ఎంపీ గోరంట్ల గోబ్యాక్‌ అంటూ తెదేపా శ్రేణుల ఆందోళన

హిందూపురంలో వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ను తెదేపా శ్రేణులు అడ్డుకున్నారు.ఎంపీ గోరంట్ల గో బ్యాక్ అనే నినాదాలతో హోరెత్తించారు. దీంతో వైకాపా శ్రేణులు ప్రతి నినాదాలతో రెచ్చిపోయారు. ఫలితంగా ఉద్రిక్తత నెలకొంది.

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం సంతేబిదనూరు గేటు వద్ద ఉద్రిక్తత తలెత్తింది. స్వాంతంత్య్ర వేడుకల్లో పాల్గొని తిరిగి వెళ్తున్న ఎంపీ గోరంట్ల మాధవ్‌ను అడ్డుకునేందుకు తెలుగుదేశం కార్యకర్తలు అక్కడికి చేరుకోగా.. విషయం తెలుసుకున్న వైకాపా శ్రేణులు సైతం చేరుకుని తెదేపాకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఇరువర్గాలూ పోటాపోటీ నినాదాలు చేసుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.దీంతో హిందూపురం- బెంగళూరు వెళ్లే ప్రధాన రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు తెలుగుదేశం శ్రేణులను అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు.