– ప్రభుత్వం తక్షణమే విద్యార్ధుల ఫీజు రీఇంబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలి
– లోకేష్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడండి, ఎదురుదాడి మానుకోండి
– రాష్ట్రవ్యాప్తంగా విద్యార్ధి లోకం రోడ్లెక్కి ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదు
– విద్యార్ధులకు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి
– వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర రెడ్డి
అనంతపురం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కావొస్తుంది, రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు, కూటమి ప్రభుత్వం ఫీజు రీఇంబర్స్‌మెంట్ చెల్లించకుండా విద్యార్ధుల జీవితాలతో చెలగాటమాడుతోంది. కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్ధులకు కాలేజీల యాజమాన్యాలు సర్టిఫికెట్స్ ఇవ్వడంలేదని అనేక ఫిర్యాదులు వస్తున్నాయి, ప్రభుత్వం వెంటనే బకాయిలు చెల్లించాలి.
విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వాస్తవాలు తెలుసుకోకుండా ఎదురుదాడి చేస్తున్నాడు, ప్రభుత్వానికి విద్య పట్ల ఎందుకంత నిర్లక్ష్యం, గతంలో వైయస్ జగన్ ప్రభుత్వంలో విద్యార్ధులకు సకాలంలో అన్నీ చెల్లించాం, కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బకాయిలు పెండింగ్‌లో పెట్టారు. అనేక గురుకుల, వివిధ సాంఘీక సంక్షేమ హాస్టళ్ళలో పరిస్ధితులపై హైకోర్టు కూడా వ్యాఖ్యలు చేసింది, విద్యార్ధులకు అవసరమైన ఏదీ కూడా ఇవ్వడంలేదు.
జగన్ పాలనలో విద్యారంగంపై ప్రత్యేక శ్రద్ద పెట్టారు, రూ. 73 వేల కోట్లు ఐదేళ్ళలో విద్యారంగానికి ఖర్చుపెట్టారు, రుచికరమైన మెనూ ఇవ్వడం వల్ల పేద, మైనారిటీ, బలహీన వర్గాల పిల్లలకు చక్కటి నాణ్యమైన భోజనం అందింది. విద్యారంగంలో అవసరమైన సంస్కరణలు అన్నీ తీసేసి తిరోగమన దిశగా తీసుకెళ్తున్నారు కూటమి నేతలు, 18 యూనివర్శిటీలలో వీసీలను తొలగించారు, ఉన్నత విద్యా కమిషన్‌కు ఛైర్మన్‌ను కూడా నియమించలేదు.
రాష్ట్రవ్యాప్తంగా విద్యార్ధులు కలెక్టరేట్ల ముట్టడి, ర్యాలీలు చేస్తున్నారు, ఒక్క విద్యార్ధులే కాదు యువత కూడా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తుంది, ఎన్నికల ముందు కూటమి పార్టీలు ఇచ్చిన హామీలు అమలుచేయాలన్నదే వీరి డిమాండ్.
బడ్జెట్ కేటాయింపులు కూడా విద్యారంగానికి సరిపోయినంత లేవు, వైఎస్సార్‌సీపీపై ఎదురుదాడి మానుకుని లక్షలాది మంది విద్యార్ధుల భవిష్యత్‌తో చెలగాటమాడవద్దు, వెంటనే ఫీజురీఇంబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలి, విద్యార్ధులకు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి.