భగవంతుడు ప్రజలను సృష్టించుటకు పూర్వమే వారికి ఆహారమును ఏర్పాటుచేసి తర్వాతనే ప్రజలను సృష్టించినాడు. తల్లి గర్భములోనుంచి శిశువు పుట్టగనే ఆ శిశువునకు కావలసిన స్తన్యము సిద్ధమై యున్నదిగదా! అటులనే పంచభూతములను ముందు సృష్టించి వానిలో ప్రజలకు కావలసిన ఆహారము ఏర్పాటు చేసినతర్వాతనే ప్రజలను సృష్టించినాడు. స్థూలదేహమునకు ఆహార మెటులవసరమో, సూక్ష్మదేహమునకున్ను ఆహారము అవసరమే గదా ?
అట్టి సూక్ష్మ దేహమున కాహారము తరింపజేయు విజ్ఞానమే. ప్రజాసృష్టికి పూర్వమే స్థూల దేహమునకు కావలసిన ఆహారమును ముందుగా సృష్టించినట్లుగానే, సూక్ష్మ దేహమునకు కావలసిన ఆహారమైన విజ్ఞానమును కూడ ముందుగానే భగవంతుడు ఏర్పాటు చేసినాడు. ఆ విజ్ఞానము వేదవిజ్ఞానమే. ఆ వేదవిజ్ఞానముయొక్క సారమే ‘భగవద్గీత’, గీతాతత్త్వము భగవతత్త్వమే గనుక భగవంతుని వలె అనాదియును నిత్యమును అయ్యున్నది.
అట్టి గీతాతత్త్వమునుసృష్ట్యాదిని భగవంతుడు సూర్యునకు ఉపదేశము చేయగా, సూర్యుడు మనువునకు, మనువు ఇక్ష్వాకుకున్ను ఉపదేశము చేసినాడు. ఆ పరంపరలో కొంత కాలము వచ్చినతరువాత కాలము గడచినకొలది ప్రజలలో కామము ఎక్కుగుటచేత గీతాతత్త్వము నష్టప్రాయమయ్యెను. దానిని తిరిగి ఉద్ధరించుటకుగాను గత ద్వాపర యుగములో కాలము ఆసన్నమాయెను. ఆకాలములో ఉన్న ప్రజలలో అర్జునుడు అన్నివిధములను ఉత్తము డగుటచేత అతని ద్వారా గీతాతత్త్వమును ఉద్ధరించి ప్రజలకు భగవంతుడు అందింప సంకల్పించినాడు.
ఇట్లుండగా, కౌరవులకున్ను పాండవులకున్ను యుద్ధము సన్నద్ధముకాగా, ధర్మపక్షపాతియగు కృష్ణుడు ధర్మమార్గము ననుసరించు పాండవుల పక్షము చేరి అర్జునునకు రథసారథ్యమును అంగీకరించెను. ధర్మక్షేత్రమైన కురుక్షేత్రములో ఉభయసేనలు చేరగా అర్జునుడు తన సారథియైన కృష్ణునితో తాను యుద్ధసన్నద్ధులయి వచ్చిన ఉభయసేనలలోని వారలను చూడదలచినానని చెప్పి అందుకుగాను ఉభయసేనలమధ్యను తన రథమును నిలుపుమని కోరెను.
గీతను అర్జునునిద్వారా అవతరింపచేయుటకు యిది మంచి తరుణమని కృష్ణుడు నిశ్చయించుకున్నాడు. కాని, అర్జునుడు కృష్ణునితో సమాన వయస్కుడై, మేనమామ కుమారుడు అగుటచేత, చిన్నప్పటినుండియు మిక్కుటమైన స్నేహముతో, బావా, బావా, అనుచు సరససల్లాపము లాడుచు ఉండు స్వభావముగలవాడగుటచేత అతనికి గీతను బోధించుట ఎట్లు సాధ్యంబగును? గీతను బోధించవలెనన్న కృష్ణునిమధ్యను అర్జునుని మధ్యను గురుశిష్య సంబంధ మేర్పడ వలసియున్నది గదా? ‘బావా’ యని అతి చనువుతో పిలుచు అర్జునుడు శిష్యుడగుటకు మార్గమేమి?
అర్జునుడు కృష్ణుని గురువుగా స్వీకరించి కాళ్ళు పట్టుకొని నాకు బోధ చేయుమని ప్రార్థించి తేనే కృష్ణుడు అర్జునునకు బోధచేయుట కవకాశము కల్గును. అట్టి పరిస్థితి అర్జునునికి వచ్చుటెట్లు ?
