Suryaa.co.in

Andhra Pradesh

వాకపల్లి బాధితులకు రూ. కోటి ఇవ్వండి

బాలకోటయ్య, షుబ్లీ, ఆంజనేయులు డిమాండ్

16 ఏళ్ల క్రితం ఉమ్మడి విశాఖ జిల్లా వాకపల్లిలో 11మంది గిరిజన మహిళలపై 13 మంది గ్రేహాండ్స్ పోలీసులు చేసిన దారుణ అత్యాచారం సంఘటనలో ఒక్కో బాధిత కుటుంబానికి రూ. కోటి పరిహారం ఇవ్వాలని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య, మైనార్టీ హక్కుల పరిరక్షణ కమిటీ అధ్యక్షులు ఫరూక్ షుబ్లీ, ఎపిసిఎల్ సి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి టి. ఆంజనేయులు సంయుక్తంగా డిమాండ్ చేశారు. శుక్రవారం బహుజన ఐకాస ఉపాధ్యక్షులు మామిడి సత్యం అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా బహుజన ఐకాస అధ్యక్షులు బాలకోటయ్య మాట్లాడుతూ అత్యాచారానికి గురైన బాధితులు చేసిన సుదీర్ఘ పోరాటం ఫలితంగానే, న్యాయస్థానాల ఆదేశాలతో విచారణ కొనసాగిందన్నారు. దర్యాప్తు అధికారుల ఘోర వైఫల్యం కారణంగా కోర్టులో కేసు వీగిపోయిందని, పోలీసులు నిర్దోషులుగా బయట పడ్డారని తెలిపారు.

విచారణ అధికారిపై కోర్టు కన్నెర్ర చేసిందని, చర్యల కోసం ఎఫెక్స్ కమిటీకి సిఫార్సు చేసిందని, బాధితులకు పరిహారం ఇవ్వాలని తీర్పు ఇచ్చినట్టుగా చెప్పారు. ప్రభుత్వాలు పేదలకు ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయం అన్న రీతిలో వ్యవహరిస్తున్నందునే మాయని మచ్చగా ఉన్న అత్యాచార సంఘటనలకు కూడా న్యాయం జరగటం లేదన్నారు. రాష్ట్రంలో నాలుగేళ్లుగా ఎస్సీ, ఎస్టీ సంఘటనపై జరుగుతున్న దాడులు,హత్యలు, అత్యాచారాల సంఘటనలో దర్యాప్తు సంస్థలు ప్రభుత్వం వైపు మొగ్గుచూపి, ప్రజాస్వామ్యాన్ని అపహాశ్యం చేస్తున్నట్టు ఆయన ఆరోపించారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు దాదాపు అన్ని కులాలపై 1500 సంఘటనలు జరిగాయని, ఎపీలో ఐపిసి కోడ్ వైసీపీ కోడ్ గా పనిచేస్తుందని ఆరోపించారు. నా ఎస్సీ,నా ఎస్టీ అంటున్న ముఖ్యమంత్రి తన తండ్రి హయాంలో జరిగిన వాకపల్లి బాధితులకు కోటి పరిహారం ఇచ్చి ప్రాయచిత్తం చెల్లించుకోవాలని హితవు పలికారు. మైనార్టీ హక్కుల పరిరక్షణ కమిటీ అధ్యక్షులు ఫరూక్ షుబ్లీ మాట్లాడుతూ జగనన్నకు చెబుదాం,జగనన్నే మా భవిష్యత్తు వంటి మోసపూరిత కార్యక్రమాలకు కాలం చెల్లిందని అన్నారు.

నాలుగేళ్లుగా రాష్ట్రంలో జరిగిన ఘోరాలు, నేరాలపై ఎంత చెప్పినా, చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని ఆరోపించారు. ఎపిసిఎల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి టి. ఆంజనేయులు మాట్లాడుతూ గిరిజన మహిళలపై జరిగిన అత్యాచారం సంఘటనలో దర్యాప్తు అధికారులు పూర్తిగా విఫలమయ్యారన్నారు. చరిత్రలో ఇలాంటి సంఘటనలు మాయని మచ్చగా మిగిలిపోతాయని తెలిపారు.సమావేశంలో బిసి నాయకులు వజ్రాల రవిశంకర్ , రెల్లి సంక్షేమ సంఘం అధ్యక్షులు సిరంశెట్టి నాగేంద్ర రావు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE