– కొడిగట్టిన కాంగ్రెస్‌ను వెలిగించిన రేవంత్
– జీరో నుంచి హీరోగా తెచ్చిన తెగింపు
– రేవంత్ పీసీసీ చీఫ్ కాకముందు దిక్కుతోచని కాంగ్రెస్
– అవసరమైన చోట తగ్గి నాయకత్వ ప్రతిభ చూపిన వైనం
– సీనియర్ల ఆగ్రహం నుంచి వారి ఆశీస్సుల వరకూ..
– ప్రాంతీయ పార్టీల మాదిరిగా సత్వర నిర్ణయాలు
– ఠాకూర్, డీకే, వేణుగోపాల్ దన్నుతో దూసుకుపోయిన తీరు
– రేవంత్ ఇమేజ్‌కు రాహుల్ ఫిదా
– బీఆర్‌ఎస్‌తో సై అంటే సై
– సోషల్‌మీడియాకు మెరుగులతో ప్రత్యర్థులను హడలెత్తించిన వ్యూహం
– ప్రచార పర్వంలో బీఆర్‌ఎస్‌కు ధీటుగా పరుగులు పెట్టించిన వైనం
– కేసీఆర్, కౌశిక్ నోట వైరాగ్యం పలికించిన యువనేత
– తెలంగాణ ఎన్నికల్లో తుఫాన్ సృష్టించిన రేవంత్
( మార్తి సుబ్రహ్మణ్యం)
అది ఉమ్మడి రాష్ట్రంలో జరుగుతున్న సభ.
ట్రెజరీ బెంచీ వైపు సీనియర్ రాజకీయనేత, ఆర్ధికమంత్రి కొణిజేటి రోశయ్య బడ్జెట్ గురించి సీరియస్‌గా వివరిస్తున్నారు.
అంతలో అటువైపు ప్రతిపక్ష టీడీపీ నుంచి నూనూగు మీసాల యువకుడు పైకి లేచి పాయింట్‌ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు.
అధ్యక్ష స్థానం అనుమతించిన తర్వాత.. ఆ యువకుడు తన ప్రసంగాన్ని సాదాసీదాగా ప్రారంభించి, సామెతలు- ప్రాసలు కలిపి గణాంకాలతో ప్రశ్నలు సంధించి, రోశయ్య గారిని ఇరుకున పెట్టారు. సహజంగా రోశయ్య గారి ముందరకాళ్లకు బంధం వేయడం కష్టం. అందులో లెక్కలకు సంబంధించి ఇంకా కష్టం!
అలాంటి రోశయ్య కూడా, లేచి నిలబడి ప్రసంగిస్తున్న ఆ యువకుడిని అలా కళ్లార్పకుండా చూసి, ఏదో నోట్ చేసుకున్నారు.
తర్వాత భుజంపైన కండువా సర్దుకుని, అధ్యక్షా.. అసలు ఆ ‘రవ్వంతరెడ్డి’ ఏం మాట్లాడతారు అధ్యక్షా నాకర్ధం కావడంలేదు? అంటూ చికాకుపడ్డారు. అప్పుడు సభకు సంబంధించిన వార్తలు కవర్‌చేసిన జర్నలిస్టులు… సభలో ఉన్న సభ్యులకు ఈ సన్నివేశం ఇంకా గుర్తుండే తీరాలి. శాసనసభ వ్యవహారాలను అవపోసన పట్టిన అంతలావు రోశయ్యను ఆరోజు, నీళ్లు తాగించిన ఆ ‘రవ్వంత’రెడ్డే… ఇప్పటి తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డి! అధికార పార్టీపై బహిరంగసభ వేదికల నుంచి నిప్పురవ్వలు కురిపించి, ‘కాబోయే సీఎం రేవంత్‌రెడ్డి’ అనిపించునే స్థాయికి ఎదిగిన కాంగ్రెస్ యువనేత రేవంత్‌రెడ్డి!!
ఇండిపెండెంట్‌గా జడ్పీటీసీ ఎన్నికల్లో విజయం సాధించి, చట్టసభలో కాలుమోపిన రేవంత్‌రెడ్డిది నిఖార్సయిన టీడీపీ స్కూలే. స్వతహాగా తెలివిగలవాడైన రేవంత్ ప్రతిభకు, టీడీపీ మరింత పదునుపెట్టింది. చంద్రబాబు నాయుడు ప్రోత్సాహంతో, పార్టీలో కీలకమైన నేతగా ఎదిగిన వైనం రహస్యమేమీ కాదు. సభలో టీడీపీకి తురుపుముక్కగా మారిన రేవంత్ ప్రస్థానం, ఇప్పుడు పీసీసీ చీఫ్ వరకూ ఎగబాకింది. అదికూడా..కాంగ్రెస్‌లో రాళ్లెత్తిన సీనియర్లను పక్కకునెట్టి!
