– నాడు చారు మజుందార్.. నేడు నంబళ్ళ కేశవరావు
– నంబళ్ళ కేశవరావు ఉద్యమ ప్రస్థానం
హైదరాబాద్: సిపిఐ మావోయిస్టు ప్రధాన కార్యదర్శి కా. నంబల్ల కేశవ రావు @ బసవ రాజు ఉద్యమ ప్రస్థానం చాలా గొప్పగా కొనసాగింది.2018 నుండి ఎన్ కౌంటర్ లో మరణించే వరకు ఏడేళ్ళ పాటు కా. బిఆర్ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించాడు.
అప్పటి వరకు కా. బిఆర్ 2001 లో గత పీపుల్స్ వార్ పార్టీలో సెంట్రల్ మిలిటరీ కమిషన్ (సిఎంసి) ఏర్పాటు చేసినప్పటి నుండి దానికి బాధ్యుడిగా ఉన్నాడు. 2004 లో సిపిఐ మావోయిస్టు ఏర్పడినప్పుడు కూడా సిఎంసి బాధ్యుడిగానూ, పొలిట్ బ్యూరో సభ్యుడిగానూ బాధ్యతలు నిర్వర్తిస్తూ విప్లవోద్యమానికి నాయకత్వం వహించాడు.
1973-74 లో ఆర్‌ఈసి లో విప్లవ విద్యార్థిగా ప్రస్థానం మొదలు పెట్టినప్పటి నుండి వెనక్కు తిరిగి చూడలేదు. ఆయన వరంగల్ లో ఏబివిపి , మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా మిలిటెంట్ గా పోరాడటంలో చాలా ముఖ్యమైన పాత్ర వహించాడు. ఆర్‌ఈసి అంటే రాడికల్ ఇంజనీరింగ్ కాలేజ్ అని పేరు తెచ్చుకోవడంలో ఆయనది కూడా గణనీయమైన పాత్ర.
ఎమర్జెన్సీలో విప్లవకారులందరి మీద నిర్బంధం ప్రారంభం కావడంతో ఆయన అజ్ఞాత జీవితాన్ని ఎంచుకున్నాడు. అప్పటి నుండి ఆయన ఇక వెనుతిరిగింది లేదు. వరంగల్ లోనే అజ్ఞాత జీవితం గడిపిన కాలంలో వరంగల్ హమాలీలను ఆర్గనైజ్ చేయడానికి ఆయన కొన్ని నెలల పాటి హమాలీగా పనిచేశాడు.
1980 లో అడవిలోకి దళాలను పంపాలని పార్టీ నిర్ణయం తీసుకున్నప్పుడు తూర్పు గోదావరి జిల్లాకు పంపిన మొదటి దళానికి కమాండర్ గా గంగన్న పేరుతో ఆయన వెళ్ళాడు. ఆ తర్వాత అంచలంచెలుగా దండకారణ్య ఉద్యమ నిర్మాణంలో ఆయన భాగమయ్యాడు. మొదట ఫారెస్ట్ లయజన్ కమిటీలో ఆ తర్వాత దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలోకి ఎన్నుకోబడ్డాడు. ఆ తరువాత కొన్ని ఏళ్ల పాటు గంగన్న పేరుతోనే దండకారణ్య కమిటీ కార్యదర్శిగా పనిచేశాడు.
1986 లో ఒక సారి ఆయన ఒక అపాయింట్మెంట్ కు వెళితే ఆ విషయం తెలిసి ఆయనను పట్టుకోవడానికి ఎస్‌టిఎఫ్ పోలీసులు అక్కడ మాటు గాచి ఆయనను పట్టుకోగానే వారిని కొట్టి, వారిపై ఫైర్ చేసి అక్కడి నుండి తప్పుకున్నాడు. అప్పటి నుండి ఈ రోజు దాకా ఇక మరి పోలీసుల చేతికి చిక్క లేదు.
భారత విప్లవోద్యమం సాధించిన అనేక సైనికపరమైన విజయాలకు సిఎంసి నాయకుడిగా ఆయన ప్రత్యక్ష సారధి. 1995 లో ఉన్నత సైనిక ఫార్మేషన్ లు ఏర్పాటు చేయడంలో, 2000 లో పీపుల్స్ గెరిల్లా ఆర్మీ, 2004లో పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీని ఏర్పాటు చేయడంలో ఆయనది కూడా కీలక పాత్ర. ఈ గెరిల్లా ఆర్మీ కి కమాండర్ గా ఆయన ఏపి, తెలంగాణ, బిహార్, ఝార్ఖండ్, దండకారణ్యమంతటా బలగాలకు శిక్షణ ఇవ్వడంలోనూ, సైనిక చర్యలలోనూ ఆయన ప్రత్యక్షంగా పాల్గొన్నాడు.
భారత దేశంలో ఎన్నో సార్లు అనేక ఎంఎల్ పార్టీలు విలీనం అయినా, అనేక రాజకీయ సమస్యలతో పాటు, నాయకత్వ సమస్యలతో కూడా కొట్టుమిట్టాడి మళ్ళీ చీలికలకు గురి అయ్యాయి. కానీ పీపుల్స్ వార్, పార్టీ యూనిటీలు విలీనం అయిన తరువాత అయినా, పీపుల్స్ వార్, ఎంసిసిఐ లు విలీనం అయినప్పుడైనా – కింది స్థాయిలో కొన్ని ఒడిదుడుకులు, అనైక్యతలు ఉన్నా, కేంద్ర స్థాయిలో బలమైన ఐక్యత సాధించడంలో మిగిలిన నాయకత్వ కామ్రేడ్స్ తో పాటు కా. బిఆర్ ది కూడా చాలా గొప్ప పాత్ర ఉంది.
దండకారణ్యంలో గెరిల్లా బేస్ లు ఏర్పాటు చేయాలని, ప్రజా రాజ్యాధికార సంస్థలను ఏర్పాటు చేయాలనే కీలక రాజకీయ నిర్ణయాలలో కా. బిఆర్ ఎంతో గొప్ప పాత్ర నిర్వహించాడు. విప్లవోద్యమం చాలా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో 65 ఏళ్ల వయసులో కా. బిఆర్ పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యాడు.
ఆ గడ్డు పరిస్తితి నుండి బయట పడటంలో పార్టీని ముందుకు నడిపించడానికి తన కొన ఊపిరి దాకా ఆ కామ్రేడ్ ప్రయత్నిస్తూ ఆ ప్రయత్నంలో భాగంగానే ఆ విప్లవ గడ్డ మీద పోరాడుతూనే, 72 ఏళ్ల వయసులో కా. బసవ రాజ్ అమరుడు అయ్యాడు. దోపిడీ పీడనలు లేని సమ సమాజాన్ని కాంక్షించి దాని స్థాపన కోసం యాభై ఏళ్ల పాటు నిర్విరామంగా కృషి చేసిన కా. బసవ రాజ్ పీడితుల గుండెల్లో సదా నిలిచే ఉంటాడు.కా. చారు మజుందార్ తరువాత పోలీసుల చేతిలో అమరుడైన పార్టీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ నంబల్ల కేశవ రావు.
– నినాదం సౌజన్యంతో