Suryaa.co.in

Andhra Pradesh

ఆర్యవైశ్యుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు

-ఆర్యవైశ్యుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తాం
-పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ మంత్రి టిజి భరత్
– ఆర్యవైశ్యుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లడం జరుగుతుంది
– మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

రాయచోటి: ఆర్యవైశ్యుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి లు పేర్కొన్నారు.

సోమవారం పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ మంత్రి టిజి భరత్, మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి లు రాయచోటి పట్టణంలోని గాంధీబజార్ నందు వాసవి కన్యకా పరమేశ్వరి దేవి దేవాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం ఆర్యవైశ్యుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు.

గతంలో ఆర్యవైశ్యులను పట్టించుకునే వారే లేరని టిడిపి ప్రభుత్వంలో ఆర్యవైశ్యులకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు. వీరి అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించేందుకు ప్రభుత్వంతో చర్చించడం జరుగుతుందన్నారు.

గత ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు పలు రకాలుగా ఇబ్బందులు పడి ఎంతో నష్టపోయారని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కుల, మత ప్రాంత భేదాలు లేకుండా అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు.

మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ…మంత్రి టీజీ భరత్ పిలవంగానే రాయచోటి పట్టణానికి రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రాబోయే రోజులలో ఇలాంటి మంచి కార్యక్రమాలు ఆయన చేతుల మీదుగా మరిన్ని ప్రారంభించాలని కోరుకుంటున్నానన్నారు.

గాంధీ బజార్లో ఎక్కువ మంది ఆర్యవైశ్యులు ఉన్నారని మీకు ఎటువంటి సమస్యలున్న తమ దృష్టికి తెచ్చి పరిష్కరించుకోవచ్చునన్నారు. రాబోయే రోజులలో రాయచోటి పట్టణాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడం జరుగుతుందని ఇందుకు ప్రతి ఒక్కరు పూర్తి సహాయ సహకారాలు అందించాలన్నారు.

LEAVE A RESPONSE