గౌరి తపస్సు లేదా గౌరీ పూజ

వివాహం చేసుకోబోతున్న అమ్మాయి వివాహవేదిక మీదకు వచ్చేటప్పుడు గౌరి తపస్సు చేసి వస్తుంది. అసలు ఇలా చేయడానికి కారణం ఏమిటి అని ఆలోచించాలి. అంతే కాని, సింగినాదం జీలకర్ర అని కొట్టిపారెయ్యడానికి వీలులేదు. మనకి పెద్దలు ఒక ఆచారం పెట్టారంటే దానికి సంబంధించి మన అభ్యున్నతి అంతా దాగి ఉంటుంది.

అమ్మాయి గౌరీ తపస్సు చేసేటప్పుడు బుట్టలో కూర్చుని, అందునా ఖాళీగా ఉన్న బుట్టలో కాకుండా, సగం వరకు ధాన్యంతో నింపబడిన గంపలో కూర్చుని గౌరి పూజ చేయాలి. మనము సామాన్యంగా గౌరీ పూజ అనగానే ఒక్క అమ్మవారికి సంబంధించిన మూర్తిని పెట్టి పూజ చేస్తాము. కాని అది సరి కాదు. ఆ తల్లి మహా పతివ్రత కనుక, ఆ తల్లి ప్రీతి చెందాలి అంటే శివపార్వతుల మూర్తులను కలిసి ఉన్నదే పెట్టి పూజించాలి. అందుకే కదా మన శంకరభగవత్పాదుల వారు కూడా అమ్మవారికి సంబంధించిన సౌందర్యలహరి స్తోత్రం మొదలు పెట్టేటప్పుడు అమ్మవారి నామంతో కాకుండా ‘శివశ్శక్త్యాయుక్తో’ అంటూ అయ్యవారి నామంతో మొదలు పెట్టారు. అసలు ఈ గౌరీ పూజ చేయడానికి కారణం ఆడదాని యొక్క సౌభాగ్యాన్ని నిలిపే శక్తి ఆ పరాశక్తి అయిన సర్వమంగళాదేవతకే ఉంది.

ఒకానొక సందర్భంలో పార్వతీపరమేశ్వరులు ఇద్దరూ ఒకరి ప్రక్కన ఒకరు కూర్చుని ఉన్నారు. మన శంకరునికి తనలో తాను రమించడం తప్ప సరసపూరితమైన సంభాషణ పాపం అంతగా తెలియదు. అమ్మవారి అప్పటి నామం కాళి. ఆవిడ నల్లగా ఉండేది కాబట్టి, కాళి అని హిమవంతుడిచేత నారదమహర్షి నామకరణం చేయించారు. ఇద్దరూ ఏకాంతంగా కూర్చున్నారు కదా… పరమశివుడు ఏదైనా సరస పూరితమైన, ప్రేమ పూరితమైన మాటలు మాట్లాడవచ్చు కదా… కాని, శంకరుడు ఒక్కసారి తనని తాను శుద్ధ స్ఫటికంగా ఉన్న తన శరీరాన్ని చూసుకొని, ఒక్కసారి అమ్మవారి వంక చూసి, కాళీ అన్నాడు. వెంటనే అమ్మవారికి కోపం వచ్చింది.

అంటే ఆయన తెల్లగా ఉన్నారు. నేను నల్లగా ఉన్నాను అనుకుని, నేను ఆయనకి ఈ విషయంలో (రంగు) సరిపోలేదు అనుకుంటున్నారు అనుకుని వెంటనే యోగాగ్ని రగుల్చుకుని, తన నలుపు రంగును వదిలివేసి, ఎరుపు, తెలుపు, పసుపు వర్ణాలతో కూడిన గౌర వర్ణం పొంది ఆయన ప్రక్కన వచ్చి కూర్చుని, ఇప్పుడు మీ తెలుపు రంగు గొప్పదా? నా గౌరవర్ణం గొప్పదా అన్నట్లు చూసింది. ఒక్కసారి ఈ హఠాత్పరిణామానికి స్వామివారు కూడా ఖంగు తిని, ఏమిటి? కాళి అన్నందుకే ఇంత ఉద్ధతా? అని అమ్మవారిని విస్మయంగా చూశారట. దీనికి వైదికంగా ఆ నలుపు వర్ణం కౌశికిగా మారి శుంభనిశుంభులనే రాక్షసులను సంహరించింది.

ప్రతి కన్నెపిల్ల కూడా గౌరి పూజ చేసి కళ్యాణవేదిక మీదకి రావడానికి కారణం, అమ్మా! నువ్వు ఆదిశక్తివి కదా, నువ్వే నీ భర్త ఒక్కసారి కాళీ అన్నందుకు నీ రంగును మార్చుకున్నావే (అంటే భర్త హృదయంలో స్థానం సంపాదించడానికి), మరి నేను, మామూలు ఆడపిల్లని. నా ఇంటి పేరు వదిలేస్తున్నాను, గోత్రాన్ని వదిలేస్తున్నాను, తోబుట్టువులను వదిలేస్తున్నాను, పెరిగిన వాతావరణాన్ని వదిలేసి ఆయన చిటికిన వ్రేలు పట్టుకుని వెళుతున్నాను, నేను కూడా ఆయన మనసులో ఈ విషయంలో ఇది నాకు సరిపోదు అనుకోకుండా నన్ను అనుగ్రహించు తల్లీ…. అంటూ నిత్య సుమంగళిగా ఉండేటట్లుగా దీవించమంటూ గౌరి పూజ చేస్తుంది. మనకి కూడా ఒక సామెత ఉంది. ‘మగడు మెచ్చిన చాలు కాపురంబులోనా’ అని, భర్త భార్యతో, నువ్వు దొరకడం నా అదృష్టం అంటే పొంగిపోతుంది ప్రతి స్త్రీ. అదే, భర్త అబ్బ! నిన్ను అనవసరంగా చేసుకున్నాను. నువ్వు నాకు అస్సలు సరిపోవు అంటే కృంగిపోతుంది. నా భర్తకి నేను ఏ విషయంలో కూడా తీసిపోకుండా ఉండేటట్లు ఆయన మనస్సులో స్థానం సంపాదించుకునేటట్లు చూడు తల్లి అంటూ గౌరి పూజ చేస్తుంది.

ఇంత గొప్పదైనటువంటి, ఇంత శక్తి కలిగినటువంటి పూజను మనము ఇప్పుడు ఆచరిస్తున్న విధానం చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. ఏ అమ్మాయికి గౌరీపూజ యందు శ్రద్ధ ఉండదు. అలంకరించుకోవడం మీద ఉన్న శ్రద్ధ, స్నేహితులతో పరాచకాలాడడంలో ఉన్న శ్రద్ధ, ఈ గౌరీ పూజ మీద ఉండదు. ఇక అభ్యున్నతి రమ్మంటే ఎలా వస్తుంది. అమ్మవారికి చేసే పూజ యందు శ్రద్ధ ఉండదు కాని, వీడియోల మీద, ఫొటోల మీద పిచ్చి వ్యామోహం. జడ ఇలా వేసుకుని ఒక ఫొటో, కుంకుమ వేస్తూ ఒక ఫొటో, దండం పెడుతూ ఒక ఫొటో, వీటి మీద ఉన్న శ్రద్ధ అమ్మవారి పూజ యందు ఉండదు.

అందుకే తల్లిదండ్రులు గౌరీ పూజ యొక్క వైశిష్ట్యం తమ కూతురుకి ముందే చెప్పుకోవాలి. ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఏంటంటే, తల్లిదండ్రులకు తెలుసోలేదో తెలియదు, తెలిసినా చెప్పుకోరో తెలియదు. ఫొటోలు తీసుకోవద్దు అని చెప్పటం లేదు. ఇప్పటి అమ్మాయిలకి సరిగ్గా చీర కట్టుకోవడానికి రాదు. వివాహం అనగానే ఒక Beauty Parlour కి సంబంధించిన వారిని పక్కన వెన్నంట పెట్టుకోవడం, అలంకరణ ఎక్కడ చెదిరినా సరిదిద్దమని వారిని కోరడం. దాని మీద ఉన్న శ్రద్ధ మన అభ్యున్నతిని నిర్ణయించే వైదిక క్రతువు మీద ఎందుకుండదు? తప్పు మనలో ఉంది… పెద్దలుగా వారికి తెలియచెప్పకపోవడం. పూజంతా అయిపోయిన తరువాత అమ్మవారికి నమస్కరించి, అమ్మా… ఇది అందరి ఆనందం కోసం అని ఒక 4,5 ఫొటోలు దిగవచ్చు. గౌరిపూజను శ్రద్ధగా చేసుకునేటట్లు చూడాల్సిన బాధ్యత అమ్మాయి తల్లిదండ్రులదే.

అలా అని ఈ క్రతువులో అత్తగారు, మాకేమి సంబంధం లేదని అనుకోవడానికి వీలులేదు. కాబోయే మామగారు, అత్తగారు అమ్మాయి గౌరీ పూజ చేస్తున్న స్థలానికి వెళ్ళాలి. ఉత్తి చేతులతో కాకుండా పూలు, పండ్లు తీసుకుని వెళ్ళాలి. మామగారిగా కోడలికి ఇస్తున్న మొదటి బహుమతి. కోడలిని ఆశీర్వదిస్తూ, అమ్మా…. నువ్వు ఈ గౌరీ పూజ ఎందుకు చేస్తున్నావో నాకు తెలుసు. నువ్వు చేస్తున్న ఈ పూజ వల్ల మా అబ్బాయి దీర్ఘాయుష్మంతుడు అవుతున్నాడు. నా వంశము నిలబడుతోంది. నువ్వు చేస్తున్న ఈ పూజకు సంతోషించి నీకు నేను ఇస్తున్న మొదటి బహుమతి, అని కోడలిని ఆశీర్వదించి ఇవ్వాలి.

ఈ సమయంలో మామగారిగా చక్కగా ధవతి, ఉత్తరీయం ధరించి వెళ్లి కోడలిని ఆశీర్వదించి పూలు, పండ్లు అందచెయ్యాలి. కోడలు కూడా ఆ పూలతో అమ్మవారిని చక్కగా పూజించి ఆ పండ్లను నివేదన చెయ్యాలి. ఆడపిల్ల వివాహానికి ముందు చేసే పూజలన్నీ మంచి భర్త దొరకాలని. వివాహానంతరం స్త్రీ పూజలన్నీ తన భర్త ఆయురారోగ్యాలకోసం, పిల్లలకోసం, తన అత్తమామల కోసం మరియు తన పుట్టింటి సుఖం కోసం. మరి తన సుఖం? వీరందరి సుఖాన్ని తన సుఖంగా భావించే స్త్రీ సంస్కృతికి మనమందరం వారసులం.తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త.కళ్యాణమస్తు, లోకాసమస్తాసుఖినోభవంతు.

– ఎం.ఆర్.ఎన్.శర్మ

Leave a Reply