సెక్స్ వర్కర్లు దేశంలోని సమాన పౌరులుగా గౌరవప్రదంగా జీవించడానికి సుప్రీం కోర్టు అనుమతించింది. సుప్రీం కోర్ట్ ఆదేశాలను సెక్స్ వర్కర్లు మరియు మానవ అక్రమ రవాణా భాదితుల రాష్ట్ర స్థాయి ఫోరమ్ అయిన విముక్తి స్వాగతించింది.
ఈ సందర్భంగా విముక్తి నాయకులు మాట్లాడుతూ.. కండోమ్‌లు దొరికితేనే నేరంగా పరిగణిస్తూ, పోలీసులు తమపై కేసులు నమోదు చేసిన అనుభవాలను పంచుకున్నారు. రైడింగ్ తర్వాత కనీసం ఎఫ్.ఐ.ఆర్ కూడా లేకుండా, పోలీసులు సెక్స్ వర్కర్లను నేర కోణంలో చూస్తూ దాదాపు 4-5 రోజులు పోలీసు స్టేషన్‌లలో నిర్బంధించేవారు, ఆ తర్వాత వారిని కోర్టు ముందు హాజరుపరిచి కేవలం ఒక రోజు ముందు మాత్రమే అదుపులోకి తీసుకున్నామని, ఆ తర్వాత షెల్టర్ హోమ్‌లకు పంపుతున్నామని చెప్తారు.
ఇంకో విషయమేమంటే రైడ్ చేసి వారిని అదుపులోకి తీసుకుంటుండగా, పోలీసులు వారి మొబైల్ ఫోన్లు, డబ్బు మరియు ఇతర వస్తువులను లాక్కుంటున్నారు. చాలా సందర్భాలలో పోలీసు సిబ్బంది తమ ఫోన్‌లను తిరిగి ఇవ్వడం లేదు మరియు కోర్టు దృష్టికి కూడా తీసుకురావడం లేదు. అంతేకాకుండా, కొంతమంది పోలీసు సిబ్బంది బాధితులను షెల్టర్ హోమ్‌లలో చేరే ముందు వారి పేర్లు మరియు ఇతర వివరాలను తెలియజేయడం ద్వారా వారిని లాయర్ల వద్దకు రిఫర్ చేస్తారు.ఈ విధంగా పోలీసులు సూచించిన న్యాయవాదులకు 40,000 – 50,000/-.రూ. వరకు నష్టపోయిన బాధితులు కూడా చాలా మందే ఉన్నారు.
ఇంకా దాదాపు 15 – 20 మంది బాధితులు A.P. లోని స్వధార్ మరియు ఉజ్వల హోమ్‌లలో నెలల తరబడి ఉంటున్నారు. అలాగే పోలీసులు, లాయర్లు కుమ్మక్కై రెస్క్యు కాబడ్డ బాధితుల నుంచి వారిది నేరం కానప్పటికీ బెయిల్ పేరుతో రూ. 50వేలు నుంచి 70,000 గుంజుతున్నారు. ఈ వృత్తిలో చిక్కుకున్న ట్రాఫికర్, బ్రోకర్ లేదా పింప్ అయిన వ్యక్తి బెయిల్‌పై 7 – 10 రోజులలోపు విడుదల చేయబడతారని, కాని భాదిత మహిళలు నెలల తరబడి అంటే దాదాపు ఒక నెల నుండి ఒక సంవత్సరం వరకు షెల్టర్ హోమ్స్ లో నిర్బంధంలో ఉన్నారని ఈ బాధితుల్లో ఒకరు చెప్పారు.ఇప్పుడు, సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలతో వారు ఇటువంటి హానికరమైన పరిస్థితుల నుండి ఉపశమనం పొందారు.
మరొక విషయం ఏమిటంటే, సెక్స్ వర్క్ ను ఒక వృత్తిగా చూసేందుకు విముక్తి వ్యతిరేకం. ఎందుకంటే ఇప్పటికీ సెక్స్ వర్క్ అంటే నే దోపిడీ, హింస లతో ముడిపడి ఉంది. కానీ, డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో ఏ అమ్మాయి కూడా ఇందులోకి ప్రవేశించడం లేదు. జీవితంలో మనుగడ సాగించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు దొరక్క, సామాజికoగా ఉన్న చిన్నచూపు, వివక్ష కారణంగా చాలా మంది మోసపోయి ఈ పనిని చేపడుతున్నారు. కారణం ఏమిటంటే, అక్రమ రవాణా మరియు వ్యాపార లైంగిక దోపిడీకి గురై రక్షించబడిన బాధితులకు ప్రత్యామ్నాయ జీవనోపాధిని కల్పించడంలో పూర్తిగా విఫలమైన ప్రభుత్వ అలసత్వ వైఖరి. ఒక యువతి, మహిళ లేదా బాలిక అక్రమ రవాణా చేయబడి, రక్షించబడిన తర్వాత, ప్రభుత్వం బాధితురాలికి తగిన పరిహారం, పునరావాసం మరియు ప్రత్యామ్నాయ జీవనోపాధి సహాయ సేవలను కల్పించడంలో పూర్తిగా విఫలమైంది.
తత్ఫలితంగా, ఆమె ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల నుంచి అధిక వడ్డీకి తీసుకున్న అప్పుల ఊబిలో చిక్కుకుని ఆ రుణాలను తిరిగి చెల్లించడానికి తప్పనిసరి పరిస్థితుల్లో సెక్స్ వర్క్ లోకి ప్రవేశించి అందులోనే కొనసాగుతున్నారు. కానీ వారు తమ ఆనందం కోసం లేదా ఎక్కువ డబ్బు సంపాదన కోసం ఇందులోకి ప్రవేశించడం లేదు.
విముక్తి డిమాండ్ చేస్తున్నది ఏమిటంటే, GO.MS.No. 1 ని ఖచ్చితంగా అమలు చేయాలని. ప్రత్యామ్నాయ జీవనోపాధి, పునరావాస సేవలు మరియు బాధితుల పరిహారాన్ని సులభతరం చేసేందుకు సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం AP ప్రభుత్వం 2003 లో ఈ జీ.ఓ. నంబర్ 1 ను జారీ చేసింది. కాబట్టి ఈ జీ.ఓ ను అమలు చేయడం ద్వారా సెక్స్ వర్కర్ల సమస్యలు పరిష్కరించబడతాయి మరియు వారిలో చాలా మంది సమాజంలో ప్రధాన స్రవంతిలో కలుస్తారు.
ఇంకా, రెండవ తరం బాలలు, అక్రమ రవాణాకు గురికాకుండా నిరోధించే ఈ GO లోని నిబంధనల అమలు స్థితిని సమీక్షించడానికి, ఈ GO.MS నంబర్ 1 ప్రకారం జిల్లా స్థాయి కమిటీలు ఉన్నాయి..
సెక్స్ వర్కర్ల పిల్లలను ప్రత్యేక కోటా కింద, ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చేర్చి కొనసాగించాలని పేర్కొన్న ఈ జిఓ నిబంధనల ప్రకారం, రెండవ తరం అక్రమ రవాణాను నిరోధించవచ్చు.
సుప్రీం కోర్టు కేవలం సెక్స్ వర్కర్ల పనిని గౌరవించాలని చెప్పిందే కానీ, దీనిని వృత్తిగా పేర్కొనలేదు. న్యాయస్థానం యొక్క ఆదేశాలను చట్టాన్ని అమలు చేసే సంస్థలు సరైన మార్గంలో అర్థం చేసుకోవాలి మరియు దానిలోని నిజమైన భావాన్ని గ్రహించాలి.
సెక్స్‌వర్క్‌ను గౌరవించాలనే కోర్టు సిఫార్సుల కారణంగా పోలీసులు ఇక తమకేమీ పట్టనట్లు ఉంటే, వ్యాపార లైంగిక దోపిడీ , దుర్వినియోగం కోసం బలవంతంగా వ్యభిచారంలోకి నెట్టబడ్డ అక్రమ రవాణా బాధితులను పోలీసులు గుర్తించి, రక్షించలేరు. కాబట్టి ఈ విషయంలో పోలీసు రైడింగ్‌లను ఆపకూడదు.
కాబట్టి ప్రతి జిల్లాలో తక్షణమే AHTU (యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లు) ఏర్పాటు చేసి బలోపేతం చేయాలని, కొత్త ఎంట్రీలను ఆపడానికి దాని నిఘా మెరుగుపరచాలని విముక్తి ఈ సందర్భంలో డిమాండ్ చేసింది.
చివరగా, అసలు సమస్య ఏమిటంటే, ఇందులోంచి బయటికి వచ్చిన వృద్ధ సెక్స్ వర్కర్ల గురించి ఏమిటి? ఈ సెక్స్ వర్క్‌లోకి కొత్త అమ్మాయిలు/యువతులు వారి ద్వారానే ఎక్కువగా ప్రవేశించే అవకాశం ఉన్నందున వారిపై, వారికి కూడా ప్రత్యామ్నాయ జీవనంపై కొంత దృష్టి అలాగే వారిపై నిఘా ఉండాలి.
విముక్తి – వైస్ ప్రెసిడెంట్ రజని, బి. పుష్ప – జాయింట్ సెక్రటరీ, ఎ. అపూర్వ – కోశాధికారి మరియు ఎం. మౌనిక – సభ్యురాలు సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో విజయవాడలో మీడియాతో మాట్లాడారు.