అర్జునునకు యేదోవిధముగా విషాదము కల్గినగాని దానిలోనుండి బయటపడుటకు కృష్ణుని ప్రార్థించుట సంభవించదు. విషాదము కలుగుటకు తగిన పరిస్థితులు అర్జునునకు ఏర్పడవలయును.
అర్జునునకు యుద్ధపరాక్రమము అసదృశమగుటచే ఎవరిని చూచినను భయము కలుగనేరదు. ఇంక విషాద మెట్లు కలుగును? భీష్మద్రోణాదులను సేనలో తన కెదురుగా జూచినయెడల వారు తనకన్న గొప్పవారలును, గురువులును అగుటచేత భయము కలుగవచ్చునుకదా? అని అంటే, అట్టి భీష్మద్రోణసహిత కౌరవులందరిని ఉత్తర గోగ్రహణములో ఒక్కడే నిర్భయముగా, నిర్దాక్షిణ్యముగా, భీష్మద్రోణులు గురువులని ఆలోచించకుండా, అందరితోను యుద్ధముచేసి అందరిని ఓడించినాడే. ఇపుడు యుద్ధములో కృష్ణుని సహాయమైనను ఉన్నది; అప్పుడో, కృష్ణుని సహాయము లేకపోగా, అతి పిరికిపంద అయిన ఉత్తరకుమారుని, నిరుత్సాహ వాక్యములు వెనుకకు లాగుచుండినవిగదా ? ఇంకను యిపుడు యుద్ధములో కర్ణుడు పాల్గొనుటలేదు. అప్పుడు భీష్మద్రోణాదులేగాక కర్ణుడుకూడా యుద్ధములో పాల్గొనినాడు. ఇట్లు యిప్పటికన్న అప్పుడు ఎన్నోవిధముల విషమపరిస్థితులు ఉండి యున్ననూ అర్జునుడు ఎట్టి భయమునుగాని, విషాదమును గాని పొందకుండా, ఒక్కడే ఎంతో ధైర్యముతో యుద్ధము జేసి, భీష్మ ద్రోణ కర్ణ దుర్యోధనాదుల నందరిని గూడ ఓడించినాడే, అట్టి పరిస్థితులలోనే ఎట్టి విషాదమునుపొందని అర్జునుడు కృష్ణుని సహాయముగూడ యున్న ఈ యుద్ధ సమయములో ఎట్లు విషాదమును పొందగలుగును!
మరియు పాశుపతాస్త్ర స్వీకారసమయమున పరమేశ్వరునితో కూడ యుద్ధముచేయుటకు ఏమాత్రమును వెనుదీయ లేదే ? నిర్దాక్షిణ్యముగా, ఖాండవవనమును దహించినాడే, ఇంతకు పూర్వము ఎన్నోసార్లు యుద్ధములో నిర్భయముగా క్షత్రియ పౌరుషముతోను, ప్రావీణ్యముతోను పాల్గొని అపజయమనగా యెట్టిదో యెరుగని అసదృశ పరాక్రమశాలి అయిన అర్జునునికి యీ కురుక్షేత్ర యుద్ధములో విషాదము కలుగుటకు అవకాశ మేదియు కనబడుట లేదే ? విషాదము కలిగిన గాని కృష్ణుని గురువుగా స్వీకరించుటకుగాని బోధ చేయమని ప్రార్థించుటకుగాని అవకాశ ముండనేరదుగదా? అట్లు అడిగిన గాని కృష్ణుడు చెప్పగూడదుగదా ? ఇవన్నియు కృష్ణుడు మనస్సులో నుంచుకొని ఉభయసేనలమధ్యను రథమును నిలుపుమని అర్జునుడు కోరగా, కృష్ణుడు రథమును ఉభయసేనలమధ్యకు పోనిచ్చి, సాక్షాత్ భీష్మద్రోణుల యెదుటనే నిలిపి, వారిద్దరిని చూడగనే అర్జునునకు విషాదము కలుగునట్లు అర్జునుని మనస్సును తాను అంతర్యామిగా నుండి మార్చివేసినాడు.
