– కృష్ణానదిపై 3.2 కిలోమీటర్ల మేర భారీవంతెన నిర్మాణం
– కేంద్ర ప్రభుత్వ ఆమోదముద్ర
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేంద్రంలోని ఎన్డీయే కూటమి శుభవార్త చెప్పింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీ పర్యటనలకు ఫలితం దక్కనుంది. అమరావతి రైల్వే ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. అదే సమయంలో కృష్ణానదిపై 3.2 కిలోమీటర్ల మేర భారీవంతెన నిర్మాణానికి లైన్‌క్లియర్ చేసింది.
అమరావతి నిర్మాణంలో మరో మైలురాయికి తెరలేచింది. అమరావతి రైల్వే కనెక్టివిటీ ప్రాజెక్టుకు కేంద్ర క్యాబినెట్ పచ్చజెండా ఊపింది. అమరావతి నగరాన్ని హైదరాబాద్, కోల్ కతా, చెన్నై నగరాలకు అనుసంధానం చేసేలా రైల్వే లైన్ నిర్మాణం చేపట్టనున్నారు. రూ.2,245 కోట్ల వ్యయంతో 57 కిలోమీటర్ల మేర నూతన రైల్వే లైన్ నిర్మించనున్నారు.
ఈ క్రమంలో కృష్ణా నదిపై 3.2 కిలోమీటర్ల మేర భారీ వంతెనను కూడా నిర్మించనున్నారు. ఈ రైల్వే లైన్ తో అమరావతికి దక్షిణ, మధ్య, ఉత్తర భారతదేశంతో అనుసంధానం ఏర్పడుతుంది. ఈ రైల్వే ప్రాజెక్టుకు మచిలీపట్నం, కృష్ణపట్నం, కాకినాడ పోర్టులను కూడా అనుసంధానించనున్నారు. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాలిస్తే, అమరావతికి జనాల వలస మరింత పెరగడం ఖాయం.