-వ్యర్థాల నుంచి విలువైన ఉత్పత్తులు
-విశాఖలో పైలట్‌ప్రాజెక్టు కింద అమలు
-ప్లాస్టిక్ నుంచి బ్రాండింగ్ ఉత్పత్తుల తయారీ
-గ్లోబల్ అలియన్స్ ఫర్ సస్టయిన్‌బుల్ ప్లానెట్ (జీఏఎస్‌పీ) సంస్థ ప్రతినిధులతో క్యాంప్ కార్యాలయంలో సీఎం చర్చలు
అమరావతి:
సుస్థిర ఆర్థిక ప్రగతి లక్ష్యంగా అడుగులేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని విప్లవాత్మక చర్యలకు శ్రీకారంచుడుతోంది. సుస్థిర ప్రగతి కోసం తీసుకుంటున్న చర్యల్లో çహరిత విధానాలకు పెద్దపీట వేయడం, తద్వారా అభివృద్ధికి, పర్యావరణ పరిరక్షణకు మధ్య సమతుల్యత సాధించడం తదితర కీలక అంశాలపై ప్రత్యేక దృష్టిపెట్టింది. దీంట్లో భాగంగా గ్లోబల్ అలియన్స్ ఫర్ సస్టయిన్‌బుల్ ప్లానెట్ (జీఏఎస్‌పీ) సంస్థ ప్రతినిధులతో సీఎం వైయస్.జగన్ చర్చలు జరిపారు. వ్యర్థాలనుంచి విలువైన వస్తువుల తయారీని పైలట్‌ప్రాజెక్టు కింద విశాఖపట్నంలో చేపట్టాలని నిర్ణయించారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంతో అనుసంధానమై ఈ పైలట్ ప్రాజెక్ట్ చేపట్టాలని ఆదేశించారు. తద్వారా బీచ్‌లను అత్యంత పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఇతర అంశాలపైనా కూడా తగిన ప్రణాళికలు రూపొందించి నివేదించాలన్నారు.
సైరిల్ గట్స్, పౌండర్, పార్లీ ఫర్ ది ఓసియన్స్
ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలన, రీ సైక్లింగ్‌పై జీఏఎస్‌పీ ప్రతినిధి, ప్రముఖ అంతర్జాతీయ డిజైనర్, పార్లీ ఫర్ ది ఓసియన్స్ పౌండర్ సైరిల్ గట్చ్ సీఎంకు వివరాలు అందించారు. ప్లాస్టిక్ వ్యర్థాలతో సముద్రాలు తీవ్రంగా కలుషితమైపోతున్నాయని, వీటినుంచి సముద్రాలను, తద్వారా ధరిత్రిని రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ వ్యర్థాలను రీసైకిల్ చేయడంలో, అందులో పర్యావరణ అనుకూల విధానాలను పాటించడం చాలా అవసరమన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా 150 మిలియన్ టన్నుల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులు వస్తే వాటిలో కేవలం 9శాతం మాత్రమే రీ సైక్లింగ్ చేస్తున్నారని, మిగతావన్నీ కూడా కాలుష్యానికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయని వివరించారు. ఈ వ్యర్థాలను విలువైన ఉత్పత్తులుగా మార్చడంలో హరిత విధానాలకు పెద్దపీట వేయడం ద్వారా కొత్త ఆర్థిక వ్యవస్థకు దారులు వేసినట్టువుతందన్నారు. ప్రకృతికి అనుకూలంగా ఉండే సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం ద్వారా సరికొత్త ఆర్థిక వ్యవస్థతో మంచి అభివృద్ధి సాధ్యమవుతుందని వెల్లడించారు.
జీఏఎస్‌పీ అనుబంధ సంస్థ పార్లే ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాలనుంచి తయారుచేస్తున్న విలువైన ఉత్పత్తులను ముఖ్యమంత్రికి వివరించారు. భవన నిర్మాణ మెటీరియల్, ఫర్నిచర్, వస్త్రాలు, షూలు.. ఇతరత్రా వినూత్న వస్తువుల తయారీపై సీఎంకు వివరించారు. అంతిమంగా ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలన, రీసైక్లింగ్ ద్వారా నూతన ఆర్థిక వ్యస్థకు ఊతమిచ్చే ప్రక్రియ కొనసాగుతుందన్నారు.
పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్‌కోసం జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా ప్రతి ఇంటి నుంచీ సేకరిస్తున్న వ్యర్థాలను ప్రాసస్ చేస్తున్న విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వ పురపాలక పట్టణాభివృద్ధి సంస్థ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి జీఏఎస్‌పీ ప్రతినిధులకు వివరించారు. విశాఖను పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసుకోవాలని సీఎం అక్కడికక్కడే అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం అమలవుతున్న స్వచ్ఛసంకల్పం కార్యక్రమాన్ని అనుసంధానంచేసుకుంటూ విలువైన ఉత్పత్తుల తయారీని చేపట్టడంతోపాటు, బీచ్‌ను పరిశుభ్రంగా ఉంచడంపై దృష్టిపెట్టాలన్నారు. విశాఖపట్నంలో దీన్ని అమలు చేసి ఫలితాల ఆధారంగా మిగిలిన ప్రాంతాల్లో కూడా ఈ తరహా విధానాలపై దృష్టిపెడతామన్నారు.
