Suryaa.co.in

Political News

పాలకుడిని బట్టే…’ప్రభుతం’ !

‘యథా సీ. ఎం…తథా అధికార యంత్రాంగం!
*ఈ ప్రభుత్వానికి సిగ్గు లేదు …!
*ఈ ప్రభుత్వానికి శరం లేదు …!
*ఈ ప్రభుత్వానికి బుద్ధి లేదు …!
*ఇదొక దిక్కుమాలిన ప్రభుత్వం …!
*ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదు …!
*ఇదొక ఫ్యాక్షన్ ప్రభుత్వం …!
*ఇదొక దుర్మార్గపు ప్రభుత్వం …!
*ఇదొక నీతిమాలిన ప్రభుత్వం …!
దేశంలో గానీ , లేదా, రాష్ట్రాలలో గానీ ప్రతిపక్ష పార్టీల వారు మామూలుగా – ‘ప్రభుత్వ’వ్యవహార శైలిపై రొటీన్ గా వాడే భాష ఇది . మనం ఏరోజు పేపర్ తిరగేసినా… ఇటువంటి వాక్యం లాటి వాక్యం ఒక్కటన్నా కనిపిస్తుంది.
ఇక , అధికార పార్టీ వారయితే – ‘ప్రభుత్వానికి అన్ని విషయాలూ తెలుసు….’
‘ప్రభుత్వం తప్పకుండా ఆలోచిస్తుంది …’
‘మీ పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెడతాం….’
‘ఇది రైతు పక్షపాత ప్రభుత్వం ….’
‘ప్రభుత్వం ఎంతటి వారినైనా వదలదు . కఠిన చర్యలు తీసుకుంటుంది ….’ ఇదీ వరుస.
నిజానికి , ‘ ప్రభుత్వం’ అనేదానికి ఒక అస్తిత్వం లేదు .రూపు రేఖలు ఉండవు. కంటికి ‘ఇదీ అని ఏమీ కనపడదు. అందుకే, ఒకసారి కడుపు బాగా మండిన సందర్భం లో – ‘కేంద్రం అనేది ఓ మిధ్య ‘అని ఎన్ .టీ .రామారావు ఆక్రోశించారు. .కేంద్రమే కాదు, రాష్ట్ర ప్రభుత్వమూ ఓ ‘మిధ్యే ‘
‘ప్రభుత్వం ‘ అనే భావనకు అస్తిత్వం ఏమీ లేకపోయినా, ఆ పదం తెలియని వారు ఉండరు .
‘ఇది ప్రభుత్వ స్థలం’ ….’ప్రభుత్వాధికారి’… ‘ప్రభుత్వ కార్యాలయం ‘….’ప్రభుత్వ భవనం’ ….. వంటి పదాలు అన్నీ మనకు నిత్య వాడుక లోనివే .
ఇంతకీ,’ప్రభుత్వం’ అంటే – ఎవరు ?ఏమిటి ? ఎలా ?
మనం కలెక్టర్ గారికి ఒక అర్జీ /వినతి పత్రం ఇచ్చామనుకోండి . “మంచిది. మీ రిప్రెజెంటేషన్ ను ప్రభుత్వానికి పంపిస్తా ” అంటారు. మన ఇంటి పక్కనుండే ఎం .ఆర్ .ఓ ఆఫీస్ వాళ్ళ దగ్గరి నుంచి చీఫ్ సెక్రటరీ వరకు ఇదే సమాధానం. ‘ప్రభుత్వ దృష్టికి తీసుకు వెడతాము ‘అని. ఇంతకీ, ‘ప్రభుత్వం’ అంటే….ఏమిటి,ఎవరు?
‘ప్రభుత్వం’ అనేది -ఓ కర్ర పెత్తందారు. అంటే- ఎవరి చేతిలో బడితే ఉంటే- వారే ప్రభుత్వం . మనుషులు పుట్టినప్పుడు ఇది పుట్టింది . మనుషులు జీవనం సాగించే భౌగోళిక ప్రదేశంలో -జన జీవనాన్ని నియంత్రించేదే ప్రభుత్వం. ఆ నియంత్రించే అధికారం ఎవరి చేతిలో ఉంటే ….వారే ప్రభుత్వం . ఆ అధికారం ఉన్నన్నాళ్ళూ వారే ప్రభుత్వం.
ఆటవిక మనుషుల కాలం లోనూ – వారికి ఓ నాయకుడు ఉండి ఉంటే ….అతనే వారి ప్రభుత్వం . అతను చెప్పినట్టు వారు వినాల్సిందే . రాజుల కాలం లో -రాజు మాటే శాసనం.అంటే-రాజే -ప్రభుత్వం. ఆటవిక జీవనం రోజుల నాటి నుంచి సవాలక్ష మార్పులు , చేర్పులతో ఈ’ ప్రభుత్వం’ అనేది కొనసాగుతూ వస్తున్నది.
దానిని నిర్వహించే వ్యక్తులు మారుతుంటారు గానీ ,అది శాశ్వతం .సత్యం.నిత్యం .సర్వాంతర్యామం . దీనికి- రంగు,రుచి, వాసన ఉండవు. భావోద్వేగాలు ఉండవు. మంచీ, చెడూ తెలియవు. కోపతాపాలు ఉండవు. సిగ్గెగ్గులు తెలియవు.
ప్రపంచ వ్యాప్తంగా వివిధ రకాల జాతుల మధ్య జరుగుతూ వస్తున్న కుట్రలు , కుతంత్రాలు , యుద్ధాలు , దోపిడీలు ,మోసాలు , దురాక్రమణలు మొదలైనవన్నీ కూడా ఆ ప్రాంత ప్రజలను నియత్రించించే వ్యవస్థ (ప్రభుత్వాన్ని) ను స్వాధీనం చేసుకోడానికే .
ఈ మానవ జీవన వ్యవస్థ నిర్వహణ కు వివిధ స్థాయిలలో కొందరు వ్యక్తులు అవసరమవుతారు కదా! వారే అధికారులు. పోలీసులు. గ్రామంలో వీ ఆర్ ఓ నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరకు – ఈ ‘ప్రభుత్వ’ వ్యవస్థలో భాగస్వాములు. వ్యవస్థ సక్రమంగా కొన్ని కట్టుబాట్లతో …ఒక క్రమ పద్దతిలో నడవడానికి కొన్ని చట్టాలు , నిబంధనలు ఏర్పరిచి ….వాటికి లోబడి సమాజం లో అరాజక పరిస్థితులు తలయెత్తకుండా వీరు విధులు నిర్వహిస్తూ ఉంటారు . ఈ అధికార వ్యవస్థను గతం లో రాజులు , జమీందారులు , నవాబులు , నియంతలు లోబరుచుకుని పరిపాలన సాగిస్తే , మన దేశం లోని ‘ప్రభుత్వాన్ని’ ఆంగ్లేయులు (దోచుకున్నంత వరకు చాలులే అనుకుని)మనకే అప్పజెప్పి వెళ్లిపోయారు . ఇక అప్పటి నుంచి తెల్ల దొరలు పోయి నల్ల (కారు, తారు నలుపు) దొరలు వచ్చారు. ‘పాలకులు’ మాత్రమే మారారు కానీ, ‘కారెక్టర్’ మారలేదు. ‘ప్రభుత్వం’ మాత్రం అదే.
అయితే; మనం మాత్రం – ‘ఆయన ప్రభుత్వం పడి పోయింది’……,’ఈయన ప్రభుత్వం వచ్చింది’ అని మాట్లాడుకుంటుంటాం. మీడియా కూడా అలాగే రాస్తుంటుంది. ప్రభుత్వం అదే. కాకపోతే, దానికి నాయకత్వం వహించే ‘నల్ల దొర’ మారుతుంటారు.
ఆయన దిగిపోవాల్సి వస్తే, ఆయన స్థానంలో ఈయన వస్తారు.
