గ్రామ సర్పంచులు గౌరవంగా… తలెత్తుకొనే రోజు వచ్చింది. ఎంతో ఆనందంగా మూడు రంగుల జెండా ఎగురవేసే సమయం వచ్చింది.
ఎందుకూ అంటారా? ఏం ఇంతకాలం ఆనందంగా, గౌరవంగా జెండా ఎగురవేయలేదా అంటారా ఆగస్టు 15కీ, జనవరి 26కీ చేశారు. ఆ జెండా పండగకు అయిన ఖర్చు కోసం ప్రభుత్వం ఎంత ఇచ్చేదో తెలుసా వంద రూపాయలో, పెద్ద పంచాయతీ అయితే 250 రూపాయలో. 34 సంవత్సరాల కిందట నిర్ణయించిన మొత్తాలనే ఈ ఏడాది జనవరి 26 రిపబ్లిక్ డే వరకూ ఇచ్చారు. స్వాతంత్ర్య దినోత్సవానికీ, రిపబ్లిక్ డేకీ అయ్యే ఖర్చులకు ఎంతోకొంత సర్పంచుల జేబు నుంచో, అప్పోసప్పో చేసి కానిచ్చేవారు.
అయితే సర్పంచులు సగౌరవంగా జెండా ఎగురవేసేలా రాష్ట్రంలో ఎన్.డి.ఏ. ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. మైనర్ పంచాయతీలకు 10 వేల రూపాయలు, మేజర్ పంచాయతీలకు 25 వేల రూపాయలు ఇస్తున్నట్లు ప్రభుత్వం జీవో ఇచ్చింది.
గ్రామాల గురించి… గ్రామాల బాగోగుల గురించి నిరంతరం ఆలోచించే నాయకుడు ఉంటే మార్పులు ఎంతో సానుకూలంగా మొదలవుతాయనడానికి ఇదొక మచ్చుతునక. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లో గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనే తపన ఉంది. ఆయనే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి కావడం రాష్ట్రం అదృష్టం.
పల్లెలు అభివృద్ధి చెందాలంటే అక్కడి ప్రజల నుంచి ఎన్నికైన ప్రతినిధి ఎంతో ఉత్తేజంతో పని చేయాలి. ప్రజలకు సేవలందించాలి. గ్రామ ప్రథమ పౌరుడిగా గౌరవంగా ముందుకు వెళ్ళాలి. పంచాయతీలో సర్పంచ్ గౌరవాన్ని సూచించే వేడుకల్లో ప్రధానమైనవి స్వాతంత్ర్య దినోత్సవం, రిపబ్లిక్ డే.
గ్రామ ప్రథమ పౌరుడు సర్పంచ్ చేతుల మీదుగానే జెండా పండుగ నడుస్తుంది. ఆ వేడుక చేసేటప్పుడు అతను ఏ దశలోనూ ఇబ్బందిపడకూడదు…. ఊరంతా ఆ వేడుకలో భాగమై మన మువ్వన్నెల జెండాకు వందనం చేయాలని అని పవన్ కల్యాణ్ భావించారు.
కొద్ది రోజుల కిందట కొందరు సర్పంచులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని కలిశారు. ఆ సందర్భంలో వచ్చిన ప్రస్తావనే పంచాయతీల్లో ఆగస్టు 15, జనవరి 26 వేడుకల నిర్వహణ. ఈ వేడుకల కోసం తమకు ఇచ్చే మొత్తాలు ఎంత తక్కువో వారు చెప్పారు. తక్షణమే అధికారులతో మాట్లాడి వివరాలు పరిశీలించారు. 34 ఏళ్లనాడు నిర్ణయించిన మొత్తాలను ఇవ్వడం భావ్యం కాదని భావించి- ఇప్పటి అవసరాలకు అనుగుణంగా రూ.10 వేలు, రూ.25 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.
పవన్ కల్యాణ్ తీసుకున్న నిర్ణయం సహేతుకమైనదే. పల్లె పల్లెల్లో నేటి తరానికి… రేపటి పౌరులకు స్వాతంత్ర్య దినోత్సవ ప్రాధాన్యం… విశిష్టత తెలియాలంటే పంద్రాగస్టు పండగకు ముందు నుంచే గ్రామాల్లోనూ, అక్కడి పాఠశాలల్లోనూ ఒక ఉత్సాహం, ఉత్సవ ఏర్పాట్ల హంగామా ఉండాలి. అందు కోసమే విద్యార్థులకు వ్యాస రచన, క్విజ్, డిబేట్ లాంటి పోటీలు, ఆటల పోటీలను పంచాయతీల అధ్వర్యంలో చేపట్టమని చెప్పారు. ఇలా చేయడం ద్వారా విద్యార్థులలో ఆరోగ్యకరమైన పోటీ తత్వం, మన దేశం కోసం పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు తెలుస్తాయి. అలాగే పంచాయతీ ఆధ్వర్యంలో పోటీలు నడుస్తున్నాయి అంటే – వాళ్ళకీ స్థానిక సంస్థలు అంటే ఏమిటి? పంచాయతీలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలనే కుతూహలం మొదలవుతుంది.
క్రమంగా వాళ్ళకి స్థానిక సంస్థల పాలన, ప్రభుత్వ విధానాల గురించిన అవగాన ఏర్పడుతుంది.
ఆగస్టు 15నాడు గ్రామంలో ఉన్న స్వాతంత్ర్య సమరయోధులు, మిలట్రీలో చేసి వచ్చిన వారిని పంచాయతీ ఆఫీస్ కి ఆహ్వానించి సత్కరిస్తారు. వారితోపాటు పారిశుధ్య కార్మికులను గౌరవించుకుంటారు.
ఇలా అందరినీ ఒక వేదికపైకి తీసుకురావడం ద్వారా పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేసుకొనే అవకాశం ఏర్పడుతుంది.
పవన్ కళ్యాణ్ తీసుకున్న ఒక గొప్ప నిర్ణయంతో అందరూ పల్లెల గురించీ, స్థానిక సంస్థల విలువ గురించీ మాట్లాడుకొనే సమయం వచ్చింది. భావి భారత పౌరులకు మన కోసం త్యాగాలు చేసుకొనేవారిని ఎంత శ్రద్ధగా స్మరించుకోవాలో తెలుస్తుంది. అంతే కాదు మన ముంగింట ఉన్న పాలన వ్యవస్థ అయిన పంచాయతీల గురించీ, వాటి పని తీరు గురించి కూడా తెలుస్తుంది.
అలాగే ప్రజలందరూ పంచాయతీలో జరిగే జాతీయ పండుగలో పాల్గొనడం ద్వారా తమ ఊరు బాగోగుల గురించి మాట్లాడుకొనే వేదిక లభిస్తుంది. ప్రజల గురించీ, పల్లెల గురించీ ఆలోచించే నాయకుడు ఉంటే – బహుముఖ ప్రయోజనాలు ఇచ్చేలా మంచి నిర్ణయాలు వెలువడతాయి. అవి సత్వరమే అమలవుతాయి. పవన్ కల్యాణ్ తీసుకున్న ఒక నిర్ణయం వెనక ఎన్ని ప్రయోజనాలు దాగి ఉన్నాయో అర్థమైంది కదా.
కచ్చితంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 13,326 గ్రామ పంచాయతీలకు మంచి రోజు వస్తున్నాయి. ఈ రోజు వచ్చిన జీవో అందుకు మొదటి మెట్టు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం ఆవిష్కారం అయ్యే సమయం వచ్చింది.