Suryaa.co.in

Features

‘మట్టి’ వాసన వీడని గట్టి మనిషి ‘గల్లా రామచంద్ర నాయుడు’

రిటైర్మెంట్ తర్వాత పూతలపట్టు మండలం ‘పేటమిట్ట’ గ్రామంలో నివాసముంటున్న అమర్ రాజా పరిశ్రమల వ్యవస్థాపక ఛైర్మన్ గల్లా రామచంద్ర నాయుడు గారిని పలకరించడానికి వారి ఇంటికి ఇటీవల మా పార్టీ నేత, రాజ్యసభ మాజీ సభ్యులు పెనుమల్లి మధు గారు, జిల్లా కార్యదర్శి నాగరాజు, నేను కలిసి వెళ్ళాం. 88 సంవత్సరాల నిండైన విగ్రహం… అదే ఆప్యాయత… ఏమాత్రం చురుకుదనం తగ్గలేదు… ఎదురుగా వచ్చి ఆప్యాయంగా పలకరించారు.

ఇంట్లోకి తీసుకువెళ్లారు. తేనీటి సేవనం తర్వాత రామచంద్ర నాయుడు గారు తన జీవన ప్రస్థానాన్ని వివరించారు. భోజనానంతరం… ఇంత దూరం వచ్చారు… మా ఊరు చూద్దురు… రండని మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు తను పుట్టి, పెరిగిన ఊరు, తను నిర్మించిన పరిశ్రమలు, స్కూలు, స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తదితర సంస్థలన్నీ దగ్గరుండి చూపారు‌

ప్రతి చోట, ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా వివరిస్తూ, వారి సిబ్బందికి మమ్మల్ని పరిచయం చేస్తూ, మా ప్రశ్నలకు సమాధానం చెబుతూ 88 సంవత్సరాల వయసులో మూడున్నర గంటలపాటు కంటిన్యూగా మాతో ఉన్నారు. ఈ వయసులో ఇంతటి ఓపిక, సత్తువ ఎలా ఉన్నాయని 76 సంవత్సరాల వయసున్న మా మధుగారు నాయుడి గారిని ప్రశ్నించారు. పనిలోనే నాకు విశ్రాంతి ఉందని నవ్వుతూ సమాధానమిచ్చారు.

రామచంద్ర నాయుడు గారితో నాకు 25 ఏళ్ళుగా పరిచయం ఉంది. ఆయన ఒక ‘విజ్ఞాన గని’ ఏ విషయమైనా సమగ్రంగా మాట్లాడగలిగిన సామర్థ్యం కలిగిన మనిషి. అధ్యయనశీలి, ఆయనతో మాట్లాడినంత సేపు అనేక విషయాలు మనం నేర్చుకోవడానికి తోడ్పడుతుంది. ఎక్కువ సందర్భాల్లో ఆయనతో సంభాషించినా, వారి గురించి లోతుగా తెలిసిన విషయాలు తక్కువే.

ఇతరులు చెబుతున్నప్పుడు విన్న విషయాలు మినహా స్వయంగా తన జీవన ప్రస్థానం గురించి వారే చెప్పినప్పుడు ఒకింత ఆశ్చర్యం కలిగింది. ఈ భేటీలో తెలుసుకున్న విషయాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఒక మనిషి ఇంతలా చేయగలరా? ఇన్ని విజయాలు అందుకోగలరా? అనే అనుమానం కలుగుతుంది. వారు చెప్పిన విషయాల్ని మీతో వివరంగా పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ వ్యాసం రాస్తున్నాను.

చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలో ‘పేట మిట్ట’ అనేది ఒక కుగ్రామం. 25 ఇండ్లు కూడా లేని ఒక మారుమూల గ్రామంలో గంగులప్ప నాయుడు, మంగమ్మ దంపతులకు జన్మించిన సంతానం రామచంద్ర నాయుడు. పేటమిట్ట లో హైస్కూల్ చదువు చదివిన మొట్టమొదటి వ్యక్తి ఈయనే. ఈ చదువు కోసం ఏడు మైళ్ళునడిచి స్కూలుకు వెళ్లేవారు. కాలేజీ చదువులకు ఇదే రకంగా కష్టపడ్డారు. పశువులు మేపటం నుంచి వ్యవసాయ పనులు చేయడం వరకు అత్యంత సామాన్యుడిగా జీవనం సాగించారు.

