– తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ అత్యవసర సమావేశం జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి
– కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ యూనియన్ సెప్టెంబర్1వ తేదీన నిర్వహించే సభను విజయవంతం చేయాలని పిలుపు
హైదరాబాద్: పాత పెన్షన్ స్కీమ్ సాధనే లక్ష్యంగా తెలంగాణ కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1వ తేదీన నిర్వహించనున్న ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ వి. లచ్చిరెడ్డి పిలుపునిచ్చారు.
పాత పెన్షన్ సాధన కోసం ప్రభుత్వ ఉద్యోగులు అందరూ ఒకే గొడుగు కిందకు రావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. మంగళవారం లకడికపూల్ లో
లచ్చిరెడ్డి అధ్యక్షతన తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ అత్యవసర సమావేశం 37 ఉద్యోగ సంఘాల ప్రతినిధుల సమక్షంలో జరిగింది. ఈ సమావేశంలో లచ్చిరెడ్డి మాట్లాడుతూ సీపీఎస్ పెన్షన్ అంతమే జేఏసీ పంతం అని అన్నారు.
కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1వ తేదీన నిర్వహించనున్న ఆత్మగౌరవ సభకు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ తరుపున, జేఏసీ అనుబంధ సంఘాల తరుపున ఆయన సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
పాత పెన్షన్ స్థానంలో సీపీఎస్ పెన్షన్ తీసుకువచ్చిన ప్రభుత్వం, తాజాగా యూపీఎస్ పెన్షన్ స్కీమ్ ను అమలులోకి తీసుకువచ్చిందన్నారు. అంటే ప్రభుత్వం పరోక్షంగా సీపీఎస్ పెన్షన్ స్కీమ్ లో లోపాలు ఉన్నాయని ఒప్పుకుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులందరం గట్టిగా పోరాడితే మళ్ళీ పాత పెన్షన్ విధానం అమలులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కోసం ఎవ్వరు ప్రయత్నం చేసినా జేఏసీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందన్నారు.