Suryaa.co.in

Editorial

గుమ్మడి నర్సయ్యకు దక్కిన అదృష్టం

  • ఎట్టకేలకూ సీఎం రేవంత్ దర్శనభాగ్యం

  • ఐదుసార్లు సీఎం ఇంటి గేటు బయటనే

  • అసెంబ్లీలో నర్సయ్యను కలిసిన సీఎం రేవంత్

  • నర్సయ్య జీవితం ధన్యమైనట్లే

  • గిరిజనుల సమస్యలపై లేఖ అందించిన నర్సయ్య

  • తగిన చర్యలు తీసుకుంటానని సీఎం రేవంత్ హామీ

  • నర్సన్న అదృష్టం పుచ్చిపోయినట్లే

( మార్తి సుబ్రహ్మణ్యం)

గిరిజన బిడ్డ, ఉమ్మడి రాష్ట్రంలో ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ నేత గుమ్మడి నర్సయ్య అదృష్టం పుచ్చిపోయింది. ఆయన జీవితం ధన్యమయింది. ఆయనకు ఎట్టకేలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దర్శన భాగ్యం లభించింది. ఆయనను సీఎం కరుణించారు. గిరిజన ప్రాంతాల్లో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు సీఎం దృష్టికి తీసుకువెళ్లి, వాటికి పరిష్కార మార్గాలు సూచించేందుకు నర్సయ్య ఇప్పటివరకూ విఫల యత్నం చేస్తున్నారు.

అందుకోసం ఐదుసార్లు సీఎం రేవంత్‌రెడ్డి ఇంటి చుట్టూ ప్రదక్షణలు చేశారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ఇప్పటికీ సైకిల్, బస్సుల్లో తిరుగుతూ సాధారణ జీవనం గడుపుతున్న గుమ్మడి నర్సయ్య, రాజకీయాల్లో తనకంటే సబ్ జూనియర్ అయిన రేవంత్‌రెడ్డిని కలిసేందుకు గేట్ల దగ్గర పడిగాపులు కాయడం, గిరిజనులకే అవమానమన్న విమర్శలు సోషల్‌మీడియాలో వెల్లువెత్తాయి. గుమ్మడి నర్సయ్యకు జరిగిన అవమానంపై ‘మహానాడు’లో వార్తా కథనం వెలువడిన విషయం తెలిసిందే.

కాగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఎట్టకేలకు నరసయ్యపై కరుణించి అపాయింట్‌మెంట్ ఇచ్చారు. దానితో ఆయనను కలిసిన నర్సన్న, గిరిజనుల సమస్యలకు సంబంధించిన ఒక లేఖ అందించి దణ్ణం పెట్టి వచ్చేశారు.వాటిని చదివిన సీఎం వాటిపై తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఆరకంగా ‘దేశంలో అత్యంత సీనియర్ నేత, నిమిషం కూడా ఖాళీ లేకుండా.. అసలు ఫోన్లు కూడా తీయనంత బిజీగా ఉండే, ‘దేశంలోని ఏకైక ముఖ్యమంత్రి’ని కలిసిన నర్సన్న అదృష్టం పుచ్చిపోయిందన్నమాట! మరి ఆరకంగా నర్సన్న జీవితం ధన్యమైనట్లే కదా?

ఇప్పుడు పాపం నర్సయ్యకు పట్టిన అదృష్టం.. గతంలో కామ్రేడ్ గద్దరన్నకూ పట్టి ఉంటే బాగుండేది. ఆయన కూడా గతంలో ఇలాగే కేసీఆర్ ఇంటి గేటు బయట కావలి కాసినా దొరగారి దర్శనభాగ్యం దొరకలేదు. అప్పుడు దొరగారు ఒక దళితబిడ్డను అవమానించారని సోషల్‌మీడియా ధ్వజమెత్తితే, కొద్దిరోజుల క్రితం గిరిజన బిడ్డ గుమ్మడి నర్సయ్యను కలవకుండా రెడ్డిగారు అవమానించారంటూ, రేవంత్‌పై అదే సొషల్‌మీడియా ధ్వజమెత్తింది. అయితే ఎట్టకేలకు దిద్దుబాటుకు దిగిన రేవ ంత్‌రెడ్డి.. తన తప్పు తెలుసుకుని, నర్సన్నకు దర్శనభాగ్యం కల్పించారు. కానీ కేసీఆర్ మాత్రం గద్దర్ జీవించినంత కాలం, ఆయనకు అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడం దారుణం.

LEAVE A RESPONSE