-వినియోగదారులకు భారీ షాక్
– మళ్లీ పెరిగిన సిలిండర్ ధర
విజయవాడ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్యాస్, పెట్రోల్ ధరలను నియంత్రించడంలో విఫలమైందని, వంటింట్లో గ్యాస్ బండ సామాన్యుల గుండెల్లో గుదిబండలా మారిందని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ ఆరోపించారు. ఓవైపు పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల ధరలు మోత మోగుతుంటే గృహ వినియోగ సిలిండర్ ధరను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకోవడం గోరు చుట్టుపై రోకలి పోటులా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.50 పెంచడంతో 14 కేజీల సిలిండర్ ధర రూ.1052కి చేరిందని పేర్కొన్నారు. కొద్ది రోజుల క్రితమే వాణిజ్య సిలిండర్ ధరను చమురు సంస్థలు రూ.102.50 పెంచటం వల్ల రూ.2253గా ఉన్న గ్యాస్ బండ రూ.2355.50కి చేరిందన్నారు. ఈ నెల 1న పెరిగిన ధరతో వాణిజ్య సిలిండర్ ధర రూ.2,460 నుంచి 2,563.50కి చేరిందని, మార్చిలోనూ సిలిండర్‌పై రూ.105 పెంచారు. దీంతో చిరువ్యాపారులు, హోటల్ యజమానులపై భారం పడిందని, నెలకు ఐదు సిలిండర్లు వినియోగిస్తే రూ.3,000 వరకు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోందని పేర్కొన్నారు. తక్షణమే పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని శైలజనాథ్ డిమాండ్ చేశారు.
విద్యుత్ మీటర్లకు కాంగ్రెస్ వ్యతిరేకం
– వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్ తులసిరెడ్డి
అమరావతి: వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించాలన్న వైసీపీ ప్రభుత్వం నిర్ణయించడం శోచనీయమని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. శనివారం ఆయన విడుదల చేసిన ఒక ప్రకటనలో ఇది రైతు వ్యతిరేక నిర్ణయమన్నారు. పంపు సెట్లకు మీటర్లు బిగించడం అంటే రైతుల మెడలకు ఉరిత్రాళ్లు బిగించడమే అని వ్యాఖ్యానించారు. వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ సరఫరా పథకాన్ని ఎత్తివేసే పన్నాగమే అని ఆరోపించారు. ఉచిత విద్యుత్ పథకం కాంగ్రెస్ పార్టీ మానస పుత్రిక అని అన్నారు. మీటర్లు బిగించడాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందని తులసిరెడ్డి స్పష్టం చేశారు.