– కేంద్ర మంత్రి నుండి సంయిక్తంగా దృవీకరణ అందుకున్న రేఖారాణి, నాగరాణి
డిల్లీ: నరసాపురం లేస్ కు భౌగోళిక సూచిక (జిఐ) ధృవీకరణ అందుకోవటం సంతోష:గా ఉందని రాష్ట్ర్ర చేనేత జౌళి శాఖ కమీషనర్ రేఖారాణి, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. భౌగోళిక సూచితో అంతర్జాతీయ గుర్తింపు సాధించినట్లు అయ్యిందన్నారు. కేంద్ర ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో చేనేత ఎగుమతి ప్రమోషన్ కౌన్సిల్ సహకారంతో సోమవారం న్యూఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ చేతుల మీదుగా వీరిరువురు సంయిక్తంగా భౌగోళిక సూచి దృవీకరణ పత్రాన్ని అందుకున్నారు.
కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక ఉత్పత్తుల ప్రోత్సాహం, మార్కెట్ లింకేజి, బ్రాండింగ్ ప్రమోషన్ లక్ష్యంగా జౌళి ఉత్పత్తులపై అంతర్జాతీయ స్ధాయి వర్క్‌షాప్‌ని నిర్వహించారు. ఈ సందర్భంగా రేఖారాణి మాట్లాడుతూ దేశీయ జౌళి పరిశ్రమలో అంతర్ భాగంగా చేతితో నేసిన, తయారు చేసిన వస్త్రాలు భౌగోళిక సూచిక నమోదిత ఉత్పత్తులలో అగ్రగామిగా ఉన్నాయన్నారు. జిఐ ట్యాగ్ చేయబడిన ఉత్పత్తులతో వేలాది మంది నేత కార్మికులు, కళాకారులకు ప్రోత్సాహం ఇవ్వగలుగుతామని వివరించారు. స్థిరమైన మార్కెట్ అనుసంధానాన్ని అందించడానికి ఈ గుర్తింపు ఉపకరిస్తుందన్నారు.
దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 8 జౌళి చేతి ఉత్పత్తుల్లో పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం లేసుకు జిఐ గుర్తింపు లభించటంలో కార్మికులు, ఉత్పత్తి దారులు ఎగుమతి దారుల నిరంతర కృషి దాగి ఉందని కలెక్టర్ నాగరాణి వివరించారు. “నరసపూర్ క్రోచెట్ లేస్ ప్రొడక్ట్స్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్” కు కేంద్ర జౌళి శాఖ నుండి జిఐ సర్టిఫికేట్‌ను అందుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. అంతర్జాతీయ గుర్తింపుతో పాటు, రాష్ట్రంలో జిఐ గుర్తింపు పొందిన ఉత్పత్తుల్లో ఒకటిగా నిలవడానికి కారణమైన వారందరికీ ఈ గుర్తింపు మరింత భరోసాను ఇస్తుందన్నారు.
వర్క్ షాపులో భాగంగా భౌగోళిక సూచి రావటానికి ముందు, తరువాత అన్న అంశాలపై లోతైన చర్చ సాగిందని, ఫలితంగా ఈ ఉత్పత్తుల అభివృద్ధికి రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేసే దిశగా అడుగులు పడ్డాయన్నారు. కార్యక్రమంలో :హస్త కళల ఎగుమతుల ప్రోత్సాహక సంస్ధ నుండి అంతర్జాతీయ లేస్ ట్రేడ్ సెంటర్ కన్వీనర్ కెఎన్ తులసీ రావు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సీనియర్ అధికారులు, ఎగుమతిదారులు, వాటి సంస్థలు, నమోదిత యజమానులు, జిఐ యొక్క అధీకృత వినియోగదారులు, ఈపీసీల ప్రతినిధులు, పౌర సమాజ సంస్థలు, పరిశోధనా సంస్థలు పాల్గొన్నాయి.