• అంకుడు, తెల్ల పొణికి చెట్లు విస్తారంగా పెంపు
• ఉపాధి హామీ పథకంలో అంకుడు, తెల్ల పొణికి పెంపునకు ఏర్పాట్లు
• ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ ఆదేశాలతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సన్నాహాలు
ఆంధ్ర ప్రదేశ్ హస్త కళల విశిష్టతను తెలిపే ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు రూపొందించే కళాకారులకు ఉప ముఖమంత్రి పవన్ కళ్యాణ్ శుభవార్తను అందించారు. ఏటికొప్పాక బొమ్మల తయారీకి ముడి సరుకు అంకుడు కర్ర, కొండపల్లి బొమ్మలకు అవసరమయ్యే తెల్ల పొణికి చెట్లను విస్తారంగా పెంచాలని అధికారులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ప్రస్తుతం ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మల తయారీదారులకు వారికి అవసరమయ్యే కర్ర లభ్యత కష్టంగా మారింది. ఆ చెట్ల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఈ సమస్యను పవన్ కళ్యాణ్ దృష్టికి ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మల కళాకారులు తీసుకువచ్చారు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆ కళాకారులకు అందుబాటులో ఉండేలా అంకుడు, తెల్ల పొణికి చెట్లు పెంచడానికి తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. ఉపాధి హామీ పథకం పనుల్లో భాగంగా అంకుడు, తెల్ల పొణికి చెట్లు పెంచాలన్నారు. అటవీ ప్రాంతాల్లోనూ… ఏటికొప్పాక, కొండపల్లి పరిసరాల్లో ఉన్న ప్రభుత్వ, అటవీ, సామాజిక స్థలాల్లో వీటి పెంపకంపై దృష్టి సారించాలన్నారు.
ఉప ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా అంకుడు, తెల్ల పొణికి చెట్లు పెంపకానికి రంగం సిద్ధమైంది. భవిష్యత్తు అవసరాలను పరిగణనలోకి తీసుకొని కనీసం రెండు మూడు తరాలకు సరిపడా చెట్లను పెంచేలా పి.ఆర్. అండ్ ఆర్.డి. సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు పి.ఆర్. అండ్ ఆర్.డి. కమిషనర్ కృష్ణ తేజ ఆదేశాలు విడుదల చేశారు.
ఆంధ్ర ప్రదేశ్ హస్త కళలను ప్రోత్సహించే దిశగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పలు చర్యలు తీసుకొంటున్నారు. రాష్ట్ర అతిథులను గౌరవపూర్వకంగా సత్కరించే సందర్భంలో అందించే బహుమతులగా ఆంధ్ర ప్రదేశ్ కళాకారులు తీర్చిదిద్దిన కళాకృతులను ఎంపిక చేసి వాటినే ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష నాయకుడిగా పర్యటనలు చేసిన సందర్భంలో ఏటికొప్పాక, కొండపల్లి కళాకారులు కలసి తమ సమస్యలు తెలుపుకొంటూ అంకుడు కర్ర, తెల్ల పొణికి కర్ర లభ్యత తగ్గిపోయిందని… ఆ ముడి సరుకు లేకపోతే బొమ్మలు చేయలేమని ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఏటికొప్పాక, కొండపల్లి హస్త కళాకారుల సమస్య తీర్చే దిశగా అడుగులు వేశారు. భవిష్యత్తులో కూడా వారు ముడి సరుకు కోసం ఇబ్బందులు ఎదుర్కొనకుండా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడుతున్నారు.