నిజానికి రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్ కాకముందు.. తెలంగాణలో ఆ పార్టీ పరిస్థితి జీరో అన్నది, మనం మనుషులం అన్నంత నిజం. ఇప్పుడు జీరో నుంచి హీరో స్థాయికి ఎదిగంటే అది రేవంత్ బుద్ధిబలమన్నదీ అంతే నిజం! కెప్టెన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సారథ్యం, కాంగ్రెస్‌ను శిధిలావస్థకు చేర్చిందన్నది బహిరంగ సత్యం.
వరస వెంట వరస పరాజయాలు మూటకట్టుకుని, నడిపించే నాయకత్వం లేక కునారిల్లిన కాంగ్రెస్‌కు రేవంత్ సారథ్యం ఆశలు కల్పించింది. ఉత్తమ్‌ను తొలగించడం వల్ల కాంగ్రెస్‌కు లాభమా? నష్టమా? అన్నది పక్కనపెడితే, అధికార పార్టీకి మాత్రం తీరని నష్టం అన్న వ్యాఖ్యలు అప్పట్లోనే వినిపించాయి.
రేవంత్ నాయకత్వ పగ్గాలందుకున్నప్పుడు ఆయన పార్టీకి కొత్త. అప్పటికి వర్కింగ్ ప్రెసిడెంటయినప్పటికీ అందరికంటే జూనియర్. పైగా చుట్టూ తెల్లజుట్ల వృద్ధసింహాలు. అంతా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీలే. లేవకపోయినా.. తాము లేస్తే మనషులం కాద ని సింహగర్జన చేసేవారే. రేవంత్ రాకను సహించలేక ఒక్కొక్కరి గాండ్రింపులు, గద్దింపులు! తమకంటే సబ్‌జూనియర్ అయిన పిల్లోడి ముందు, స్థిరంగా నిటారుగా కూర్చోలేని ఇబ్బంది. ఫలితంగా తొలినాళ్లలో సహాయ నిరాకరణ. ధిక్కార స్వరాలు!
మామూలుగా రేవంత్ వయసులో చిన్నవాడైనప్పటికీ, వ్యవహారాల్లో మహా ముదురు. లౌక్యమే కాదు. లోకజ్ఞానం దండిగా తెలిసిన నేటి తరం నేత. అత్తారింటికి దారేది సినిమాలో పవన్ చెప్పినట్లు.. రేవంత్ కూడా ఎక్కడ నెగ్గాలో కాదు. ఎక్కడ తగ్గాలో కూడా తెలిసిన జ్ఞాని. ఆ తగ్గడమే.. ఆయనను కాదన్న సీనియర్లను సైతం మెప్పించింది. నల్లగొండలో కోమటిరెడ్డి నుంచి మెదక్‌లో జగ్గారెడ్డి వరకూ.. అంతా ‘హమ్‌సబ్ ఏక్ హై’ అనేలా చేసింది.
అయితే అది శాశ్వతమా? తాత్కాలికమా? విశ్రాంతి తీసుకున్న అసమ్మతి స్వరాలు మళ్లీ విరుచుకుపడతాయా? లేవా? అన్నది వేరే ముచ్చట. ఎందుక ంటే అది కాంగ్రెస్ కాబట్టి! పోలింగ్ ముందువరకైతే పార్టీని ఏకతాటిపైకి తెచ్చి, ఎన్నికలకు వృద్ధసింహాలను దించకుండా, వారిని ‘గౌరవప్రదంగా’ పక్కనకూర్చోబెట్టి, యువకులతో ఎన్నికల బరిలోకి దిగిన కెప్టెన్ రేవంత్‌రెడ్డి తెలివి-ముందుచూపును అభినందించాల్సిందే.
హన్మంతరావు, చిన్నారెడ్డి, పొన్నాల వంటి ముదురుసంఘాలను, జిల్లాల్లో దశాబ్దాలపాటు రాజకీయాలను శాసించిన వారిని పక్కనపెట్టడం నిజంగా సాహసమే. చివరకు కాంగ్రెస్‌ను శాసించి-శ్వాసించిన వైఎస్ కూడా ఆ పనిచేయలేపోయారు. అది రేవంత్‌కు సాధ్యమవడమే ఆశ్చర్యం. గెలుపు గుర్రాలే ముఖ్యమనుకున్న రేవంత్.. చివరకు తన అనుచరులు-మిత్రులకూ సీటివ్వకపోవడాన్ని విస్మరించలేం. సంప్రదాయ రాజకీయాలు-కాలం చెల్లిన సిద్ధాంతాలను పక్కనపెట్టి, ఒకే ఇంట్లో ఇద్దరికి సీట్లు ఇవ్వడం కూడా, ఆ పార్టీలో రేవంత్ తెచ్చిన నయా సూత్రీకరణ.
