం వ్యాపారాన్ని నిర్వహిస్తోందన్నారు . మద్యం వ్యాపారమే కాకుండా, కాకినాడ పోర్ట్, ఎస్ ఈ జడ్ లలో సింహభాగం వాటాను పినాక కుటుంబానికి చెందిన అరబిందో రియాల్టీ కొనుగోలు చేసిందని తెలిపారు. తమ పార్టీ, ప్రభుత్వం, అక్రమాస్తుల కేసులలో A2 గా అభియోగాలను ఎదుర్కొంటున్న విజయ్ సాయి రెడ్డి కుమార్తె భర్త రోహిత్ రెడ్డి సోదరుడే పినాక శరత్ చంద్రారెడ్డి అని పేర్కొన్నారు. వీరికి రాష్ట్రంలో అంబులెన్స్ సర్వీసుల నిర్వహణ, రామాయపట్నం పోర్ట్ నిర్మాణ బాధ్యతలు, పంపుడ్ హైడ్రో ప్రాజెక్టులను కట్టబెట్టడం జరిగిందన్నారు.
మనుషులను బతికించే మందుల కన్నా, ప్రజల ఆరోగ్యాన్ని హరించే మందు వ్యాపారమే మంచిదని… ధనార్జనే లక్ష్యంగా రాష్ట్రంలో వారు మద్యం వ్యాపారం నిర్వహిస్తున్నారన్నారు. తమ ధనార్జన లక్ష్యం వెనుక వారే ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారా?? అన్నది తేలాల్సి ఉందన్నారు. అది తేలే వరకు వీరే ఉన్నారని అనుకుందామన్న రఘురామకృష్ణంరాజు, ఢిల్లీలో ఇచ్చినట్లుగానే, రాష్ట్రంలో కూడా చాలామంది పేర్లతో బ్యాంకు గ్యారంటీ ఇచ్చారన్నారు. ఢిల్లీలో జరిగిన మద్యం కుంభకోణంలో శరత్ చంద్రారెడ్డి ప్రమేయం గురించి గత 45 రోజులుగా సిబిఐ పోలీసులు ఆయనను పిలిపించి మాట్లాడినట్లుగా తెలిసిందన్నారు. గురువారం ఉదయం హఠాత్తుగా అరెస్టు చేశారన్నారు. ఢిల్లీలో పినాక శరత్ చంద్రారెడ్డి ఆయన కుటుంబ సభ్యులు నిర్వహించనున్న లిక్కర్ వ్యాపారం వెనుక ఎవరైనా ఉన్నారా అన్నది రాబోయే రోజుల్లో తెలుస్తుందన్నారు. పినాకా శరత్ చంద్రారెడ్డి పై కేసులు నమోదు చేసిన ఈ డీ, సీబీఐ లు, రాష్ట్రం లో పోర్టు లు, ఎస్ ఈ జడ్ లలో పెట్టిన పెట్టుబడులపై కూడా విచారణ జరిపించాలని కోరారు.
జగన్ తో క్విడ్ ప్రోకో సంబంధం
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో గతంలో అరబిందో సంస్థ కు క్విడ్ ప్రోకో సంబంధం ఉందని రఘురామకృష్ణం రాజు తెలిపారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో అరబిందో గ్యాంగ్ ఎన్నో వ్యాపారాలను ప్రారంభించిందని పేర్కొన్నారు. విశాఖను వారు తమ అడ్డాగా భావిస్తున్నారన్నారు. అరబిందో రియాల్టీ లో పినాక సోదరులు ఇద్దరు భాగస్వాములేనని వివరించారు. అరబిందో ఫార్మా లిస్టెడ్ కంపెనీ అని, అరబిందో రియాలిటీ లిస్టెడ్ కంపెనీ కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు, పినాక బ్రదర్స్ కు సంబంధం లేదనే అవకాశమే లేదన్నారు. ఒక దగ్గర అవకతవకలు చేసి, అవినీతి సొమ్మును ఇవ్వచూపి ఈడికి దొరికిపోయిన వారు, మరొకచోట అవకతవకలకు పాల్పడడానికి అవకాశం ఉందన్నారు. అందుకే స్వచ్ఛందంగా ఒక కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, ఆర్థిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్ ను కోరుతానని తెలిపారు. ప్రభుత్వానికి, పినాక సోదరులకు చాలా లావాదేవీలు ఉన్నాయని , అనేక కుంభకోణాలు జరిగే ఉంటాయని ప్రజలు భావించే అవకాశం ఉంది కాబట్టి విచారణ జరిపించాలని కోరుతానన్నారు.
