Suryaa.co.in

Andhra Pradesh

ప్రకాష్ రెడ్డి, గోరంట్ల మాధవ్ నోరు అదుపులో పెట్టుకోండి

– గుంతపల్లి ఘటనను రాజకీయం చేసి మాపై నెట్టుతారా..?
– మా దృష్టి అభివృద్ధి వైపు ఉంది.. మీపై వచ్చేలా చేసుకోవద్దు
– మీ ఆధిపత్య పోరులోకి మా కుటుంబాన్ని ఎందుకు తీసుకొస్తారు
– రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత హెచ్చరిక

రాప్తాడు: మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఎమ్మెల్యే పరిటాల సునీత హెచ్చరించారు. అనంతపురం నగరంలోని తన నివాసంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ గత రెండు రోజులుగా వారు చేస్తున్న వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు.

కనగానపల్లి మండలం గుంతపల్లి గ్రామంలో వ్యక్తిగత కారణాలతో జరిగిన గొడవను రాజకీయం చేస్తూ.. మా కుటుంబంపై విమర్శలు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఈ ఘటనలో రెండు వైపుల వారికి గాయాలయ్యాయని.. దానిని మేము వైసీపీ చేసిన దాడిగా చెప్పలేదన్నారు. గతం నుంచి వారి మధ్య మనస్పర్థలు, వ్యక్తిగత కారణాలతో గొడవ పడితే తెలుగుదేశం పార్టీకి, పరిటాల కుటుంబానికి ఆపాదిస్తారా అంటూ నిలదీశారు. గత ఐదేళ్లలో మీరు ఎన్ని దాడులు చేశారో.. ఎంత మంది మీద అక్రమ కేసులు పెట్టించారో లెక్కే లేదన్నారు.

పైగా పోలీసుల గురించి, పోలీస్ వ్యవస్థ గురించి ప్రకాష్ రెడ్డి మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉందన్నారు. పోలీస్ వ్యవస్థతో పాటు అన్ని వ్యవస్థల్ని నాశనం చేయడంతో పాటు వాటిని మీ స్వార్థం కోసం వాడుకున్న సంగతి మర్చిపోయారా అంటూ ప్రశ్నించారు. గోరంట్ల మాధవ్ ఇప్పుడు నిద్రలేచి కబడ్దార్ అంటూ అరుస్తున్నారని సునీత ఫైర్ అయ్యారు. గతంలో మీరు చేసిన వాటి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బాగుంటుందన్నారు. సభ్యత, సంస్కారం ఉంది కాబట్టి చెప్పడం లేదన్నారు. గత ఐదేళ్లలో మీరు ఎన్ని అరాచకాలు, దౌర్జన్యాలు చేసినా వాటిని పట్టించుకోకుండా తాము నియోజకవర్గ అభివృద్ధి గురించి మాత్రమే దృష్టి పెట్టామన్నారు.

అదే మీరు చేసిన వాటికి ప్రతీకారం తీర్చుకోవాలని ఆలోచన వచ్చినా.. లేదా మీరన్నట్టు రాజకీయంగా చూడాల్సి వస్తే ఆ కథ వేరేలా ఉంటుందన్నారు. నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం ఓ వైపు ప్రకాష్ రెడ్డి, ఇంకో వైపు గోరంట్ల మాధవ్ ప్రాకులాడుతున్నారని.. వారిలో వారికే పొసగక అంతర్గత కలహాలతో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. ఎక్కడైనా చిన్న చిన్న సంఘటనలు జరిగితే దానికి రాజకీయాల్ని ఆపాదించుకుంటూ అమాయక కార్యకర్తల్ని పక్కదారి పట్టిస్తున్నారని అన్నారు.

ఎక్కడైనా చిన్న చిన్న గొడవలు జరిగినా వాటిపై పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ కేసులు నమోదు చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా మీరు నోరు అదుపులో పెట్టుకోవాలని ఎమ్మెల్యే సునీత హెచ్చరించారు

LEAVE A RESPONSE