ముఖ్యంగా కాంగ్రెస్‌లో కోవర్టులకు కొదువ ఉండదు. కేసీఆర్ రెండు దఫాల పాలనలో ఆయనకు, వారి సహకారమే ఎక్కువన్నది కాంగ్రెస్‌లో తరచూ వినిపించే ప్రచారం. అలాంటివారిని కూడా, లౌక్యంగా పక్కకుపెట్టిన రేవంత్ సాహసం మెచ్చదగ్గదే. ఇవన్నీ కేవలం రేవంత్ ఒక్కరి ప్రతిభే అనుకుంటే పప్పులో కాలేసినట్లే. రేవంత్‌కు కాంగ్రెస్ బాసులు ఇచ్చిన స్వేచ్ఛ అది. రాష్ట్ర ఇన్చార్జి మాణిక్ ఠాక్రే, కర్నాటక డిప్యూటీ సీఎం డికె శివకుమార్, ఏఐసీసీ ప్రముఖుడు కెసి వేణుగోపాల్ ఇచ్చిన దన్నును.. రేవంత్ సద్వినియోగం చేసుకున్నారంతే. బహుశా ఇదంతా రేవంత్ ఇమేజ్-ఫాలోయింగ్‌ను స్వయంగా చూసిన రాహుల్ ఆయనకు ఇచ్చిన స్వేచ్ఛ కావచ్చు.
మరి ఇంతా చేసి, రేపు కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ సీఎం అవుతాడా? అని అడిగిన వాడు, అమాయకుడి కిందే లెక్క. కర్నాటకలో కాంగ్రెస్‌ను గద్దెనెక్కించేందుకు, కాళ్లకు బలపాలు కట్టుకుని తిరిగి, చావో-రేవో తేల్చుకునేందుకు బీజేపీతో భారీ యుద్ధమే చేసిన డికె శివకుమార్‌కు, కాంగ్రెస్‌కు అసలు సమయంలో చేయిచ్చింది.
అయినా సరే.. తాను ఫలానా తేదీన ఎల్బీస్టేడియంలో, సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తానని రేవంత్ ఆత్మవిశ్వాసంతో చేసిన ప్రకటనను కొట్టివేయలేం. అయినప్పటికీ.. ‘కాబోయే సీఎం రేవంత్‌రెడ్డి’ అనే స్థాయికి, ఒక స్వతంత్ర జడ్పీటీసి ఎదగడం సామాన్యమేమీకాదు.
ఇక ఎన్నికలలో చావో రేవో తేల్చుకునేందుకు, రేవంత్ చేసిన సాహసం సామాన్యమైనదేమీ కాదు. కేసీఆర్ రెండో చోట పోటీ చేస్తున్న కామారెడ్డిలో, ఆయనను ప్రత్యర్ధిగా బరిలోకి దింపినప్పుడే.. కాంగ్రెస్ నాయకత్వ వ్యూహం- రేవంత్ సత్తాపై నమ్మకం ఏమిటన్నది స్పష్టమైంది. అభ్యర్ధుల ఎంపిక నుంచి, బీజేపీ-బీఆర్‌ఎస్‌పై ఎదురుదాడి వ్యూహానికి అంతా తానై నాయకత్వం వహించిన రేవంత్ దూకుడుకు, రెండుసార్లు అధికారంలో ఉన్న పార్టీ కూడా హడలిపోవలసి వచ్చింది. బీఆర్‌ఎస్ అగ్రనేతల ప్రసంగాల తీరుకు ఈసీ నోటీసుల నుచి.. అధికార పార్టీకి ఆశ-శ్వాస అయిన రైతుబంధు సొమ్ములు ఆపించేంంత వరకూ, కేసీఆర్‌ను ఢీకొట్టిన రేవంత్ నాయకత్వ ప్రతిభ.. ఆ పార్టీ నాయకత్వాన్ని కచ్చితంగా మెప్పించి ఉండాలి.
