– అత్యవసర వైద్యం కోసం ఆగిన గవర్నర్ కాన్వాయ్
విజయవాడ: వేగంగా పరుగులు తీస్తున్న కాన్వాయ్ ఒక్కసారిగా నిలిచి పోయింది. భద్రతా సిబ్బందికి కూడా తెలియదు ఎందుకు కాన్వాయ్ ఆగిందన్న విషయం. జడ్ ప్లస్ భద్రతతో సాగే ఆ కాన్వాయ్ కు వందలాది మంది పోలీసులు భద్రతగా ఉంటారు. ముందస్తు సమాచారం లేకుండా కాన్వాయ్ నిలచిపోయే పరిస్ధితే ఎదురుకాదు. కాని ఆగింది. ఎవ్వరూ కార్ల నుండి దిగలేదు. ఒక వాహనం చుట్టూ మాత్రం భద్రతా సిబ్బంది వలయంగా ఏర్పడ్డారు.
దూరం నుండి చూస్తున్న వారికి అక్కడ ఏమి జరుగుతుందో అర్ధం కాలేదు. కనుచూపు మేరలో ఎటువంటి ఆటంకాలు లేవు. భద్రతా పరమైన సమస్యలు కనిపించటం లేదు. ఇంతలోనే తిరిగి కాన్వాయ్ బయలు దేరింది ఎటువంటి అలజడి లేకుండానే. ఈ ఊహించని పరిణామం వెనుక ఓ మానవీయ కోణం దాగి ఉంది. రాష్ట్ర ప్రధమ పౌరుని పెద్దరికం కనిపిస్తుంది.
తన అధికారిక పర్యటనను ముగించుకుని సోమవారం రాత్రి పొద్దుపోయాక దిల్లీ నుండి గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్. విమానాశ్రయం నుండి షేడ్యూలు ప్రకారం రాజ్ భవన్‌కు బయలుదేరారు. జాతీయ రహదారిపై ఉన్న విమానాశ్రయం ప్రధాన ద్వారానికి చేరుకునే సమయంలో కాన్వాయ్ ఓ ఐదు నిమిషాలు రోడ్డు పక్కనే నిలిచి, తిరిగి బయలుదేరి యధావిధిగా రాజ్ భవన్ చేరుకుంది. అక్కడి దృశ్యం ప్రకారం కంటికి కనిపించేది అంతే. కాని దాని వెనకాల ఓ చిన్నారి ప్రాణం ఉంది.
గవర్నర్ రాక నేపధ్యంలో విమానాశ్రయం వద్ద జాతీయ రహదారిపై పోలీసులు వాహనాలను ఆపారు. దీంతో అక్కడ చాలా వాహానాలు బారులు తీరాయి. వాటి వెనుక చాలా దూరంగా ఓ అంబులెన్స్ దారి కోసం వేచి ఉంది. సకాలంలో ఆసుప్రతికి చేరితేనే పది నెలల చిన్నారి ప్రాణం నిలుస్తుంది. అంబులెన్స్ ముందు వందలాది వాహనాలు, వాటన్నింటినీ వదిలితే తప్ప అంబులెన్స్ కు దారి దొరకదు. నూతనంగా ఏర్పడిన ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ కుమారుడే ఆ చిన్నారి.
నిజానికి నిలిచి ఉన్న వాహానాలలో అంబులెన్స్ ఉందన్న సమాచారం కూడా పోలీసులకు తెలిసే అవకాశం లేదు. అంత దూరంలో ఉంది. ఇక ప్రసన్న వెంకటేష్ ఉండబట్ట లేకపోయారు. గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పి.సిసోడియాకు చరవాణిలో తమ ఇబ్బందిని వివరించారు. తక్షణం స్పందించిన సిసోడియా కాన్వాయ్‌లో ఉన్న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు సమాచారం అందించారు. బాలుని ప్రాణం కోసం గవర్నర్ అధికారిక కాన్వాయ్ నిలిపి జాతీయ రహాదారిపై ఉన్న వాహానాలను విజయవాడ వైపుకు నడిపించవలసిన ఆవశ్యకతను వివరించారు.
గవర్నర్ మరో మాటకు తావివ్వలేదు. తనతో కారులో ఉన్న ఎడిసి సాహిల్ మహాజన్, ముఖ్య భద్రతా అధికారి పీటర్‌కు మౌఖిక అదేశాలు జారీ చేసారు. ఆదేశాలు వెంటనే అమలయ్యాయి. ఎడిసి గవర్నర్ భధ్రతపై దృష్టి సారించారు. పీటర్ జాతీయ రహదారిపై అంబులెన్స్ కదలికలను సమన్వయం చేసారు. జాతీయ రహదారిపై అంబులెన్స్ వెళ్లే వరకు గవర్నర్ కాన్వాయ్ నిలిచి పోయింది.
ఇప్పుడా పదినెలల చిన్నారి రుద్ర విజయవాడ రెయిన్ బో ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తన కుమారునికి వచ్చిన జ్వరాన్ని సాదారణమైనదిగా భావించారు. సోమవారం తీవ్రస్దాయికి చేరుకున్న జ్వరం వల్ల ఫిట్స్ రావటంతో ఒక్కసారిగా పరిస్ధితి అదుపుతప్పింది. ఏలూరు వైద్యులు మెరుగైన చికిత్స కోసం విజయవాడ వెళ్లాలని సూచించటం, అంబులెన్సు ట్రాఫిక్ లో ఇరుక్కు పోవటం, గవర్నర్ చొరవ, సిసోడియా వేగవంతమైన చర్యల ఫలితంగా చిన్నారి గండం నుండి బయట పడ్డాడు.