– ఏకంగా బజారున పడి విచక్షణ లేకుండా కొట్టుకుంటున్నారు
– కూటమి ఎమ్మెల్యేలు బహిరంగంగా సంపద దోపిడీకి తెగబడ్డారు
– దాన్నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు టీడీపీ డైవర్షన్ పాలిటిక్స్
– విద్యుత్ ఒప్పందాల్లో అవినీతి అంటూ మళ్లీ అసత్య ఆరోపణలు
– సెకీతో విద్యుత్ ఒప్పందాల్లో ఎలాంటి అవినీతి లేదు
– 2016లో సెకీతో చంద్రబాబు ప్రభుత్వం పీపీఏ
– ఒక్కో యూనిట్ రూ.4.50కి కొనేలా ఒప్పందం
– బాబు మొత్తం ఒప్పందాల భారం రూ.1.13 లక్షల కోట్లు
– వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌రెడ్డి
తాడేపల్లి: జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై తెలుగుదేశం పార్టీ తనకు అలవాటైన డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా çబురద చల్లే ప్రయత్నం చేస్తోందని వైయస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌రెడ్డి ఆక్షేపించారు. రాయలసీమలో ఫ్లై యాష్‌ను సొమ్ము చేసుకునేందుకు కడప, అనంతపురానికి చెందిన కూటమి ఎమ్మెల్యేలు ఘర్షణ పడుతున్నారని ఆయన గుర్తు చేశారు. దాన్నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే, విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో అవినీతి అంటూ మళ్లీ టీడీపీ తప్పుడు ఆరోపణలు చేస్తోందని దుయ్యబట్టారు.
రాయలసీమలోని థర్మల్ విద్యుత్ ప్లాంట్ నుంచి వచ్చే ఫ్లై యాష్‌ను దక్కించుకునేందుకు కూటమి ఎమ్మెల్యేలు ఆదినారాయణరెడ్డి, జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గీయులు రోడ్డున పడి మరీ ఉద్రిక్తతలు సృష్టించడాన్ని రాష్ట్రం మొత్తం చూస్తోంది. కమిషన్ల కోసం, ఫ్లైయాష్ ద్వారా సొమ్మును దండుకోవడం కోసం వీరు చేస్తున్న హంగామా పెద్ద ఎత్తున ప్రజల్లో చర్చనీయాంశం అయ్యింది.
ఇంత పబ్లిక్‌గా కమిషన్లు, మామూళ్ళ కోసం కూటమి ఎమ్మెల్యేలు తెగబడుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. అంతా జరిగిన తరువాత శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేంది లేదంటూ సీఎం సన్నాయినొక్కులు నొక్కుతున్నారు. ఈ వ్యవహారం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు హడావుడిగా టీడీపీలో కమెడియన్, పసిబాలుడు అయిన ఆనం వెంకటరమణారెడ్డితో ప్రెస్‌మీట్‌లో మాట్లాడించారు. అందులో ఆయన, మాజీ సీఎస్ అజేయ కల్లం, మాజీ సీఎం జగన్‌తో పాటు, ఆయన కుటుంబ సభ్యుల వ్యక్తిత్వాన్ని హననం చేసేలా తప్పుడు మాటలు మాట్లాడారు.
నిజానికి చంద్రబాబు హయాంలో యూనిట్ విద్యుత్ రూ.4.99 నుంచి రూ.5.99 వరకు కొనుగోలు చేసేలా మొత్తం 36 ఒప్పందాలు చేసుకున్నారు. వాటివల్ల ప్రజలపై దాదాపు రూ.1.13 లక్షల కోట్ల భారం పడింది. అదే జగన్ ప్రభుత్వం యూనిట్ విద్యుత్ రూ.2.49కే కొనుగోలు చేసేలా 2021తో సెకీతో ఒప్పందం చేసుకుంది. ట్రాన్స్‌మిషన్ ఛార్జీలు కూడా లేకుండా ఆ ఒప్పందాన్ని, పూర్తి పారదర్శకంగా ఖరారు చేసుకున్నారు. దీని వల్ల ఏటా రూ.3700 కోట్లు.. అలా 25 ఏళ్లలో దాదాపు లక్ష కోట్లు ఆదా అవుతాయి.
విద్యుత్ ఒప్పందాల్లో అవినీతి జరిగిందని మాట్లాడుతున్న కూటమి ప్రభుత్వం, దమ్ముంటే ఆ ఒప్పందాలన్నీ రద్దు చేయాలి. ఆదానీ కంపెనీతో గత ప్రభుత్వం ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదు. కేవలం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీతోనే ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని పుత్తా శివశంకర్‌రెడ్డి మరోసారి గుర్తు చేశారు.