– తండ్రి కలెక్టరుగా పనిచేసిన జిల్లాకే తొలి మహిళా కలెక్టర్‌గా పనిచేసే అవకాశం
– కలెక్టర్ల బోర్డులో తండ్రితో పాటు కూతురు పేరు నమోదైన అరుదైన ఘటన
– కృష్ణా జిల్లా నుంచి కర్నూలు వరకూ సృజన అధికార ప్రస్థానం
– కర్నూలు జిల్లా నుంచే కెరీర్‌లో కలెక్టర్ హోదా ప్రారంభం
– మాజీ ఐఏఎస్ బలరామయ్య బిడ్డ సృజనకు కలెక్టర్‌గా పనిచేసే అవకాశం
– తండ్రీ తనయలకు ‘కర్నూలు గొడుగు’
(మార్తి సుబ్రహ్మణ్యం)
ఐఏఎస్ చదివిన ప్రతి ఒక్కరికీ కలెక్టర్ కావాలన్నది తొలి కల. ఎందుక ంటే ఐఏఎస్ చదివిన వారితో పాటు, ప్రమోటీలూ కలెక్టర్ కల నెరవేరకుండానే రిటైరైన వారు బోలెడు. అదే ఐఏఎస్‌లకు చీఫ్ సెక్రటరీ కావాలన్నది జీవితకాలపు కోరిక. అది వేరే విషయం. కానీ ఒకే కుటుంబం నుంచి తండ్రి-కూతురు, ఒకే జిల్లాకు కలెక్టరయ్యే అవకాశం మాత్రం బహు అరుదు. అలాంటి సందర్భాలు కూడా తక్కువే. కలెక్టర్లుగా పనిచేసిన వారి పేర్లుండే బోర్డులో, తండ్రీ-తనయల పేర్లు ఉండే అరుదైన స్థానం బహుశా ఎవరికీ లభించి ఉండదు.
కానీ ఇప్పుడు అలాంటి అద్భుతం ఒకటి కర్నూలు జిల్లాలో ఆవిష్కృతమైంది. వైఎస్ హయాంలో కర్నూలు కలెక్టరుగా పనిచేసిన, మాజీ ఐఏఎస్ బలరామయ్య కూతురు సృజన.. ఇప్పుడు వైఎస్ తనయుడు జగన్ హయాంలో, అదే కర్నూలు జిల్లా కలెక్టర్‌గా నియమితులయ్యారు. కాకపోతే తండ్రి ఉమ్మడి కర్నూలు జిల్లా కలెక్టరుగా పనిచేస్తే, కూతురు విభజన కర్నూలు జిల్లాకు కలెక్టరమ్మయ్యారు. అంతే తేడా. మిగిలినదంతా సేమ్ టు సేమ్. ఐఏఎస్ చరిత్రలో ఇదో అరుదైన ఘటన.
పరిశ్రమల శాఖ డైరక్టర్ సృజన, కర్నూలు జిల్లా కలెక్టర్‌గా నియమితులయ్యారు. కర్నూలు జిల్లా తొలి మహిళా కలెక్టర్‌గా, ఆమె పేరిట రికార్డు నమోదయింది. దివంగత సీఎం ైవె ఎస్ రాజశేఖర్‌రెడ్డి అమితంగా ఇష్టపడి రూపొందించిన ‘ఆరోగ్యశ్రీ’ పథకాన్ని, సుజన తండ్రి బలరామయ్య అదే కర్నూలు జిల్లా కలెక్టరుగా ఉన్నప్పుడే 2008లో అక్కడి నుంచి ప్రారంభించారు. టీటీడీ సహా, అనంతపురం- కడప జిల్లాలకు జెసిగా పనిచేసిన బలరామయ్య, అందరికీ సుపరిచితులే. 2103లో సివిల్స్‌లో ర్యాంకు సాధించి.. ఐఏఎస్‌కు ఎంపికయిన ఆయన కూతురు సృజన, ఇప్పుడు అదే కర్నూలు జిల్లాకు తొలి మహిళా కలెక్టర్‌గా రావడం యాధృచ్చికమే.
సృజన భర్త రవితేజ ప్రముఖ హైకోర్టు న్యాయవాది. ఎన్నో సంచలనాత్మక కేసులు వాదించారు. సమతాపార్టీ మాజీ అధ్యక్షుడు వి.వి. కృష్ణారావు మనుమడైన రవితేజ, సమైక్యాంధ్ర ఉద్యమంలో, ఏపీ టు ఢిల్లీ బస్సు యాత్రలో కీలకపాత్ర పోషించారు. న్యాయపోరాటం చేశారు.