అట్లు మార్చుటచేత అర్జునునకు భీష్మద్రోణులను జూడగానే పువ్వులతో పూజింపవలసిన వీరిద్దరిని ఎట్లు బాణములతో కొట్టగలను? ఇది చాలా పాపకార్యముగదా? ఈయుద్ధములో వీరు అందరు మరణించుదురే! వీరందరిని చంపిన పాపము నాకు సమకూడును గదా! అనుభావపరంపర పొంగి అర్జునుని విషాదములో ముంచి వేసినది. అంతట త్రోవ తెన్ను గానక ధైర్యము చెడి మూఢత్వ మావరింప ‘యచ్ఛ్రేయస్యా న్నిశ్చితంబ్రూహితన్మే శిష్యస్తేహం శాధిమాంత్వాం ప్రపన్నం’ అని కృష్ణుని కాళ్ళు బుచ్చుకుని శరణుజొచ్చి తనకు శ్రేయోమార్గమును బోధింపుమని ప్రార్థించెను. అంతట కృష్ణుడు గీతను అర్జునునికి బోధించి అర్జునుని ద్వారా గీతను అవతరింపజేసెను.
దీనిని బట్టిచూడగా అర్జునునికి కలిగినవిషాదము సహజము కాదనిన్నీ, కృష్ణుని ప్రేరణచే కలగినదగుటవల్ల ఆగంతుకమనిన్నీ విశదమగుచున్నది. అర్జునుని విషాదము ఆగంతుకము గనుకనే, కృష్ణుని బోధవల్ల నశించుట సంభవించినది. మరియు గీత 1 వ అధ్యాయము 28 వ శ్లోకములో ‘కృపయా పరయా7విష్టఃవిషీదన్’ అన్నిన్నీ 2 వ అధ్యాయము 1 శ్లోకములో ‘కృపయాచిష్టం విషీదం తం’ అనిన్నీ కృపను కర్తగాను అర్జునుని కర్మగాను వర్ణించుటవల్ల అర్జునునిలో కృప ప్రవేశించినదనిన్నీ అందుచేత అర్జునునికి విషాదము కలిగిన దనిన్నీ వ్యక్తమగుటచేతకూడా కృపయు తద్ద్వారా విషాదమున్ను ఆగంతుకములని స్పష్టమగుచున్నవి. ఇట్లు కృష్ణుడు లోకములోని ప్రజలందరినీ విజ్ఞానభిక్షద్వారా, తరింపజేయదలచుకొని అర్జునుని, నిమిత్తముగా పెట్టుకొని అతనిద్వారా గీతను అవతరింపజేసినాడు.
అంతకు పూర్వము త్రేతాయుగములో రామాయణము కూడా ఇటులనే అవతరించినది. కైకకు తనకన్న కుమారుడైన భరతునికంటె సవతికుమారుడైన రాముని యందు ఎక్కువ ప్రేమయున్నదని కైక చెప్పుటయేగాక, కౌశల్యయు రాముడు కూడ అటులనే వక్కాణించి యున్నారు. అట్లు రామునియందు మిక్కుటమై, అసదృశ##మైన ప్రేమగల కైక రాముని పట్టాభిషేకమును విఘ్నము జేసి రాముని అడవికివెళ్ళమనుట అసంభవముకదా ! రాముడు సీతతో గూడ అడవికి వెళ్ళినగాని రావణుడు సీతను అపహరించుట సంభవించదు. అట్లు రావణుడు సీతను అపహరించని పక్షమున రావణుని రాముడు సంహరించుట సంభవించదు. రావణుని సంహరించి దుష్టశిక్షణ మొనరించి శిష్టుల రక్షించుటకుగదా రామునియొక్క అవతారోద్దేశ్యము అట్టియుద్దేశ్యము నెరవేరవలెనన్న రావణుడు వధార్హు డగుటకు సీతను యెత్తుకు పోవలసియున్నది. సీతారాములు తమ దివ్యసౌధములలో నివశించు పక్షమున రావణుడు సీత నపహరించుట సంభవించనేరదు.