స్వాతంత్ర సమరయోధుడు ఐరాల మండలం ‘దిగువమాఘం’కు చెందిన రాజగోపాల్ నాయుడు గారి కుమార్తె గల్లా అరుణకుమారి గారిని వీరు వివాహం చేసుకున్నారు. రాజగోపాల్ నాయుడు గారు తనకు ఎంతో స్ఫూర్తి నిచ్చారని చెబుతారు.

అమెరికాలో మంచి ఉద్యోగాన్ని, సౌకర్యవంతమైన జీవితాన్ని వదిలి 49 సంవత్సరాల వయసులో… తన నేలకు ఏదో చేద్దామన్న పట్టుదలతో తిరిగి చిత్తూరు జిల్లాలో రామచంద్ర నాయుడు గారు అడుగు పెట్టారు. ఎందుకు కొరగాని బీడు భూములను ప్రభుత్వం నుంచి పొంది 1984వ సంవత్సరంలో తిరుపతి కరకంబాడిలో కనీసం ఫోన్ సౌకర్యం కూడా లేని ప్రాంతంలో అమరరాజా పరిశ్రమని ప్రారంభించారు.

తన అత్త అమరావతి, మామ రాజగోపాల్ నాయుడుల పేర్లు కలిసేలా అమర్ రాజాను ఆయన స్థాపించారు. పరిశ్రమ ప్రారంభం నుంచి అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటూ నిలబెట్టారు. ప్రస్తుతం కరకంబాడి పరిశ్రమలో 6,800 మంది కార్మికులు పనిచేస్తున్నారు. దేశ విదేశాల్లో తమ ప్రత్యేకతను నిలబెట్టుకుంటూ, తన ప్రస్థానాన్ని విస్తరింప చేసుకుంటూ ఆయన పారిశ్రామిక రంగంలో బలమైన శక్తిగా ఎదిగారు.

తన పరిశ్రమలలో ఉద్యోగులు స్థానికులే ఉండాలని నిర్ణయించుకోవటం వీరి ప్రత్యేకత. ఆఖరుకు సాంకేతిక నైపుణ్యతను సైతం… ఏమీ తెలియని వారికి నేర్పించి, విదేశాలకు పంపి ట్రైనింగ్ ఇప్పించి మరీ స్థానికులను వినియోగించుకున్నారు. ఎంత ఇబ్బంది ఏర్పడినా బయటి వాళ్లను తీసుకొని రాలేదంటే ఆశ్చర్యం కలుగుతుంది.

తరువాతి కాలంలో తనకు జన్మనిచ్చిన పేట మిట్టలో ప్లాస్టిక్ ఉపకరణాల తయారీ కేంద్రం, బోల్టులు, నట్లు తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. 1100 మందికి ఇక్కడ ఉపాధి కల్పించారు. తనలాగా తన గ్రామస్తులు చదువు కోసం ఇబ్బంది పడకూడదని ‘మంగళ్ విద్యాలయాన్ని’ స్థాపించారు. తన తల్లి మంగమ్మ, తండ్రి గంగులప్ప నాయుడు ల పేర్లు కలిసి వచ్చేలా మంగళ్ విద్యాలయాన్ని ప్రారంభించారు.

మంగళ్ సీబీఎస్ఈ విద్యాలయంలో ప్రస్తుతం 2300 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఒకటవ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఇక్కడ చదువు చెబుతున్నారు. సమర్థులైన ఉపాధ్యాయులు ఉన్నారు. అమ్మాయిలకు హాస్టల్ వసతి ఉంది. ‘పేటమిట్ట’ చుట్టుపక్కల 20 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాల ప్రజలకు ఈ విద్యాలయం ఎంతో ప్రయోజనకరంగా ఉంది.

ఈ ఊర్లోనే ‘మల్టీ స్కిల్’ టెక్నీషియన్ సెంటర్ ఉంది. ఈ కేంద్రంలో పదవ తరగతి ఫెయిల్, పాస్ అయినవారికి ప్రతినెలా 70 నుంచి 80 మందికి అడ్మిషన్లు ఇస్తున్నారు. మూడు సంవత్సరాలపాటు ట్రైనింగ్ ఉంటుంది. స్టైఫండ్ ఇస్తున్నారు. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత వీరికి తమ పరిశ్రమలలోనే ఉపాధి కల్పిస్తున్నారు. వద్దనుకున్న వారు బయట కూడా ఉపాధి పొందవచ్చు.

15 దేశాలు, దేశీయంగా కోయంబత్తూర్ లోని జీడి నాయుడు పిఎస్ జి కళాశాల, టీవీ సుందరం మోటార్స్ లాంటి అత్యున్నత స్కిల్ సెంటర్లను పరిశీలన చేసి ఈ కేంద్రాన్ని రూపొందించారు.