సహజంగా ఏ ఎన్నికల్లోనయినా ప్రతిపక్షపార్టీలే, అధికారపార్టీపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తుంటాయి. కానీ తెలంగాణ ఎన్నికల్లో అది రివర్సయింది. అధికార పార్టీనే ప్రతిపక్ష కాంగ్రెస్‌పై ఫిర్యాదు చేసిన వైచిత్రి. సోషల్‌మీడియాలో తమపై శరపరంపరగా సంధిస్తున్న విమర్శనాస్త్రాలకు తాళలేక, కాంగ్రెస్‌పై ఫిర్యాదు చేసిన పరిస్థితి. అర్ధబలంలో అధికారపార్టీని ఎదుర్కోలేకపోయిప్పటికీ, ప్రచారరంగంలో మాత్రం బీఆర్‌ఎస్‌తో ఢీకొట్టడంలో సక్సెస్ అయింది.
నామినేషన్ల ముందు వరకూ, అసలు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్ధులే లేరన్న బీఆర్‌ఎస్ నాయకులు.. ప్రచారం చివరి రోజు వరకూ కాంగ్రెస్ జపం మాత్రమే చేశారంటే, ఆ పార్టీ ఏ స్థాయిలో జనక్షేత్రంలో దూసుకుపోతుందో చెప్పడానికి మేధావి కానక్కర్లేదు. చివరకు గతంలో కంటే ఎక్కువ సీట్లు వస్తాయని, బల్లగుద్ది చెప్పిన బీఆర్‌ఎస్ అధినేత-కేసీఆర్ సైతం ‘‘ మీరు అధికారం ఇస్తే సేవచేస్తాం. లేకపోతే ఇంట్లో రెస్టు తీసుకుంటాం’’ అనే నిర్వేద ప్రకటన చేసే వరకూ వెళ్లడమే.. చతికిలపడ్డ కాంగి‘రేసు గుర్రాన్ని తాజా ఎన్నికలలో ’ రేవంత్ ఎంత వేగంగా పరిగెత్తిస్తున్నారో అర్ధమవుతుంది.
ఇంకో విచిత్రమేమిటంటే… తాజాగా బీజేపీ నేత ఈటలపై పోటీ చేస్తున్న బీఆర్‌ఎస్ అభ్యర్ధి కౌశిక్‌రెడ్డి.. ‘‘నాకు మీరంతా ఓటేస్తే విజయయాత్రతో వస్తా. లేకుంటే 4వ తేదీన నేను-నా భార్య-నా బిడ్డల ఆత్మహత్యలతో నా చావుయాత్రకు రండి’’ అని కోరడం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.
బహుశా తన ఫ్యామిలీ సెంటిమెంటు డైలాగులు, జనక్షేత్రంలో ఓట్లు కురిపిస్తాయన్న అంచనాతో.. కౌశిక్‌రెడ్డిలో ‘సాదుకుంటరా? సంపుకుంటరా? మీ ఇష్టం’ అని అడిగి ఉండవచ్చు. కానీ అవి బూమెరాంగయి.. ‘‘అధికారంలో ఉన్న అభ్యర్ధే అంత బేలగా-విషాదంగా మాట్లాడితే, ఇక అధికార పార్టీ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్ధమవుతుంద’’న్న చర్చకు తెరలేచింది.
పోనీ ఇవన్నీ ఆయన నాలుగు గోడల మధ్య చేసి ఉంటే, ‘నా మాటలు మీడియా వక్రీకరించింద’ని నెపం, మీడియా మీద తోసే వెసులుబాటు ఉండేది. కానీ కౌశిక్‌రెడ్డి జనం మధ్యలో, కారుపైన భార్య-బిడ్డను చూపిస్తూ చేసిన వ్యాఖ్యలవి! కాబట్టి.. అవి నా వ్యాఖ్యలు కాదు. వీడియో మార్ఫింగ్ చేశారు. నా గొంతుతో మిమిక్రీ చేశారని తప్పించుకునే అవకాశం లేదు.
అవి.. చాక్లెట్ ఇస్తేనే స్కూలుకు వెళతా. లేకుంటే వెళ్లను అని చిన్నపిల్లాడి మారాం మాదిరిగానే ఉన్నాయే తప్ప, ఒక పోరాటయోధుడిలా లేవు. అయినా.. అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ సాధిస్తామన్న అధికార పార్టీ అభ్యర్ధి ఆ ధీమాకు బదులు, కడు దీనంగా.. చావు సెంటిమెంటుతో ఓట్లు అభ్యర్ధించే, దయనీయ పరిస్థితి దేనికి సంతేకాలు? మరి నిండా గాయాలతో క్షతగాత్రురాలయి.. ఎమర్జెన్సీ వార్డులో ఉన్న పార్టీని, జనరల్‌వార్డు నుంచి జనక్షేత్రంలోకి తెచ్చి, కాంగి‘రేసు గుర్రాన్ని’ పరుగులు పెట్టించిన ఘనత.. రేవంత్‌ది కాద నేవారు అమాయకుల కిందే లెక్క.