Suryaa.co.in

National

భగ్గుమన్న బంగారం

– లక్ష మార్కు దిశగా బంగారం
– బంగారం బాటలోనే వెండి

ఢిల్లీ: అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల కారణంగా బంగారం ధర మళ్లీ పెరిగింది. ఢిల్లీలో బుధవారం ఒక్కరోజే 10 గ్రాముల మేలిమి బంగారం ధర ఏకంగా రూ. 1,910 పెరిగి రూ.98,450కి చేరి, లక్ష రూపాయల దిశగా పయనిస్తోంది. మంగళవారం నాటి ముగింపు ధర రూ.96,540గా ఉంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో సాయంత్రం ఏడు గంటల సమయానికి పది గ్రాముల పసిడి ధర రూ.98 వేల పైనే నమోదవుతోంది.

కిలో వెండి ధర రూ.1,660 పెరిగి రూ.99,160కి చేరుకుంది. మంగళవారం దీని ధర రూ.97,500 వద్ద ముగిసింది. అంతర్జాతీయ స్పాట్ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 3,311 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

అమెరికా కరెన్సీ డాలర్ విలువ బలహీనపడటం బంగారానికి డిమాండ్ పెంచుతోందని అబన్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చింతన్ మెహతా తెలిపారు. ఆర్థిక లోటు కారణంగా యూఎస్ క్రెడిట్ రేటింగ్‌ను ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ తగ్గించడం కూడా ప్రభావం చూపిందని అన్నారు.

ఈ పరిణామం అమెరికా ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాలిక స్థిరత్వంపై అనిశ్చితిని పెంచిందని, దీంతో పెట్టుబడిదారులు బంగారం వంటి సురక్షిత పెట్టుబడి సాధనాల వైపు మొగ్గుచూపుతున్నారని తెలిపారు. ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడి చేసే అవకాశం ఉందన్న వార్తలు కూడా మార్కెట్‌లో భయాలను రేకెత్తించాయని కోటక్ సెక్యూరిటీస్‌లో అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ కైనత్ చైన్వాలా పేర్కొన్నారు.

LEAVE A RESPONSE