ఎకో టూరిజంపై ఉత్తరాఖండ్‌లో చేపడుతున్న ప్రాజెక్టు వివరాలను జీఏఎస్‌పీ ప్రతినిధులు వివరించారు. రాష్ట్రంలో అరుకు, అనంతగిరి, రంపచోడవరం ప్రాంతాల్లో ఎకోటూరిజం విస్తృతి, అభివృద్ధికి మంచి అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. దీనిపై తగిన ప్రణాళిక తయారు చేయాలని సీఎం ఆదేశించారు. స్థానికులకు మంచి ఆదాయాలను ఇచ్చేదిగా ఈప్రణాళిక ఉండాలన్నారు.
కర్బన వ్యర్థాలతో సారవంతంగా నిరుపయోగ భూములను మార్చడంతోపాటు, సేంద్రీయ సహజ వ్యవసాయ ఉత్పత్తులు, వాటికి అంతర్జాతీయ మార్కెటింగ్ తదితర అంశాలపైనా సమావేశంలో విస్తృత చర్చ జరిగింది.
ఈ సందర్భంగా సీఎం వైయస్.జగన్ ఏమన్నారంటే…:
మనం కలెక్ట్ చేస్తున్న ప్లాస్టిక్ వ్యర్ధాలను తిరిగి ఉపయోగపడేలా చేయడం చాలా మంచి పరిణామం.
సముద్రతీరాలను శుభ్రం చేయడం, మరింత అందంగా తయారు చేయాలన్నది మంచి విధానం. ఇందులో మంచి అనుభవమున్న మీరు…అంతర్జాతీయంగా ఇప్పటికే ఈ ప్రక్రియ చేపట్టారు. ఇందులో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఏపీలో మేం ఇప్పటికే ఇలాంటి వ్యర్ధాల కలెక్షన్‌పై స్పష్టమైన విధానాన్న అనుసరిస్తున్నాం. నాన్ బయోడిగ్రీడబుల్ మెటీరియల్‌ను ఎలా రీ సైక్లింగ్ లేదా రీయూజ్‌లోకి తేవాలన్న దానిపై సీరియస్‌గానే ఆలోచన చేస్తున్నాం. అందుకు మల్టీనేషనల్ స్ధాయిలో పనిచేస్తున్న మీలాంటి వారి అనుభవాన్ని కూడా ఉపయోగించుకోవాల్సి ఉంది. ఇది ఓ మంచి ప్రయత్నం.
వ్యవసాయ రంగంలో దేశ చరిత్రలో మొదటిసారిగా మేం ఒక కొత్త వ్యవస్ధను తీసుకొచ్చాం. దాదాపు 13 వేల గ్రామ పంచాయతీలు ఉంటే.. వాటిలో 10,777 రైతు భరోసా కేంద్రాలను గ్రామాల్లో ఏర్పాటు చేశాం. అగ్రికల్చర్, హార్టికల్చర్ అసిస్టెంట్లు అక్కడే ఉండి పనిచేస్తారు. ప్రతి ఆర్బీకేలో అక్కడే ఒక కియోస్క్‌ను కూడా ఏర్పాటు చేశాం. విత్తనాలు, ఎరువులు సరఫరా చేస్తూ… రైతును చేయి పట్టుకుని నడిపించే బాధ్యత తీసుకున్నాం. విత్తనాలు, ఎరువులు రైతులకు సకాలంలో అందించడంతోపాటు నకిలీ, కల్తీలు లేకుండా చేయడానికి ఆర్బీకే కేంద్రంగా విక్రయాలు ఏర్పాటు చేస్తున్నాం.
నాణ్యత నిర్ధారణ కోసం, ప్రభుత్వమే విత్తనాలు, ఎరువులు నాణ్యత నిర్ధారించిన తర్వాతే రైతులకు అందిస్తున్నాం. అంటే విత్తనం నుంచి విక్రయం వరకు రైతులను దగ్గరుండి చేయిపట్టుకుని నడిపించే కార్యక్రమం చేస్తున్నాం. ఇందులో ఆర్బీకే కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో భాగంగానే గ్రామంలో ప్రతి పంటనూ ఇ–క్రాప్ ద్వారా ప్రతి ఎకరాను ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసి, జియో ట్యాగింగ్ చేస్తున్నాం. రైతుతో పాటు పండిస్తున్న పంట వివరాలు నమోదు చేస్తున్నాం.
దీని ద్వారా రైతుకు ప్రభుత్వం తరపున అన్ని రాయితీలను అందించడానికి అవకాశం ఉంటుంది. పంట నష్టపోతే ఈ వివరాల సాయంతో పరిహారం కూడా చెల్లిస్తున్నాం. ఎక్కడా అవినీతికి ఆస్కారం లేకుండా.. అర్హత ఉన్న ప్రతి ఒక్క రైతుకూ ఇ–క్రాప్ ద్వారా సాయం అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ నేపధ్యంలో ఆర్బీకేలు భవిష్యత్తులో సహజసాగుకు కేంద్రాలుగా మారనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి 2 వేల మంది ప్రజలకు ఒక ఆర్బీకే ఉంది. వీటిని సహజసాగు దిశగా మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం ఆర్బీకేలను సాంకేతికంగా మరింత పటిష్టపరచాల్సి ఉంది.
మరోవైపు కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు(సీహెచ్‌సీ)ను ప్రోత్సహించాల్సి ఉంది. ఇందులో ఆ గ్రామానికి చెందిన రైతులు భాగస్వామ్యులుగా ఉంటారు. వారి వాటాలు కూడా ఉంటాయి. ప్రభుత్వం కూడా వీటికి సబ్సిడీ ఇస్తుంది. వీటిలో సహజ సాగుకు కూడా ఒక సీహెచ్‌సీ ప్రత్యేకంగా ఏర్పాటు కానుంది. దీనికి సంబంధించిన ఉపకరణాలను సంబంధిత ఆర్బీకేలలో అందుబాటులో ఉంచితే.. రైతుల్లో ఆ దిశగా అవగాహన కలిగించడంతో పాటు అందుకు అవసరమైన పరికరాలను కూడా సరఫరా చేసే అవకాశం ఉంటుంది.
సహజసాగు విధానాలు కేవలం ప్రయోగశాలకే పరిమితం కాకుండా… వాటిని రైతులకు కూడా అందుబాటులో ఉండేలా చేయాలి. సహజ సేంద్రీయ సాగు పెద్ద ఎత్తున రాష్ట్రంలో ప్రతి గ్రామంలోనూ చేపట్టాలి. వీటి ఫలితాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలి. కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితం కాకుండా… ప్రతి ఒక్కరికీ దీనిపై అవగాహన కలిగించాల్సిన అవసరం ఉంది. మరోవైపు సహజ సాగు ఉత్పత్తులకు మంచి ధరలు కల్పించాల్సిన అవసరం ఉంది.
సాధారణ సాగు పద్దతుల ఉత్పత్తులకు, సహజ సాగు ఉత్పత్తుల ధరల మధ్య తేడా స్పష్టంగా కనిపించాలి. సహజ సాగు విధానంలో పంటలను ప్రొత్సహించడానికి సర్టిఫికేషన్ ప్రక్రియను చేపట్టాలి. దానికి సరైన ధర నిర్ణయించాలి. వివిధ రకాల రసాయనాలు, ఫెర్టిలైజర్స్ వాడకం ద్వారా లభించిన ఆహార ఉత్పత్తుల వినియోగం కేన్సర్ వంటి వ్యాధులకు కారణమవుతుంది. దీన్ని నివారించడానికి తగిన చర్యలు తీసుకోవాలి. సహజసాగు విధానాలు కేవలం ప్రయోగశాలకే పరిమితం కాకూడదు.
క్షేత్రస్ధాయిలో అమలు కావాలి. మన దగ్గర ఉన్న ఆర్బీకేల వంటి మంచి వ్యవస్ధలను వాడుకోవడం ద్వారా… మనం ఆశిస్తున్న మార్పులను సహజ సాగు విధానం ద్వారా సాధించగలుగుతాం. మీ సహకారంతో వ్యవస్ధలో మంచి మార్పులు తీసుకురావచ్చు. అప్పుడే సహజసాగులో మన రాష్ట్రం అంతర్జాతీయస్ధాయిలో నిలబడుతుంది. దీనికి సంబంధించి ఒక యూనివర్సిటీ ఏర్పాటు దిశగాఆలోచన చేస్తున్నాం. దీనిపై అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చాం. సహజసాగులో గ్రాడ్యుయేషన్ కూడా ప్రవేశపెట్టాలని సూచించాం. తద్వారా మరింత మంది శిక్షణ పొందిన విద్యార్ధులు బయటకు వస్తారు.ఇక ఎకోటూరిజం విషయానికొస్తే.. పెద్ద సంఖ్యలో స్ధానిక యవతకు ఉపాధి కలిగించే అవకాశం ఉంది, దీనిపై తగిన ప్రణాళికలు తయారు చేయాలని అని సీఎం అధికారులను ఆదేశించారు.
ఈ భేటీలో సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, పుడ్ ప్రాససింగ్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే, ఏపీ మార్క్‌ఫెడ్ ఎండీ పీ ఎస్ ప్రద్యుమ్న, జీఏఎస్‌పీ ఛైర్మన్ ఎరిక్ సోలమ్(erik solheim), జీఏఎస్‌పీ సెక్రటరీ జనరల్ సత్య త్రిపాఠి, పార్లీ ఫర్ ది ఓసియన్స్ పౌండర్ సైరల్ గట్చ్(cyrill gutsch), ఎకో టూరిజం ఇన్వెస్టర్ అదితి బల్బిర్(adithi balbir), ఎస్ 4 కేపిటల్ పీఎల్‌సీ డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ పోరన్ మలాని(poran malani), పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.