ఇల్లు కూల్చి కూల్చలేదని ఫ్లెక్సీలా?
ఇప్పటం గ్రామంలో ఇళ్లను కూల్చి, కూల్చిన ఓ ఇంటి ముందే తమ ఇల్లును కూల్చలేదని ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం విడ్డూరంగా ఉందని రఘురామకృష్ణంరాజు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.ఈ ఫ్లెక్సీ ఏర్పాటు అనంతరం ఓ అభ్యుదయ కవి రాసి పంపిన కవితను ఆయన ఈ సందర్భంగా మీడియా ప్రతినిధుల ముందు చదివి వినిపించారు. రాష్ట్ర పర్యటనకు విచ్చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, నిజా నిజాలను తెలుసుకొని దోషులను శిక్షిస్తే మంచిదని కోరారు. సాక్షి దినపత్రికలో డామిట్ కథ అడ్డం తిరిగింది అన్న కథనంపై రఘురామకృష్ణంరాజు ఫైర్ అయ్యారు. ఇటీవల చంద్రబాబు నాయుడు పర్యటనలో జరిగిన రాళ్ల దాడిలో, రాయిని ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. రాయిని ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించడం… హైదరాబాదుకు వెళ్ళిన తర్వాత ఫిర్యాదు చేయడమేమిటని నిలదీయడం.. గాయాన్ని చూస్తామంటే హైదరాబాదు నుంచి ఎందుకు తిరిగి రాలేదని పోలీసులు అడగడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి పై కోడి కత్తి దాడి జరిగిన తర్వాత హైదరాబాదుకు వెళ్లి ఆయన ఎందుకు చికిత్స చేయించుకున్నారని ప్రశ్నించారు. కోడి కత్తి దాడిలో ఏదో జరిగిపోయినట్టు ఎందుకని మీడియా ముందు డ్రామా ఆడారంటూ నిలదీశారు. ఇక రాష్ట్రంలో జరిగిన పోలీసు అధికారుల బదిలీలలో కూడా ఒకే సామాజిక వర్గానికి పెద్దపీట వేయడాన్ని కవర్ చేసుకునేందుకు సాక్షి దినపత్రిక ప్రయత్నించిందని మండిపడ్డారు.
యోగివేమన యూనివర్సిటీలో ఆయన విగ్రహం తొలగించడం ఏమిటి?
యోగివేమన యూనివర్సిటీలో ఆయన విగ్రహాన్ని తొలగించి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించడం పట్ల రఘురామకృష్ణంరాజు విస్మయం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి తెలిసే ఇటువంటి నిర్ణయాలను తీసుకుంటున్నారో, లేకపోతే కింది స్థాయి వారు ఆయన మెప్పుకోసం ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో అర్థం కావడం లేదన్నారు. ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పు చేశారనుకుంటే … ఇప్పుడు యోగి వేమన యూనివర్సిటీలో వేమన విగ్రహాన్ని లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వేమన కూడా వేమారెడ్డే నని, ఆయన విగ్రహం అక్కడే ఉంచితే వచ్చే నష్టం ఏమీ లేదన్నారు. పక్కనే వైఎస్ఆర్ విగ్రహం కూడా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేర్ల మార్పు అన్నది ఎక్కువయిందన్నారు. త్వరలోనే ప్రధానమంత్రిని వ్యక్తిగతంగా కలిసి రాష్ట్రంలో కొనసాగుతున్న పోలీసుల అరాచకాల పై వివరిస్తానని తెలిపారు. తమ అవినీతికి అడ్డం వస్తుందని మద్యం షాపులలో డిజిటల్ పేమెంట్ లను ప్రోత్సహించకుండా నిరుత్సాహపరుస్తూ, బస్సుల్లో సినిమా హాల్లో మాత్రం డిజిటల్ పేమెంట్ లను ప్రోత్సహిస్తున్నారని ఎద్దేవా చేశారు. పి సి బ్రౌన్ జయంతి సందర్భంగా తెలుగు భాషకు ఆయన చేసిన సేవను రఘురామ కృష్ణంరాజు కొనియాడారు.