-మూడున్నరేళ్ళలో సంగం బ్యారేజీకి 20శాతం పనులను కూడా పూర్తి చేయలేకపోయారు
-10శాతం పనులు మిగిలుండగానే బ్యారేజీ ప్రారంభోత్సం
-జగన్ రెడ్డి అసమర్థత, కమీషన్ల కక్కుర్తితో నత్తనడకన జలవనరుల ప్రాజెక్టులు
– గోరంట్ల బుచ్చయ్య చౌదరి
ఇతరుల కష్టానికి పేర్లు మార్చి రిబ్బన్ కటింగ్ చేయడానికి జగన్ రెడ్డికి బుద్ధుండాలి. సంగం బ్యారెజీకి చంద్రబాబు నాయుడు 82.86 శాతం పనులు పూర్తి చేస్తే జగన్ రెడ్డి 20 శాతం పనులను కూడ పూర్తి చేయలేక పోయారని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి దుయ్యబట్టారు. మంగళవారం ఏర్పాటు చేసిన జూమ్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ…..
ఆంధ్రప్రదేశ్ లో జలవనరుల శాఖ నిద్రావస్ధలో ఉంది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడంతో ప్రాజెక్టులన్నీ నత్తనడకన సాగుతున్నాయి. 2008లో ప్రారంభమైన సంగం బ్యారెజ్ ప్రాజెక్ట్ 2014 దాకా ఒక్క అడుగు ముందుకు వేయని పరిస్థితి. 2015లో చంద్రబాబు నాయుడు ప్రాజెక్టులో మార్పులు, చేర్పులతో పనులు ముమ్మరం చేసి 82.86 శాతం పూర్తయ్యేలా చేశారు. నెల్లూరు బ్యారేజ్, సంగం బ్యారేజ్ కి సంబంధించి కేవలం 18.20శాతం పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. మూడున్నరేళ్లల్లో కేవలం 10 శాతం పనులు కూడా పూర్తి చేయకపోవడంతో అధిక వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు నీట మునిగిపోయాయి. లక్షల మంది ప్రజలు వీధి పాలయిన ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుగా లేదు.
2020 నవంబరు 11న సమీక్షా సమావేశంలో నెల్లూరు, సంగం బ్యారేజీలను 2021 జనవరిలో ప్రారంభించాలని ఆర్భాటంగా జగన్ రెడ్డి చెప్పారు. మూడేళ్లుగా ప్రాజెక్ట్ ల మీద సీత కన్నేసి నేడు రిబ్బన్ కటింగ్ చేస్తున్నా అని చెబుతున్నారు. రెక్కల కష్టం చంద్రబాబు నాయుడుది రిబ్బన్ కటింగ్ జగన్ రెడ్డిది. రివర్స్ టెండరింగ్ పేరుతో కాలయాపన చేసి కాంట్రాక్టర్లను మార్చి కమీషన్లు దండుకుంటున్నారు. రాయలసీమలో కృష్ణా జలాలు వృధాగా సముద్రంలోకి పోతున్నా దారి మళ్లించలేక పోయారు. సరైన నిర్వాహణ, మరమ్మత్తులు లేకపోవడంతో అనేక ప్రాజెక్టులు దెబ్బ తింటున్నాయి. గుండ్లకమ్మ ప్రాజెక్ట్ గేట్లకు మరమ్మత్తు చేయనందున నీరంతా సముద్రం పాలైంది. పులిచింతల గేట్ల పరిస్ధితి ఇదే విధంగా ఉంది. అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోతే నిర్వాసితులని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. సంగం బ్యారేజీ పూర్తితో పెన్నా డెల్టా, కనుపూరు, కావలి కాలువ కింద సాగులో ఉన్న దాదాపు 3.85 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందుతుంది. దాన్ని ఎందుకు మూడున్నరేళ్ళుగా పూర్తి చేయలేదు?
బ్యారేజీ పరివాహక ప్రాంతంలో రక్షణ గోడ నిర్మించక పోవడంతో జయలలితా నగర్, ఇస్లాం పేట, బుజ్జమ్మ డొంక, పొర్లుకట్ట, మన్సూర్ నగర్, పుత్తా ఎస్టేట్, శివగిరి కాలనీలు మునిగిపోయే ప్రమాదముందని తెలిసినా పట్టించుకోవడం లేదు. బ్యారేజీపై రవాణాకు వంతెన నిర్మించడంతో సంగం నుంచి పొదలకూరు, చేజర్ల, రాపూరు, వెంకటగిరి మండలాలకు రాకపోకలు వీలవుతుంది. అంతే కాకుండా బ్యారేజీ నీరు నిల్వ ఉండటంతో భూగర్భ జలమట్టం పెరిగి చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజల తాగునీటి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. నెల్లూరు బ్యారేజికి రూ.91 కోట్లు, సంగం బ్యారేజికి రూ.64 కోట్లు ఖర్చు చేయలేకపోయారు. నిధులు సకాలంలో వినియోగించి పనులు ముమ్మరం చేసుంటే ఏడాది లోపే ప్రాజెక్ట్ పూర్తి చేయొచ్చు కాని జగన్ రెడ్డి పట్టించుకోలేదు. నేటికి 10శాతం పనులు మిగిలి ఉండగానే బ్యారేజ్ ప్రారంభిస్తున్నారు. ప్రభుత్వం అసమర్ధత, అవినీతి వలన జలవనరులు మొత్తం కేంద్రం ఆధీనంలోకి చేరాయి.
జగన్ రెడ్డి తన ఈడీ కేసుల నుంచి బయటపడలానే ఉత్సాహంలో రాష్ట్ర ప్రయోజనాలపై కొంత శాతమైన శ్రద్ధ చూపించడం లేదు. తెలంగాణలోని తన సొంత ఆస్తులని కాపాడుకోవడం కోసం ఏపీ నీటి హక్కులన్నింటిని దఖలు పరుస్తున్నారు. నేడు రాష్ట్రంలోని అనేక ప్రాజెక్టులు మరమ్మత్తులు లేక మట్టికొట్టుకు పోతున్న పరిస్ధితి. అనేక సార్లు ఢిల్లీ వెళ్లి పోలవరం కోసం ఏం తీసుకొచ్చారు, ఏం సాధించారు? మెజార్టీ సీట్లు కట్టబెడితే కేంద్రం పై ఒత్తిడి తెచ్చి రాష్ట్రాన్ని, ప్రజలని అభివృద్ధి చేస్తున్నవి ఒట్టి మాటలు అనిపించే రీతిలో జగన్ రెడ్డి వైఖరి ఉంది. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా రూ. 55వేల కోట్లు పోలవరానికి అవసరం లేదని తప్పుడు ఆరోపణలు చేశారు. నేడు అదే రూ. 55వేల కోట్ల కోసం కేంద్రం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రాయలసీమకు నీటిని తరలించలేకపోయారు. పులిచింతల ఎత్తిపోతల పథకాన్ని నిలిపేవేశారు. పవర్ ప్రాజెక్ట్ నత్త నడకన నడుస్తుంది. ఉత్తరాంధ్రకి న్యాయం జరిగని పరిస్ధితి.
జగన్ రెడ్డి 3 ఏళ్లల్లో జల వనరుల ప్రాజెక్టులకు రూ. 17,534.31 ఖర్చు చేశారు. ఏడాదికి ఖర్చు చేసింది 5,844.77 కోట్లు మాత్రమే. చంద్రబాబు ఏడాదికి రూ.13,600 కోట్లు ఖర్చు చేశారు. చంద్రబాబు నాయుడు జలవనరుల ప్రాజెక్టుల కోసం 5 ఏళ్లల్లో 68,293 కోట్లు ఖర్చు చేసి 62 ప్రాజెక్టుల పనులు పరుగులు తీయించి 23 ప్రాజెక్టులను పూర్తి చేసి 32.02 లక్షల ఎకరాలకు ఆయకట్టు స్థిరీకరణ, 7 లక్షల ఎకరాలకు నూతన ఆయకట్టు అందిస్తే మీరు మాత్రం జల వనరుల ప్రాజెక్టులను నిర్వీర్యం చేసి చోధ్యం చూస్తున్నారు. పోలవరాన్ని గుదిబండగా మార్చారు, నిర్వాసితులని గంగలో కలుపుతున్నారు.
జగన్ రెడ్డి అసమర్ధ పరిపాలనతో రాష్ట్రం తీవ్రంగా నష్ట పోతుంది. పేర్లు మార్పు కాకుండా జగన్ రెడ్డి చేసిన నిర్వాకం ఏంటి? ప్రాజెక్ట్ పనులు అనేక చోట్ల నత్త నడకన సాగుతున్నాయి, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం లేదు. ఇకనైనా జగన్ రెడ్డి మేలుకొని సకాలంలో నిధులని వినియోగించి ప్రాజెక్టులని త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు, రైతాంగానికి నీటి సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు.