-రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించాలి
-ఒడిశా నైని బొగ్గు బ్లాక్ ను ప్రారంభించేందుకు ఫోకస్ పెట్టండి
-కార్మికుల సంక్షేమాన్ని విస్మరించొద్దు
-రాష్ట్ర సచివాలయంలో సింగరేణి లోని అన్ని విభాగాల అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష
వేసవిలో విద్యుత్ కొరత రాకుండా రాష్ట్రంలో అన్ని థర్మల్ కేంద్రాలకు, ఇతర రాష్ట్రాల్లోని థర్మల్ కేంద్రాలకు బొగ్గును నిరంతరాయంగా ఉత్పత్తి చేసి రవాణా చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో సింగరేణి లోని అన్ని విభాగాలపై సమగ్రంగా ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
సింగరేణి ఉపరితల భూగర్భగనులు మరియు నూతన ప్రాజెక్టులు, సింగరేణి థర్మల్ ప్రాజెక్టు మరియు సోలార్ ప్రాజెక్టులు, మిషనరీ వినియోగం, బొగ్గు మార్కెటింగ్, రవాణా పై ఆయా విభాగాల డైరెక్టర్ల ద్వారా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలు తెలుసుకున్నారు.
అలాగే సంస్థ ఆర్థిక స్థితిగతులు, ఉద్యోగ కల్పన, కార్మిక సంక్షేమం, సిఎస్ఆర్ నిధుల కేటాయింపు తదితర అంశాల పైన సమీక్షించారు. 2023- 24 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలు ఇప్పటి వరకు సాధించిన ప్రగతి గురించి అధికారులు వివరించారు.
తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం వేలం పెట్టిన బొగ్గు బ్లాకుల వివరాలు గురించి క్షుణ్ణంగా తెలుసుకుని దానిపై చేపట్టాల్సిన కార్యాచరణ గురించి దిశ నిర్దేశం చేశారు. అదే విధంగా ఒడిశాలో సింగరేణి కాలరీస్ సంస్థకు కేటాయించిన నైని బొగ్గు బ్లాకు ప్రారంభించడానికి ఎదురవుతున్న అవాంతరాలపై చర్చించారు. ఒడిశా నైనీ బ్లాకులో బొగ్గు ఉత్పత్తి కోసం కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ మరియు ఒడిషా ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ సమస్య పరిష్కారం దిశగా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కావలసిన సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా అధికారులకు వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో బొగ్గు బ్లాక్ లను వేలం వేయడాన్ని అన్ని కార్మిక సంఘాలు సంయుక్తంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో దీని పైన సంస్థకు మేలు జరిగేలా విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని డిప్యూటీ సీఎంకు అధికారులు విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో సింగరేణి ని మరింత విస్తరించడానికి బొగ్గు మైనింగ్ కాకుండా ఇతర ఖనిజ అన్వేషణకు రూపొందించిన ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా అని అధికారులను అడిగారు. రాష్ట్ర విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని పేర్కొనడంతో సంబంధిత అధికారుల సూచనల మేరకు బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సాధ్యా సాధ్యాలపై అధ్యయనం చేయడం జరిగిందని వివరించారు.
కార్మిక సంక్షేమంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టండి
సింగరేణి కాలరీస్ సంస్థలు పనిచేస్తున్న కార్మికుల సంక్షేమం పైన ప్రత్యేక దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు. రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించాలని ఆయన ఆదేశించారు. కార్మికులకు సంస్థ ద్వారా అందిస్తున్న అలవెన్స్ లు, వైద్య సదుపాయం అందిస్తున్న ఇతర సంక్షేమ కార్యక్రమాల గురించి ఆరా తీశారు. కారుణ్య నియామకాల నియామకాల కోసం జరుగుతున్న మెడికల్ బోర్డు ప్రక్రియ గురించి కులంకుశంగా తెలుసుకున్నారు.
ఈ సమావేశంలో ఆ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. శ్రీధర్ ఐఏఎస్, డైరెక్టర్లు ఎన్.బలరామ్ (పర్సనల్, ఫైనాన్స్), డి.సత్యనారాయణ రావు (ఈ అండ్ ఎం), ఎన్ వి కె శ్రీనివాస్ (ఆపరేషన్స్), జి వెంకటేశ్వర్ రెడ్డి (ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్), ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూమెంట్) జి.ఆల్విన్, జనరల్ మేనేజర్ (కో ఆర్డినేషన్) శ్రీ ఎం.సురేష్, వివిధ విభాగాల జనరల్ మేనేజర్లు పాల్గొన్నారు.