కృష్ణా జిల్లా సబ్ కలెక్టర్, విశాఖ జాయింట్ కలెక్టర్‌గా పనిచేసిన సృజన, అక్కడే విశాఖ మున్సిపల్ కమిషనర్‌గా పనిచేశారు. తర్వాత ఏపీఐఐసి ఇన్చార్జి, పరిశ్రమల శాఖ డైరక్టర్‌గా పనిచేస్తూ, తాజాగా కర్నూలు జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. ఆమె కెరీర్‌లో కలెక్టర్ హోదా ఇదే మొదటిది కావడం ప్రస్తావనార్హం.
ముక్కుసూటిగా పనిచేసే సృజన, వివాదరహిత అధికారిగా పేరొందారు. అయితే.. ఇప్పటి వరకూ కలెక్టర్ వంటి బాధ్యతాయుతమైన హోదాలో పనిచేయనందున, ఎటువంటి సమస్యలు ఎదురుకాకపోవచ్చు. జెసి, సబ్ కలెక్టర్‌గా పనిచేసినప్పటికీ, అందులో ఆమె అధికార పరిథి తక్కువ. విశాఖ మున్సిపల్ కమిషనర్‌గా పనిచేసినప్పటికీ, దాని పరిథి పరిమితం. అక్కడి రాజకీయాలు కూడా వేరు.
ఇప్పుడు కలెక్టర్ కావడంతో, ఆమెకు అనేక సవాళ్లు ఎదురయ్యే అవకాశాలున్నాయి. పైగా ఫ్యాక్షన్- రాజకీయ ఒత్తిళ్లు-సాగునీటి సమస్య ఎక్కువగా ఉండే కర్నూలులో పనిచేయటం కత్తిమీద సాము. ఓ మంత్రి నుంచి ఎమ్మెల్యేల వరకూ, అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇసుక, లిక్కర్ దందా మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్థిల్లుతున్న జిల్లా అది. మంత్రి బుగ్గన, కేంద్ర మాజీ మంత్రి కోట్ల వంటి హేమాహేమీలున్న జిల్లాలో రాజకీయ ఒత్తిళ్లు అధిగమించి, ఎలా పనిచేస్తారన్నదే సృజన ముందున్న సవాల్. అదే ఆమె పనితనానికి గీటురాయి.
అదీకాకుండా.. ఉమ్మడి కర్నూలు జిల్లాలో సగం మెట్ట-సగం మాగాణి ప్రాంతం ఉండేది. ఇప్పుడు ఉమ్మడి జిల్లా విడిపోవడంతో, కరవు-వలస-పేద ప్రాంతాలు కర్నూలు జిల్లాకు వచ్చాయి. ఆయకట్టు- నీటి ప్రాజెక్టులన్నీ కొత్తగా ఏర్పడ్డ నంద్యాల జిల్లాకు వెళ్లటంతో కర్నూలు జిల్లా ప్రజల పరిస్థితి మరింత ఆందోళనలో పడింది. ఈ దుర్భిక్ష పరిస్థితిని ఎలా ఎదుర్కొంటారన్నది సృజన ముందున్న మరో సవాల్.
ఇక మానవ హక్కుల కమిషన్ వంటి కీలకమైన, ప్రధాన కార్యాలయం కూడా కర్నూలులోనే ఉంది. ప్రభుత్వ వినతి మేరకు.. హైదరాబాద్ నుంచి కర్నూలుకు వచ్చిన హక్కుల కమిషన్ సిబ్బంది భోజనాలకు, ఇటీవలి కాలం వరకూ కర్నూలు జిల్లా కలెక్టరే నిధులిచ్చేవారు. దానిని పాత కలెక్టర్ నిలిపివేశారు. ఈ వ్యవహారం మీడియాకెక్కడంతో, అది వివాదాస్పదమైంది. దానిపై సృజన మళ్లీ కొత్తగా నిర్ణయం తీసుకుంటారా? లేక పాత కలెక్టర్ నిర్ణయాన్ని కొనసాగిస్తారా చూడాలి.
ఏదేమైనా చురుకైన అధికారిణిగా పేరొందిన సృజన.. జిల్లాలో రాజకీయ ఒత్తిళ్లు, సాగు-తాగు నీటి సమస్యను ఎదుర్కొని.. తొలి మహిళా కలెక్టరమ్మగా వచ్చిన అవకాశాన్ని ఎంతవరకూ సద్వినియోగం చేసుకుని, తన సమర్ధత నిరూపించుకుంటారో చూడాలి.
తండ్రి బలరామయ్య మాదిరిగా జిల్లాపై తన ముద్ర వేస్తారా? లేక సమయస్ఫూర్తి-లౌక్యం ప్రదర్శించి అందరి కలెక్టర్‌గా పేరు తెచ్చుకుంటారా? లేక అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించి, విమర్శలు కొని తెచ్చుకుంటారా? ఇవన్నీ కాకుండా ముక్కుసూటిగా పనిచేసి,పాలనలో తనదైన ముద్ర వేస్తారా అన్నది చూడాలి. ఆల్ ది బెస్ట్ సృజన!