ఐఐటి చెన్నైలో సైతం లేని సౌకర్యాలు ఇక్కడ ఉండటం చూసి ఐఐటి తిరుపతి డైరెక్టర్ సత్యనారాయణ గతంలో ప్రశంసించారు. ఇలాంటి మరొక కేంద్రాన్ని దిగువమాఘంలో ప్రారంభిస్తున్నారు. ఇక్కడ శిక్షణ పొందిన వారు ఉద్యోగులుగా అమరరాజలో స్థిరపడటమే కాకుండా ప్రతి ఏడాది పది బృందాలుగా ఏర్పడి అంతర్జాతీయ పోటీలలో పాల్గొంటూ తమ సామర్థ్యాన్ని నిరూపించుకుంటున్నారు.

వీరికి అవసరమైన విమాన టికెట్లు, రాను, పోను ఖర్చులు మొత్తం పరిశ్రమ నుంచే భరిస్తున్నారు. ఇప్పటికే జపాన్, చైనా, ఫిలిప్పీయన్స్, ఇండోనేషియా, సింగపూర్ తదితర దేశాల్లో వీరు తమ సామర్థ్యాన్ని ప్రదర్శించి అవార్డులు గెలుచుకున్నారు. గత ఎన్నో ఏళ్లుగా పోటీలలో ప్రథమ స్థానం పొందుతూనే ఉన్నారు.

తన అత్తగారి ఊరు దిగువమాఘంలో అమరరాజా ఎలక్ట్రానిక్స్ పరిశ్రమని ప్రారంభించారు. ఇందులో 85 శాతం మహిళలే ఉంటారు. 400 మందికి పైగా పని చేస్తున్నారు. తేనెపల్లి వద్ద ‘గల్లా ఫుడ్స్’ పరిశ్రమలో ‘పల్ప్’ (పండ్ల గుజ్జు) పరిశ్రమ నడుస్తున్నది. 45 దేశాలకు ఇక్కడి నుంచి ఎగుమతులు చేస్తున్నారు. ఇందులో 300 మంది పనిచేస్తున్నారు. కోకా- కోలా సంస్థ ‘మాజా’ డ్రింక్ ఇక్కడే తయారవుతుంది.

ఇక్కడి మంగళ్ ఇండస్ట్రీలో 600 మంది పని చేస్తున్నారు. బంగారుపాళెం నూనుగుండ్లపల్లి వద్ద అమర్ రాజ గ్రోత్ కారిడార్ లో ప్లాస్టిక్ కాంపోనెంట్ పరిశ్రమతో పాటు, ద్విచక్ర వాహనాలకు బ్యాటరీ తయారీ యూనిట్, ఇన్వర్టర్లకు బ్యాటరీ యూనిట్, యూపీఎస్ లకు బ్యాటరీ తయారీ యూనిట్, 4 చక్రాల వాహనాలకు బ్యాటరీ తయారీ యూనిట్లు రెండు, కాలుష్య నివారణకు బ్యాటరీ ప్లేట్ల తయారీ యూనిట్లు ఉన్నాయి. 5800 మంది ఇక్కడ పనిచేస్తున్నారు.

1984లో ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తిరుపతి కరకంబాడిలో పరిశ్రమ ప్రారంభానికి శంకుస్థాపన చేశారు. నాటి నుంచి నేటి వరకు ఎవరు అధికారంలో ఉన్నా ఈ యాజమాన్యానికి సహకరించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే వీరి పట్ల సానుకూలంగా వ్యవహరించడం లేదని అర్థం అయింది.

. ఈ కారణంగా పదివేల కోట్ల పెట్టుబడి, పదివేల మందికి ఉపాధి కల్పించే భారీ పరిశ్రమ తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాకు తరలిపోయింది. విద్యుత్ వాహనాలకు సెల్స్, బ్యాటరీలు తయారు చేసే ఈ పరిశ్రమ చిత్తూరు జిల్లాలో ఉండి ఉంటే ఇక్కడి వారికి ఎంతగానో ఉపయోగపడి ఉండేది. ప్రభుత్వాధినేత మూర్ఖత్వం కారణంగా పరిశ్రమ తరలిపోవడం బాధాకరం‌.

