– కంచిస్వామికి తలసానిని పరిచయం చేసిన తమిళసై
( మార్తి సుబ్రహ్మణ్యం)
తాజాగా ఆయన..తమ ప్రభుత్వానికి కొరకరానికొయ్యగా మారుతున్న ఆమెపై ప్రెస్మీట్లో విమర్శనాస్త్రాలు సంధించారు. ఆమె పద్ధతి బాగోలేదన్నారు. సీఎంతో పనిచేయలేకపోతున్నానని ఆమె చెప్పడం సరైంది కాదన్నారు. ఇది జరిగిన 24 గంటల తర్వాత, వారిద్దరూ ఓ ఆధ్యాత్మక కార్యక్రమంలో తారపడ్డారు. ఒకరికొకరు అభివాదం చేసుకుని చిరునవ్వులు చిందించారు. ఆయన తెలంగాణ సీనియర్ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అయితే, ఆమె గవర్నర్ తమిళసై. ఈ దృశ్యానికి వేదిక సికింద్రాబాద్ పద్మారావునగర్‌లోని శ్రీ స్కందగిరి దేవాలయం.
ఇక వివరాల్లోకి వెళితే, శ్రీ స్కందగిరి ఆలయంలో కంచిపీఠాథిపతి విజయేంద్ర సరస్వతి నేతృత్వంలో స్వర్ణబంధన మహాకుంభాభిషేకం నిర్వహించారు. ఆ కార్యక్రమానికి గవర్నర్ తమిళసై, మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అనుకోకుండా ఒకే సమయంలో తారసపడ్డారు. నిన్ననే తమిళసై వ్యవహారశైలి, ఆమె చేస్తున్న ప్రకటనలపైనా మంత్రి తలసాని విమర్శలు కురిపించిన విషయం తెలిసిందే.
ఆలయానికి వచ్చిన మంత్రి తలసానిని స్వయంగా గవర్నరే కంచిస్వామికి ‘ఈయన ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే, మంత్రి కూడా’ అంటూ తమిళంలో పరిచయం చేశారు. మంత్రి తలసాని కూడా ఆమెకు శాలువా కప్పి సత్కరించారు. కాసేపు ఇద్దరూ ఉభయకుశలోపరి మాట్లాడుకున్నారు. మంత్రి తలసాని వెళ్లిపోతుండగా, గవర్నర్ ఆయనను వెనక్కి పిలిచి ఆలయంలో ఉన్న ఆఫీసుకు తీసుకువెళ్లి ప్రసాదం ఇప్పించారు.