ఆ వచ్చినాయన ‘మానసిక స్థితి’ కి ఆ ప్రభుత్వ యంత్రాగపు వ్యవహార శైలి అద్దం పడుతూ ఉంటుంది. ఆయన దయగల తండ్రి అయితే, ప్రభుత్వ యంత్రాంగం కూడా ప్రజల పట్ల ఔదార్యం తో, ప్రేమతో, బాధ్యత తో వ్యవహరిస్తూ ఉంటుంది. ప్రభుత్వానికి నేతృత్వం వహించే వ్యక్తి క్రూర స్వభావుడు అయితే, ఆయన నేత్రత్వం లోని ప్రభుత్వ యంత్రాంగం కూడా- పౌరుల పై విరుచుకుపడుతూ ఉంటుంది. మాట వరుసకు, శ్రీశ్రీశ్రీ చిన జీయర్ స్వామి వారు ‘ప్రభుత్వా’నికి నేత్రత్వం వహిస్తున్నారనుకోండి. ప్రభుత్వ యంత్రాంగం అంతా కాషాయ వస్త్రాలు ధరించి, ఓ కర్రకు వస్త్రం కట్టుకుని, చిరునవ్వులతో ద్వైతం…అద్వైతం ప్రవచిస్తూ- ప్రజలను భక్తి మార్గం లో నడిపిస్తూ ఆ దేవదేవుని చెంతకు చేర్చే పనిలో….తత్వ బోధనలు చేసుకుంటూ ప్రజల మధ్య తిరుగుతూ ఉంటారు. మద్యం, మాంసం, మగువ, కబ్జా, అవినీతి, మోసం వంటి వాటి జోలికి వెళ్ళకండి నాయనలారా అంటూ ప్రజలలో ధర్మనిరతి ని పెంపొందించడానికి కృషి చేస్తుంటారు.అందుకే, ప్రభుత్వానికి స్వంతంగా ఆలోచించే వెసులుబాటు ఏమీ ఉండదు. అందువల్ల, అది సంతోషపడదు.బాధపడదు. సిగ్గు అనేది ఉండడం గానీ, లేకపోవడం ఉండదు. బుద్ధి అనేది ఉండడం గానీ, లేకపోవడం అనేది గానీ ఉండదు. మంచి పనులు అనేవి చేయడం గానీ, చేయకపోవడం అనేది గానీ ఉండదు.’ప్రభుత్వం’ క్రూరురాలూ కాదు. సాధు స్వభావీ కాదు. ప్రభుత్వానికి నేత్రత్వం వహించే వ్యక్తికి జిరాక్స్ కాపీయే…ప్రభుత్వం, దాని అధికార యంత్రాంగం.
అందువల్ల, ప్రతిపక్ష నాయకుల ఆక్షేపణలు అన్నీ ….కేంద్రం లో అయితే నరేంద్ర మోడీ కి,తెలంగాణ లో అయితే కేసీఆర్ కు; ఆంధ్ర లో అయితే జగన్మోహన్ రెడ్డి కే వర్తిస్తాయి. వారి మనస్తత్వాలు, వ్యవహార శైలి, అంతరంగ భావనలను బట్టే- దేశం లో అయినా, తెలంగాణ లో అయినా….ఆంధ్రాలో అయినా ప్రభుత్వ యంత్రాంగాలు స్పందిస్తూ ఉంటాయి. ప్రభుత్వ శైలి, నడక బాగా లేవు అనుకుంటే….మార్చాల్సింది ప్రభుత్వాన్ని కాదు.
A nation of sheep will beget a government of wolves- అన్నాడు, ఎడ్వర్డ్ ఆర్.ముర్రో అనే అమెరికన్ జర్నలిస్ట్. రెండో ప్రపంచ యుద్దం లో యూరప్ కేంద్రంగా వార్తా సేకరణలో ఆయన పేరు అమెరికాలో మారుమోగింది.

భోగాది వేంకట రాయుడు
bhogadirayudu2152@gmail.com

 

LEAVE A RESPONSE