అందుకని సీతారాములు అరణ్యవాసము చేయుట అవసరమైనది. పట్టాభిషేకము సవ్యముగా నెరవేరినచో రామునికి అరణ్యవాసము సంభవించనేరదు. అందుకని దేవతలందరు ఇవన్నియు ఆలోచించుకొని రాముని పట్టాభిషేకము విఘ్నము చేయుటకుగాను కైక మనస్సులో సరస్వతీదేవిని ప్రవేశ##పెట్టి ఆమెద్వారా రామునికి పట్టాభిషేకము గాకుండా, అరణ్యవాసమగునట్లు ప్రేరేపించినారు. దీనినిబట్టి కైకకు రామునియందు కనబడిన ద్వేషము సహజము కాదనిన్నీ, ఆగంతుక మనిన్నీ స్పష్టమగుచున్నది. భరతునికి పాదుకలిచ్చు సమయములో రాముడు కైకయొక్క పవిత్రభావమును స్పష్టముగా ఉద్ఘాటించి యున్నాడుగదా ! లోకములో ప్రజలకందరికి ధర్మమార్గమును బోధించుటకై కైకకు రామునియెడల ద్వేషమును కల్పించి రామాయణమును అవతరింపజేసినట్లుగా, లోకములోని ప్రజలకందరికీ జ్ఞానమార్గమును బోధించుటకై అర్జునునికి విషాదమును కల్పించి, దానిద్వారా భగవద్గీతను శ్రీకృష్ణుడు అవతరింప జేసినాడు.ఇదియే గీతావతరణ రహస్యము
అందుకనే శంకరభగవత్పాదులవారు తమ గీతా భాష్యములో “సర్వలోక సంగ్రహార్థం అర్జునం నిమితీకృత్య అహా భగవాన్ వాసుదేవః అశోచ్యాన్ ఇత్యాది” అనగా లోకములోని ప్రజలందరినీ గీతాబోధవల్ల తరింపచేయుటకు గాను అర్జునుని నిమిత్తముగా పెట్టుకొని కృష్ణుడు గీతాబోధను గావించినాడు. అని విశదీకరించినారు.మరియు
శ్లో . సర్వోపనిషదోగావః దోగ్ధా గోపాల నందనః |
పార్ధోవత్సః సుధీః భోక్తాః దుగ్ధం గీతామృతం మహత్||
అను ప్రమాణమును బట్టిగూడా పైభావము విశదమగుచున్నది. ఆ శ్లోకార్థమేమనగా – ఉపనిషత్తులన్నియు ఆవులనియు, ఆ ఆవులపాలు పితుకువాడు కృష్ణుడనియు అర్జునుడు దూడ అనియు ఆ ఆవులనుండి పితుక బడిన పాలు గీతామృతమనియు, ఈ గీతామృతమను పాలను త్రాగి అనుభవించువారు ఆధ్యాత్మిక చింతగల జిజ్ఞాసువులు ముముక్షువులనియు విశదమగుచున్నది. ఆవునుండి పాలు రావలెనన్న పాలు చేపు వచ్చుటకు గాను దూడ అవసరమై యున్నదేగాని పాలన్నింటిని దూడ త్రాగుటకుగాదు. దూడ త్రాగెడిపాలు మూడు నాల్గు గ్రుక్కలు మాత్రమే. మిగతా పాలు ఇతరుల అనుభవమునకే. అటులనే ఈగీతామృతమును పాలలో దూడవంటి అర్జునున కుపయోగించు భాగము స్వల్పమే. మిగతా దంతయు ముముక్షువులగు ప్రజలందరి అనుభవముకొరకే అని తేలుచున్నది. దీనిని బట్టిగూడ గీతావతరణము ప్రధానముగా లోక సంగ్రహణార్థమనిన్నీ అట్టి అవతరణమునకు అర్జునుడు నిమిత్తమాత్రుడు అయినాడనిన్నీ స్పష్టమగుచున్నది.
ఇంకను గీతావతరణము యుద్ధసమయమున సంభవించుటలో ఔచిత్యమేమి ? అను సంశయము కలుగవచ్చును. దీనికి జవా బేమనగా – అన్నమును ఎప్పుడు తినవలెను అను ప్రశ్నకు ఆకలి ఎప్పుడైతే అప్పుడే అన్నము తినవలెను అను జవాబువలె, ఆధ్యాత్మిక ఆకలి ఎప్పుడు కలిగితే అప్పుడు ఆధ్యాత్మికాహారమైన గీతామృతము అవుసరమగును. అట్టి ఆధ్యాత్మిక ఆకలి అర్జునునకు యుద్ధారంభములో కలిగి కృష్ణునితో అట్టి పరిస్థితిని వ్యక్తము చేయుటచేత, అప్పుడే గీతామృతమును కృష్ణుడు అర్జునకు అందించినాడు. దానితో అర్జునుని ఆధ్యాత్మిక క్షున్నివారణ అయి యుద్ధముచేయ సమర్ధుడైనాడు కనుగ ఆ సమయములో గీతను అవతరింప చేయుటలో అనౌచిత్యము లేకపోగా ఔచిత్యము ఎంతో చక్కగా విరాజిల్లుచున్నది.