అలాగే బ్యాటరీ రీసైక్లింగ్ పరిశ్రమ తమిళనాడు రాష్ట్రంలోని రాణీపేటలో ప్రారంభించారు. 200 మంది ఇక్కడ పని చేస్తుంటారు.ఇవన్నీ ఒక ఎత్తయితే రామచంద్ర నాయుడు గారు తన సొంత ఊరు ‘పేటమిట్ట’ ప్రజలకు చేసిన సాయం మరువలేనిది. ఒకనాడు కరెంటుకు కూడా నోచుకోని కుగ్రామం… నేడు పట్టణంగా మారిపోయింది. సొంతంగా పంచాయతీ ఏర్పడింది. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అన్ని హంగులు కల్పించడంతో పది పడకల ఆసుపత్రిగా మారింది. ఆసుపత్రి అంటే తెలియని పేటమిట్ట గ్రామానికి చుట్టుపక్కల 50 గ్రామాల ప్రజలు వైద్యం కోసం వస్తుంటారు.

ఈ చిన్న గ్రామంలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను నిర్మించారు. ప్రతి వీధిలో సిమెంట్ రోడ్లు ఉన్నాయి. మంచి స్కూలు ఉంది. ఆలయం, కమ్యూనిటీ హాలు నిర్మాణం జరుగుతున్నది. 24 గంటలు మంచినీళ్లతో ఆ గ్రామ రూపురేఖలే మారిపోయాయి.

తాను పుట్టిన ఇంటిని రామచంద్ర నాయుడు గారు చూపుతూ గల్లా కుటుంబీకులు 16 మంది ఈ ఇంట్లోనే పురుడు పోసుకున్నారని ఓ పాత పాడుబడ్డ ఇంటిని చూపారు. ఆ ఇంటిని పదిలపరుస్తూ ఓ జ్ఞాపకంగా మార్చబోతున్నట్టు చెప్పారు.

గ్రామం చుట్టూ… నీటి వృధాను అరికట్టడానికి, వర్షపునీటిని సైతం వినియోగించుకోవడానికి చెక్ డ్యామ్ లను నిర్మించారు.
పైన పేర్కొన్నవి.. ఏవీ… ప్రభుత్వానికి సంబంధం లేకుండా తమ సొంత నిధులతో గ్రామానికి నాయుడు గారు ఖర్చు చేశారు.
పేటమిట్ట’ లోని ప్రతి ఇంటిలో ఇప్పుడు ఉద్యోగులు, ఉన్నత చదువులు చదువుకునే విద్యార్థులు, విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారు, చదువుకుంటున్న వారు అనేకమంది ఉన్నారు. ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ఒక ఉన్నత స్థానానికి ఎదిగిన ఓ మనిషి …. చేసిన కృషి ఫలితంగా ‘పేటమిట్ట’ గ్రామం అంతర్జాతీయంగా ప్రశంసలు పొందుతున్నది. ఈ ఫలితాలను చూస్తుంటే తనకు ఎంతో సంతోషం కలుగుతుందని రామచంద్ర నాయుడు గారు చెప్పుకొచ్చారు.
వేలకోట్ల పారిశ్రామిక సామ్రాజ్యానికి అధిపతిగా…
మాజీ మంత్రికి భర్తగా…
ఓ పార్లమెంటు సభ్యుడికి తండ్రిగా…
కించిత్ గర్వం కూడా ఎక్కడా ఆయనలో తొణికిసలాడదు.
పైగా….
పేటమిట్టకు మేము వెళ్లే సమయానికి ‘పండుగాడ’ని తన చిన్ననాటి స్నేహితునితో రామచంద్ర నాయుడు గారు ముచ్చటిస్తున్నారు. తనకంటే వయసులో చిన్నయినా.. పండూ అనే పెద్దాయన ఈయనకంటే పెద్ద మనిషిలా కనిపించారు.

ఏమీ చదువుకోని ‘మామూలు మట్టి మనిషిలా’ ఉన్న ఆయనతో ఈయన ఎంతో ఆత్మీయంగా మాట్లాడటం కనిపించింది. తను ఏ స్థాయిలో ఉన్నా తన మట్టి వాసనను మర్చిపోకుండా ఇప్పటికీ ప్రతిరోజూ వాకింగ్ కు వెళ్లటం… తన చిన్ననాటి స్నేహితులతో మాట్లాడటం… ప్రతి ఇంటితో సంబంధం కలిగి ఉండడం… వాకింగ్ కి వెళ్లి తమ ‘పశువులు కొట్టం’ దగ్గర కాలక్షేపం చేసే గల్లా రామచంద్ర నాయుడు గారి లాంటి మనుషుల అవసరం ఈ సమాజానికి ఎంతగానో ఉంది.

– కందారపు మురళి
సిపిఎం నేత, తిరుపతి.

LEAVE A RESPONSE