– రెవిన్యూ, రిజిస్ట్రేషన్లు & స్టాంప్స్ శాఖ మంత్రి సత్యప్రసాద్
అమరావతి: గత ప్రభుత్వ హయాంలో జరిగిన ల్యాండ్ గ్రాబింగ్ అంశం పునరావృతం కాకుండా ఉండేందుకై పేదవాడికి న్యాయం జరిగేలా ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని సవరించనున్నట్టు రాష్ట్ర రెవిన్యూ, రిజిస్ట్రేషన్లు, స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో సోమవారం జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. 1982 ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్టును అనుసరించి గుజరాత్ రాష్ట్రంలో కఠినమైన నియమ నిబంధనలు, జరిమానాలను రూపొందించామని చెప్పారు.
పేదవాడికి అన్యాయం జరుగకుండా ఉండేందుకు కఠినమైన నియమ నిబంధనలు, జరిమానాలతో ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్టును సవరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో దాదాపు తొమ్మిది లక్షల ఎకరాల ఎస్సైన్డు భూములను ఫ్రీ హోల్డుగా మార్చడమే కాకుండా దాదాపు 25 వేల ఎకరాలను రిజిస్ట్రేషన్ కూడా చేయించుకుందన్నారు.
ఈ అంశంపై కలెక్టర్లు అంతా ప్రత్యేక దృష్టి సారించి సామాన్య మానవుడికి న్యాయం జరిగే విధంగా ఈ వ్యవస్థను గాడిలో పెట్టాలని ఆయన కోరారు. ముఖ్యమంత్రి తో పాటు పలువురు మంత్రుల వద్దకు వచ్చే విజ్ఞప్తుల్లో 80 శాతం పైగా రెవిన్యూకు సంబంధించినవే అన్నారు. ప్రజల హక్కులను కాపాడే విధంగా రెవిన్యూ శాఖను ప్రక్షాళన చేయాలని, అధికారుల అంతా చట్టానికి లోబడి పనిచేయాలని ముఖ్యమంత్రి కోరుకుంటున్నారన్నారు. గత పాలకులు చేసిన అరాచకాలు బయటపడకుండా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లను దగ్ధం చేశారని గుర్తు చేశారు.
గత ముఖ్యమంత్రికి ఫొటోల పిచ్చి!
గత ముఖ్యమంత్రి ఫొటోల పిచ్చితో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ పాస్ పుస్తకాలపై తమ పొటోలను ముద్రించుకున్నారని
సత్యప్రసాద్ విమర్శించారు. గత ప్రభుత్వం ప్రారంభించిన రీ-సర్వేను కొనసాగించినా, నిలుపుదల చేసినా సమస్యలు ఎన్నో ఎదురవుతున్నాయని, ఈ విషయంలో గ్రామ సదస్సుల నిర్వహించి సమస్యల పరిష్కారానికి కృషి చేసేందుకు కలెక్టర్లు అంతా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రాష్ట్రంలో 77 లక్షల సరిహద్దుల రాళ్లు ఉన్నాయని, వాటిని కూడా సద్వినియోగం చేసుకునే విధంగా ప్రణాళికా బద్దంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్లను ఆయన కోరారు.